close

సైబర్‌ నేరగాళ్లు పొంచే ఉంటున్నారు

నెట్‌ వినియోగదార్ల వార్షిక వృద్ధి 44%
సైబర్‌ నేరాల పెరుగుదల 457%
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్ట ప్రకారమే ఇవి
నమోదు కానివి మరెన్నో
2011-16పై అసోచామ్‌ నివేదిక

దేశీయంగా ఇంటర్నెట్‌ వినియోగించే వారి సంఖ్య ఎంత వేగంగా పెరుగుతుందో.. ఆన్‌లైన్‌ మోసాలు కూడా అంతేస్థాయిలో అధికమవుతున్నాయి. కంప్యూటర్‌, మొబైల్‌ ద్వారా ఇంటర్నెట్‌ వినియోగించడం ప్రారంభించిన వారికి, సైబర్‌ భద్రతా చర్యలపై అవగాహన లేకపోవడం వల్ల నేరాలు ఎక్కువవుతున్నాయి. భౌతికంగా సొత్తు కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో అత్యధికులు సన్నద్ధంగానే ఉంటారు. అదే ఆన్‌లైన్‌కు వచ్చేసరికి ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతం నుంచి అయినా నేరం చేసే వీలుండటం, వీరి నుంచి కాపాడుకునే భద్రతా చర్యలపై అవగాహన కొరవడటం నేరస్తులకు కలిసివస్తోంది.

* సెల్‌ఫోన్లు, కంప్యూటర్లలోని వ్యక్తిగత-సంస్థాగత సమాచారాన్ని అపహరించడం, దానితో వేధింపులకు గురిచేయడం, బ్యాంక్‌ ఖాతాల వంటి సున్నిత సమాచారాన్ని సంగ్రహించి, ఆర్థికంగా నష్టపరచడం, ఆన్‌లైన్‌లో వేధించడం, దుర్భాషలు-అసత్యప్రచారం.. వంటి అధిక నేరాలు జరుగుతున్నాయి.
సైబర్‌ నేరాల నియంత్రణ చట్టం (2000) ప్రకారమే చూసినా.. 2011-2016 మధ్య ఇంటర్నెట్‌ వాడకందార్ల సంఖ్యలో 44 శాతం వార్షిక వృద్ధి లభిస్తే, సైబర్‌ నేరాల సంఖ్య 457 శాతం అధికమైందని అసోచామ్‌ (ది అసోసియేటెడ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా), ఎన్‌ఈసీ సంయుక్త అధ్యయనం వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం..

* 3వ స్థానం: అమెరికా, చైనా తరవాత ఇంటర్నెట్‌ వాడకందార్లు అధికంగా ఉన్న దేశం మనదే.

* సైబర్‌ నేరాలు అధికంగా జరిగేందుకు ఆస్కారమున్న దేశాల్లో తొలి 5 స్థానాల్లో భారత్‌ ఉంటుందని, సైబర్‌భద్రతా సంస్థ సిమాంటిక్‌ పేర్కొంది.

ఆధునిక పోలీసింగ్‌ విధానాల వల్ల..
ఆధునిక పోలీసింగ్‌ విధానాలు, సాంకేతికతల వల్ల వ్యక్తిగత సమాచారాన్ని చేరడం సులభమే. ఇందువల్ల వ్యక్తిగతంగా, సామాజికంగా సేవలు మెరుగ్గా అందించగలరు. నేరాల నియంత్రణ, పౌరుల భద్రతతో పాటు వ్యాపారసంస్థలకు భారం తగ్గించవచ్చు.
* సైబర్‌ నేరాలను అరికట్టే సమగ్ర వ్యవస్థలను రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడంతో పాటు, మిగిలిన సంస్థలు కూడా సహకరించేలా చూడాలి.
* సైబర్‌ నేరగాళ్లు ప్రాంతాలకతీతంగా ఎక్కడినుంచైనా తమ ప్రతాపం చూపిస్తుంటారు కనుక, వీరిపై పోరాడే జాతీయ-అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలతో అనుబంధం నెరపుతుండాలి.
* కేంద్రప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థల సహకారంతో, రాష్ట్ర స్థాయిల్లో పోలీసులు కూడా సైబర్‌ నేరాల నియంత్రణ వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాలి. అధికారులకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తుండాలి.

నేరాల నిరోధానికి..

సైబర్‌ నేరాలు నిరోధించేందుకు కేంద్రీకృత సైబర్‌ సెల్‌, జిల్లాస్థాయి ప్రత్యేక కేంద్రాలతో పాటు పోలీస్‌స్టేషన్లలోనూ సైబర్‌బృందాలను నియమించాలని అధ్యయనం పేర్కొంది. 

ఆధునిక సాంకేతికతతో పట్టేసే వీలు

కృత్రిమ మేధ, బిగ్‌డేటా అనలిటిక్స్‌, సీసీ కెమేరాలతో ముఖాన్ని గుర్తించే సామర్థ్యం, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వంటి ఆధునిక సాంకేతికతలతో సైబర్‌ నేరగాళ్లను గుర్తించి, పట్టేసుకునే విషయమై చట్ట సంస్థలకు అవగాహన పెరుగుతోంది. అయితే ఇవన్నీ జాతీయస్థాయిలో అమలు కావడం లేదు. రాష్ట్ర స్థాయిల్లో ఈ సాంకేతికతలు వినియోగిస్తున్నారు.

కేంద్రం ఆర్థికసాయం చేయాలి

ఇప్పటికే కేంద్రప్రభుత్వం, సీబీఐ, ఈడీ వంటి సంస్థలు సైబర్‌ నేరాల నిరోధ చర్యలు తీసుకోవడంలో ముందున్నాయి. రాష్ట్రాలు కూడా సైబర్‌ భద్రతా వ్యవస్థలు సమకూర్చుకునేందుకు, సాంకేతికతను మెరుగుపరచుకునేందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని కేంద్రప్రభుత్వం అందించాలి. 
* సైబర్‌ పరిశోధనాశాలలు నెలకొల్పడంతో పాటు అధికారులకు శిక్షణ ఇప్పించాలి. 
* సైబర్‌ నేరాలు కనిపెట్టడం, పరిష్కరించడం కూడా చట్టబద్ద సంస్థల విధుల్లో భాగం కావాలి.

 

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.