close

టీసీఎస్‌... రాణించెన్‌

14 త్రైమాసికాల గరిష్ఠానికి ఆదాయ వృద్ధి
రూ.8,105 కోట్లకు నికర లాభం మధ్యంతర డివిడెండు రూ.4
ముంబయి

2018ని బలమైన ఆదాయ వృద్ధితో ముగించాం. డిసెంబరు త్రైమాసికంలో ఆదాయం 12.1 శాతం వృద్ధిని కనబరచింది. ఇది 14 త్రైమాసికాల్లోనే గరిష్ఠ స్థాయి. అన్ని ప్రాంతాల్లోని కీలక విభాగాలు వృద్ధిని కొనసాగించడంతో ఇది సాధ్యమైంది. క్లయింట్ల నుంచి వచ్చిన ఆర్డర్లు బలంగా ఉండడం, డిజిటల్‌ సేవల్లో పరిశ్రమ కంటే మిన్నగా రాణించడం చూస్తే టీసీఎస్‌ సామర్థ్యాలకు క్లయింట్లు ఇచ్చిన గుర్తింపుగా భావిస్తున్నాం.
- రాజేశ్‌ గోపీనాథ్‌, సీఈఓ, ఎండీ, టీసీఎస్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టీసీఎస్‌ రాణించింది. నికర లాభం, ఆదాయాల్లో మెరుగైన వృద్ధిని నమోదు చేసింది. ఆదాయ వృద్ధిలో అయితే రికార్డు సృష్టించింది. 2018ని సంతృప్తికరంగా ముగించినట్లు కంపెనీ ఉన్నతాధికార్లు చెబుతున్నాయి.
నికర లాభం: నికర లాభం 24.1 శాతం వృద్ధితో రూ.8,105 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఇది రూ.6,531 కోట్లుగా నమోదైంది. టాటా గ్రూప్‌ మొత్తం నికర లాభంలో ఈ కంపెనీదే అత్యధిక భాగం అన్న సంగతి తెలిసిందే. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే లాభంలో వృద్ధి 2.6 శాతం మాత్రమే.

ఆదాయం: ఉత్తర అమెరికా మార్కెట్‌ రాణించడంతో కంపెనీ ఆదాయం 20.8 శాతం వృద్ధితో రూ.30,904 కోట్ల నుంచి రూ.37,338 కోట్లకు చేరింది. స్థిర కరెన్సీ పద్ధతిన ఆదాయ వృద్ధి 12.1 శాతంగా నమోదైంది. ఈ ఆదాయ వృద్ధి 14 త్రైమాసికాల్లోనే అత్యధికం కావడం గమనార్హం. అంతక్రితం త్రైమాసికం (జులై-సెప్టెంబరు 2018)తో పోలిస్తే ఈ వృద్ధి 1.3 శాతంగా ఉంది. మొత్తం ఆదాయాల్లో 30.1 శాతం వాటా ఉన్న డిజిటల్‌ సేవల విభాగం 52.7 శాతం వృద్ధిని సాధించింది.

* ఇక డాలర్లలో ఆదాయం చెప్పాలంటే అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే 0.67% పెరిగి 5250 మిలియన్‌ డాలర్లుగా నమోదైంది. స్థిర కరెన్సీ పద్ధతిన వృద్ధి 1.8 శాతంగా ఉంది. అంతక్రితం త్రైమాసికం ఈ వృద్ధి 3.7 శాతంగా ఉంది.

ఎబిట్‌: వడ్డీ, పన్నులకు ముందు ఆదాయం(ఎబిట్‌) 2.12 శాతం తగ్గి(అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే) రూ.9564 కోట్లకు తగ్గింది. మార్జిన్‌ సైతం 26.5 శాతం నుంచి 25.6 శాతానికి పరిమితమైంది.

ఉద్యోగులు: అక్టోబరు-డిసెంబరు 2018 త్రైమాసికంలో టీసీఎస్‌ నికరంగా 6827 మంది ఉద్యోగులను జత చేసుకోవడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,17,929కి చేరింది. వలసల రేటు 11.2 శాతంగా నమోదైంది. 2018లో అమెరికాలో అత్యధిక స్థాయిలో నియమాకాలు చేపట్టినట్లు కంపెనీ మానవ వనరుల అంతర్జాతీయ అధిపతి అజయ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. ఎంత మందిని నియమించుకున్నదీ వెల్లడించనప్పటికీ ఈ నియామకాల కోసం 70 విశ్వ విద్యాలయాలకు వెళ్లినట్లు తెలిపారు.

నగదు నిల్వలు: డిసెంబరు చివరి నాటికి కంపెనీ వద్ద రూ.43,000 కోట్ల విలువైన నగదు, నగదు సమాన నిల్వలున్నాయి.

భవిష్యత్‌పై అంచనాలు: ‘ఈ త్రైమాసికంలో మంచి ఆర్డర్లు ఉన్నాయి. వచ్చే ఏడాదికి ఇవి మాకు దన్నుగా నిలుస్తాయ’ని కంపెనీ ఎండీ, సీఈఓ రాజేశ్‌ గోపీనాథ్‌ గురువారమిక్కడ ఫలితాల విడుదల సందర్భంగా పేర్కొన్నారు.  ఐటీ వ్యయాల్లో ఏ మాత్రం కోతలు ఉండవని మా క్లయింట్లు అన్నారని ఆయన వివరించారు. మార్చి త్రైమాసికం మధ్యకల్లా మా ఫలితాలపై స్పష్టత వస్తుందని తెలిపారు. కాగా, పూర్తి సంవత్సరానికి రెండంకెల ఆదాయ వృద్ధిని నమోదు చేయడానికి కంపెనీ సంసిద్ధంగా ఉందని గోపీనాథ్‌ అన్నారు.

వివిధ కరెన్సీలతో పోలిస్తే రూపాయి హెచ్చుతగ్గులకు గురి అయినప్పటికీ, కొన్ని ప్రధాన మార్కెట్లలో వ్యాపార వ్యయాలు పెరిగినప్పటికీ.. టీసీఎస్‌ ఆపరేటింగ్‌ మార్జిన్లు మెరుగ్గా రాణించాయని కంపెనీ సీఎఫ్‌ఓ వి రామకృష్ణన్‌ పేర్కొన్నారు. ‘మా కార్యకలాపాలపై దృష్టి కొనసాగిస్తాం. మేం అనుకున్నశ్రేణికి లాభదాయకతను తీసుకువచ్చాం. భవిష్యత్‌ వృద్ధి కోసం పెట్టుబడులనూ కొనసాగిస్తామ’ని ఆయన అన్నారు. సమీక్షిస్తున్న త్రైమాసికంలో లండన్‌కు చెందిన డబ్ల్యూ12 స్టూడియోస్‌ను రూ.66 కోట్లతో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, కంపెనీ ఆదాయాల విషయంలో అంచనాలను మించి రాణించిందని.. కానీ మార్జిన్ల విషయంలో అంచనాలను తప్పిందని విశ్లేషకులు అంటున్నారు.

* బీఎస్‌ఈలో టీసీఎస్‌ షేరు 0.35 శాతం లాభంతో రూ.1,888.15 వద్ద ముగిసింది.

వివిధ వ్యాపార విభాగాలు

* బీఎఫ్‌ఎస్‌ఐ విభాగంలో 8.6% వృద్ధి
* డిజిటల్‌ ఆదాయం: 52.7% వృద్ధి 
* బ్రిటన్‌, ఐరోపాల్లో వృద్ధి 25.1% 

డివిడెండు

ఒక్కో షేరుకు రూ.4 మధ్యంతర డివిడెండును కంపెనీ ప్రకటించింది. రికార్డు తేదీ జనవరి 18గా తెలిపింది. ఇది మూడో మధ్యంతర డివిడెండు కావడం గమనార్హం.

కాంట్రాక్టులు

డిసెంబరు త్రైమాసికంలో కాంట్రాక్టుల విలువ 5.9 బిలియన్‌ డాలర్లుగా నిలిచింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఇది 4.9 బి. డాలర్లుగా ఉంది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో 100 మిలియన్‌ డాలర్ల విలువైన ఒక క్లయింటును జత చేసుకుంది.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.