close

అమెజాన్‌ అడుగులు ఎటువైపు? 

బెజోస్‌ దంపతుల విడాకుల ప్రకటన నేపథ్యం

ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ తన భార్యతో విడాకులు తీసుకుంటున్నారు. విడిపోవడం అన్నది అమెరికా కుటుంబ వ్యవస్థలో పెద్ద విషయం కాదు కానీ.. ఇక్కడి వ్యక్తి ప్రపంచ కుబేరుడు కావడమే అసలు విషయం. ఈ పరిణామం నేపథ్యంలో వేల ఉద్యోగుల కుటుంబాలతో పాటు మదుపర్ల భవితవ్యంతో ముడి పడి ఉన్న ఈ పరిణామం అమెజాన్‌ను ఎటు వైపునకు అడుగులు వేయిస్తుందన్నది తేలాల్సి ఉంది. 
బెజోస్‌ దంపతుల పరిణయం ఈ మధ్య జరిగిందేమీ కాదు. వాల్‌స్ట్రీట్‌లో హెడ్జ్‌ ఫండ్‌ మేనేజరుగా బెజోస్‌ పనిచేస్తున్న సమయంలో అంటే 1992లో ఈ జంట కలిసింది. అప్పటికి అమెజాన్‌ను ఏర్పాటు చేయలేదు. ఒక ఏడాది కంటే తక్కువ సమయంలోనే మనసులు కలిశాయి. 1993 సెప్టెంబరులో ఫ్లోరిడాలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాతి ఏడాదే సియాటెల్‌లోని ఒక గ్యారేజీలో బెజోస్‌ తన అంకుర సంస్థ అమెజాన్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అమెజాన్‌ ఇంతలింతలు అయ్యేంత వరకు బెజోస్‌ భార్య మెకంజీ వెన్నంటే ఉంది. కానీ బుధవారం అంటే దాదాపు పాతికేళ్ల తర్వాత తాము విడిపోతున్నట్లుగా ప్రకటించారు. 
మరి ఇపుడు ఏమవుతుంది 
బెజోస్‌కు ఇపుడు 54 ఏళ్లు. భార్య, నవలా రచయిత్రి అయిన మెకంజీకి 48 ఏళ్లు. వీరికి ముగ్గురు కుమారులు. ఒక దత్త కుమార్తె ఉన్నారు. ఈ విషయాలను పక్కనపెడితే ఫ్లోరిడాలో వీరి పెళ్లి జరిగినా.. చివర్లో(విడాకులు తీసుకోవాలనుకున్నప్పటికి) ఎక్కడ ఉన్నారన్న దాన్ని బట్టి విడాకుల ప్రక్రియ ఉంటుందని ఏఎఫ్‌పీ అంటోంది. వీరికి అమెజాన్‌ ప్రధాన కార్యాలయం ఉన్న సియాటెల్‌తో పాటు వాషింగ్టన్‌ డీసీ, టెక్సాస్‌, బెవర్లీ హిల్స్‌, కాలిఫోర్నియాల్లోనూ నివాసాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాంతం పెద్ద విషయం కాదని అట్లాంటాలోని కుటుంబ చట్ట సంస్థ అయిన కెస్లర్‌ ప్రతినిధి అంటున్నారు. విషయం ఏమిటంటే అక్కడి చట్టాల ప్రకారం.. ముందస్తు ఒప్పందం లేకపోతే భాగస్వామికి తన ఆస్తిలో సగం ఇవ్వాల్సి ఉంటుంది. 
ఎంత ఆస్తి వెళుతుంది 
ప్రస్తుతం బెజోస్‌కున్న ఆస్తుల్లో ఎక్కువ భాగం అమెజాన్‌ షేర్ల రూపంలో ఉన్నవే. గురువారం నాటి లెక్కల ప్రకారం.. బెజోస్‌కు అమెజాన్‌లో ఉన్న 18 శాతం(7.9 కోట్ల షేర్లు) వాటా 130 బిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.9.1 లక్షల కోట్లు). విడాకుల సెటిల్‌మెంటు జరగాలంటే ఈ షేర్లలోనూ సగం వాటా ఆమెకు వెళ్లే అవకాశం ఉంది. అంటే ఆమెకు అమెజాన్‌లో 8 శాతం(రూ.4.5 లక్షల కోట్లకు పైగా) వాటా దక్కుతుంది. ఇక ఓటింగ్‌ హక్కుల విషయం పెద్దగా ప్రస్తావనలోకి రాదు. ప్రస్తుతం జెఫ్‌ బెజోస్‌ ఒక మైనారిటీ వాటాదారు కావడం ఇందుకు నేపథ్యం. 
కంపెనీలో వారి పరిస్థితి ఏమిటి? 
బెజోస్‌ భార్యకు సగం షేర్లు వెళితే ఆమె కూడా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరుగా మారతారు. ఒక వేళ విడాకుల ఒప్పందంలో భాగంగా వారు తమ షేర్లను ఒక ట్రస్టు లేదా ఏదైనా చట్టబద్ధ వ్యవస్థలోకి బదిలీ చేసి.. అమెజాన్‌ వాటాదార్లలో తమ అధికారాన్ని అట్టే పెట్టిఉంచుకునే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీని రక్షించుకోవాలంటే.. కంపెనీ కార్యకలాపాలకు ఇబ్బంది రాకుండా షేర్ల ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అందుకు వేచి చూడాల్సి ఉంది. ఇక అత్యధిక వ్యక్తిగత వాటా వీరిద్దరిదే కానుంది. ఒక వేళ 8%, 8 శాతంగా విడిపోయినా వీరిదే పైచేయి. ఎందుకంటే రెండో అత్యధిక వ్యక్తిగత వాటా 6 శాతమే. ఇది వాన్‌గార్డ్‌ చేతిలో ఉంది. 
కంపెనీ పరిస్థితి ఏమిటి? 
ఒక వేళ విడాకుల ఒప్పందంలోనూ వారి అభిప్రాయాలు పొసగకపోతే అన్నదే అసలు ప్రశ్న. అపుడు కంపెనీపై నీలినీడలు కమ్ముకుంటాయి. ఒక వేళ మెకంజీ తన వాటాను ఇతరులకు విక్రయిస్తుందా? లేదంటే తన వద్దే ఉంచుకుంటుందా అన్నది ఇపుడే చెప్పలేం. ఒక వేళ ఇతర పోటీ సంస్థలు ఇదే అదనుగా భావించి ఆమె వద్ద వాటాను కొనుగోలు చేస్తే సమీకరణాలు పూర్తిగా మారిపోవచ్చు. ఇప్పటికే తక్కువ వాటా ఉన్న కారణంగా భవిష్యత్‌లో బెజోస్‌ చేతి నుంచి కంపెనీ జారినా జారిపోవచ్చు.  బెజోస్‌ తర్వాత అధిక వాటా ఉన్న వాన్‌గార్డ్‌ కూడా పావులు కదిపినా ఆశ్చర్యం లేదు. అపుడు కంపెనీలో ఆధిపత్యంపై పోరు తప్పదు. అదే జరిగితే వేలకొద్దీ కుటుంబాలు, మదుపర్ల పరిస్థితిని ఊహించలేం. ఈ పరిణామాల మధ్య అమెజాన్‌ భవితవ్యం ఎటు వెళుతుందన్న అపుడే చెప్పలేమని అమెరికా మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. 
కోర్టుకు వెళ్లకపోవచ్చు 
న్యాయనిపుణుల అంచనాల ప్రకారం.. వీరిద్దరూ కోర్టు బయట సెటిల్‌మెంట్‌ చేసుకోవచ్చు. వీరిద్దరూ కానీ.. వీరి లాయర్ల ద్వారా కానీ ఇది జరగవచ్చని భావిస్తున్నారు. చర్చల్లో అయినా కూడా సగం వాటాను ఆమె, ఆమె తరఫు న్యాయవాది కోరే అవకాశం ఉందని అంటున్నారు. ఒక వేళ వీరిద్దరి మధ్య పెళ్లికి ముందు ఒప్పందం(ప్రీనప్షల్‌ అగ్రిమెంట్‌) జరిగి ఉంటే బెజోస్‌ భార్యకు పరిమితంగానే ఆస్తి దక్కేది. అమెరికాలో ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకునే ముందు ఇటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటుంటారు. ఇలా చేసినపుడు పెళ్లికి ముందు ఎవరి ఆస్తులు ఎంత అన్నది అందులో పొందుపరుస్తారు. అదే సమయంలో పెళ్లి తర్వాత ఇరువురి ఆస్తులపై హక్కులు ఎలా ఉండాలో కూడా రాసుకుంటారు. అయితే 1993లో జరిగిన బెజోస్‌ దంపతుల వివాహ సమయంలో ఇటువంటి ఒప్పందం జరగలేదు.

-(ఈనాడు వాణిజ్య విభాగం)

వాషింగ్టన్‌ స్టేట్‌ లా ఏ చెబుతోంది

బెజోస్‌ దంపతులకు పలు చోట్ల నివాసాలున్నప్పటికీ.. వాళ్లిద్దరూ వాషింగ్టన్‌లోనే విడాకులకు దరఖాస్తు చేస్తారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాషింగ్టన్‌ రాష్ట్ర చట్టాల ప్రకారం.. పెళ్లి అనంతరం సమకూర్చుకున్న ఆస్తులన్నీ ఇద్దరూ కలిసి సంపాదించినవనే భావిస్తారు. అంటే ఒక వేళ విడాకులు తీసుకుంట.. పెళ్లి తర్వాత సంపాదించిన ఆస్తులన్నిటినీ పంచుతారన్నమాట. అయితే కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడ సగం, సగం ఏమీ పంచరు. అయితే బెజోస్‌ కేసు విషయానికొస్తే.. వీరి పెళ్లి అయి చాలా కాలం అయింది. వీరిద్దరి పెళ్లి తర్వాతే అమెజనా్ ఏర్పాటు జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కోర్టులు ఆస్తులను దాదాపు సగానికి చేయవచ్చంటున్నారు.

విడాకులకు కారణమేమిటి?

మెరికా వార్తా పత్రిక ద నేషనల్‌ ఎంక్వైరర్‌ కథనం ప్రకారం.. బెజోస్‌కు హాలీవుట్‌ టాలెంట్‌ ఏజెంట్‌ పాట్రిక్‌ వైట్‌షెల్‌ భార్య, మాజీ రిపోర్టర్‌ లారన్‌ షాంజ్‌తో సంబంధం ఉంది. ఎనిమిది నెలల కింద వీరిరువురు దగ్గరయ్యారని ఆ పత్రిక అంటోంది. ఆ సంబంధమే ఈ తెగదెంపులకు కారణమని తన కథనంలో వివరించింది.

అమెజాన్‌ గురించి..

అంతక్రితం పేరు: కెడబ్రా ఇంక్‌(1994-95) 
సేవలు: క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఇ-కామర్స్‌, కృత్రిమ మేధ, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌. 
ఏర్పాటు: జులై 5, 1994 
వ్యవస్థాపకుడు: జెఫ్‌ బెజోస్‌ 
ప్రధాన కార్యాలయం: సియాటెల్‌, వాషింగ్టన్‌,అమెరికా 
సేవలందించేప్రాంతం: ప్రపంచవ్యాప్తంగా 
ఉత్పత్తులు: అమెజాన్‌ యాప్‌స్టోర్‌, అమెజాన్‌ ఈకో, అమెజాన్‌ కిండిల్‌, అమెజాన్‌ ప్రైమ్‌, అమెజాన్‌ వీడియో, కామిక్సాలజీ 
ఆదాయం: 177.86 బి. డాలర్లు(2017) 
నికర లాభం: 3.033 బి. డాలర్లు(2017) 
ఉద్యోగుల సంఖ్య: 6,13,300

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.