close

పసిడి తిరోగమనం!

బంగారం, వెండి

నాలుగు వారాలుగా పెరుగుతూ వస్తున్న, పసిడి ఏప్రిల్‌ కాంట్రాక్టు గత సోమవారం రూ.33,750 వద్ద సానుకూలంగా ఆరంభమైనా, ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. దీంతో కాంట్రాక్టు రూ.33,011 స్థాయికి దిగివచ్చింది. శుక్రవారం కాస్తంత కొనుగోళ్ల మద్దతు లభించినా, వారం మొత్తం మీద 1.51% నష్టపోయి రూ.33,242 వద్ద కాంట్రాక్టు ముగిసింది. ఈవారం సాంకేతిక చార్ట్‌ల ప్రకారం చూస్తే పసిడి కాంట్రాక్టు తిరోగమన బాట పట్టొచ్చు. అమెరికాలో ప్రభుత్వ తాత్కాలిక మూసివేతకు సంబంధించి చోటుచేసుకునే పరిణామాలు, ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ వ్యాఖ్యలు, వెల్లడయ్యే కీలక ఆర్థిక గణాంకాలు ఈ కాంట్రాక్టుకు దిశానిర్దేశం చేస్తాయి. అందువల్ల రూ.33,126 దిగువన కాంట్రాక్టును షార్ట్‌సెల్‌ చేయడం మంచిది. అయితే రూ.33,496 వద్ద తప్పక స్టాప్‌లాస్‌ పరిగణించాలి. వెండి మార్చి ఫ్యూచర్‌ కాంట్రాక్టు కిందటివారం రూ.40,505 వద్ద ఆరంభమై, రూ.40,716 వద్ద వారం గరిష్ఠాన్ని చేరాక దిద్దుబాటుకు లోనయ్యింది. తదుపరి రూ.39,725 స్థాయికి దిగివచ్చినా, ఆఖరుకు 0.96% నష్టంతో రూ.40,118 వద్ద ముగిసింది. ఈవారం రూ.39,901 కంటే దిగువకు రాకుంటేనే లాంగ్‌ పొజిషన్లు కొనసాగించాలి. ఈ స్థాయి వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవడం మరవద్దు. అమెరికాలో షట్‌డౌన్‌ పరిణామం కొనసాగితే రూ.40,647 స్థాయికి దిగువన కాంట్రాక్టును షార్ట్‌సెల్‌ చేయొచ్చు. అయితే రూ.40,912 కంటే పైన స్టాప్‌లాస్‌ను తప్పక పరిగణించాలి.

ప్రాథమిక లోహాలు

రాగి ఫిబ్రవరి కాంట్రాక్టు ఈ వారం సానుకూలంగానే కనిపిస్తున్నా, రూ.452.60 వద్ద నిరోధం కనిపిస్తోంది. ఈ స్థాయిని అధిగమించకుంటే ఊగిసలాటకు అవకాశం ఉంటుంది. షార్ట్‌ సెల్‌ చేయదలిస్తే రూ.439.80 దిగువకు వచ్చే వరకు వేచిచూసి అప్పుడు పొజిషన్లు తీసుకోవడం మంచిది. అయితే రూ.446.85 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి. సీసం ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.151 కంటే పైన నిలదొక్కుకోకుంటే బలహీనంగా కదలాడే అవకాశం ఉంటుంది. అందువల్ల రూ.151 దరిదాపులో స్టాప్‌లాస్‌ను పరిగణిస్తూ.. ధర పెరిగినప్పుడల్లా షార్ట్‌ సెల్‌ చేసుకుంటూ పోవడం మంచి వ్యూహం అవుతుంది. జింక్‌ ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం కూడా సానుకూలంగానే ఉన్నందున, కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు. కొంత అమ్మకాల ఒత్తిడికి ఆస్కారం ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని, రూ.192.55 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకొని ప్రస్తుత లాంగ్‌ పొజిషన్లు కొనసాగించాలి. అల్యూమినియం ఫిబ్రవరి కాంట్రాక్టు ఈ వారం రూ.135.55 కంటే పైన నిలదొక్కుకుంటే సానుకూలంగా చలించొచ్చు. అందువల్ల రూ.133.55 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకొని, లాంగ్‌ పొజిషన్లు తీసుకోవడం మంచిదే. ఈవారం నికెల్‌ కాంట్రాక్టు రూ.888 కంటే దిగువన ట్రేడయితే రూ.838 వరకు పడే అవకాశం ఉంది.

ఇంధన రంగం

ముడి చమురు ఫిబ్రవరి కాంట్రాక్టు ఈ వారం రూ.3,959 కంటే పైన కదలాడకుంటే మరింత డీలా పడొచ్చు. రూ.3760 దిగువన కాంట్రాక్టును షార్ట్‌ సెల్‌ చేయొచ్చు. అయితే రూ.3,888 వద తప్పక స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో గత రెండు వారాలు సహజ వాయువు ఫిబ్రవరి కాంట్రాక్టు ధరలు బాగా దిద్దుబాటు అయ్యాయి. సాంకేతికంగా ఓవర్‌సోల్డ్‌ పరిధిలో ఉన్నప్పటికీ కొనుగోళ్లకు సానుకూల పరిస్థితులైతే లేవు. అందువల్ల కొంత సమయం పాటు వేచిచూడడం మంచిది. ముడి పామోలిన్‌ నూనె (సీపీఓ) ఫిబ్రవరి కాంట్రాక్టు ఈ వారం సానుకూలంగానే కనిపిస్తున్నప్పటికీ సమీప నిరోధ స్థాయిని దృష్టిలో ఉంచుకొని లాభాల స్వీకరణ చోటుచేసుకునే అవకాశమూ లేకపోలేదు. అందువల్ల స్టాప్‌లాస్‌ను పరిగణిస్తూ లాంగ్‌ పొజిషన్లు కొనసాగించడం మంచిది.

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌
 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.