close

35900-36200శ్రేణిలో మద్దతు

సెన్సెక్స్‌ విశ్లేషణ
ఫిబ్రవరి 8తో ముగిసిన వారానికి

సమీక్ష : అంతర్జాతీయ మార్కెట్లలో అప్రమత్తత, దేశీయ కార్పొరేట్ల నిరుత్సాహకర త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో గత వారం సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య వివాదానికి ఎటువంటి పరిష్కారం లభించకపోవడం, అంతర్జాతీయ వృద్ధి భయాలు ప్రతికూల ప్రభావం చూపాయి. షేరు ఆధారిత కదలికలు, త్రైమాసిక ఫలితాలు మార్కెట్లకు దిశానిర్దేశం చేయడంతో చిన్న, మధ్య శ్రేణి షేర్లు భారీగా దిద్దుబాటుకు గురయ్యాయి. బడ్జెట్‌ లక్ష్యమైన రూ.6.24 లక్షల కోట్లలో, ద్రవ్యలోటు డిసెంబరుకే 112.4 శాతానికి చేరడం సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. నిక్కీ సేవల పీఎంఐ జనవరిలో 3 నెలల కనిష్ఠానికి చేరడమూ తోడైంది. అంతర్జాతీయ వృద్ధి భయాలు, అమెరికా- చైనా వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు స్తబ్దుగా కదలాడాయి. బ్రెగ్జిట్‌పై ఆనిశ్చితి పెరగడం ప్రతికూలమైంది. దేశీయంగా చూస్తే.. ఆర్‌బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించి 6.25 శాతం చేసింది. టాటా మోటార్స్‌ ఫలితాలు నిరాశపరిచాయి. ఆర్‌కామ్‌ దివాలా పరిష్కార ప్రక్రియకు వెళ్లడంతో అనిల్‌ అంబానీ నేతృత్వంలోని అడాగ్‌ గ్రూప్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 0.2 శాతం పెరిగి 36,546 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 0.5 శాతం లాభంతో 10,944 పాయింట్ల దగ్గర స్థిరపడింది. ఐటీ, మన్నికైన వినిమయ వస్తువులు, బ్యాంకింగ్‌ షేర్లు రాణించగా, విద్యుత్‌, యంత్ర పరికరాలు, లోహ స్క్రిప్‌లు డీలాపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.2265 కోట్ల షేర్లను కొనుగోలు చేయగా, డీఐఐలు, ఫండ్ల విక్రయాలు రూ.12 కోట్లుగా నమోదయ్యాయి.
లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 2:3గా నమోదు కావడం..
చిన్న, మధ్య శ్రేణి షేర్లలో అప్రమత్తత కొనసాగడాన్ని సూచిస్తోంది.

ఈవారంపై అంచనా
గత వారం ప్రారంభంలో సెన్సెక్స్‌ కీలక 36,750 పాయింట్లను అధిగమించింది. అయితే 37,172 పాయింట్ల వద్ద లాభాల స్వీకరణ ఎదురు కావడంతో గరిష్ఠాల నుంచి వెనక్కి వచ్చింది. చివరకు స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్‌కు 35900- 36200 శ్రేణిలో మద్దతు లభించొచ్చు. ఈ స్థాయి కోల్పోతే మరింత బలహీనపడొచ్చు.

ప్రభావిత అంశాలు   
అంతర్జాతీయ సంకేతాలు, దేశీయ ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. దేశీయంగా చూస్తే.. 12న పారిశ్రామికోత్పత్తి, రిటైల్‌ ద్రవ్యోల్బణం, 13న టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్నాయి. ఇక చివరి దశకు చేరుకున్న మూడో త్రైమాసిక ఫలితాలపై మదుపర్లు దృష్టి పెట్టనున్నారు. ముడిచమురు ధరలు, డాలర్‌తో రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ, డీఐఐల పెట్టుబడుల ధోరణి నుంచి మదుపర్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. భారీ రుణభారం ఉన్న వ్యాపార సంస్థలు, కంపెనీలు సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఇటువంటి సంస్థలపై మదుపర్లు ఓ కన్నేయొచ్చు. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా- చైనా వాణిజ్య పరిణామాలు కీలకం కానున్నాయి. ఒప్పందానికి ఇరు దేశాలు ఇప్పటికీ చాలా దూరంలో నిలవడం కలవరపెడుతోంది. అంతర్జాతీయ వృద్ధి భయాలు మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపొచ్చు. బ్రిటన్‌ నాలుగో త్రైమాసిక గణాంకాలు నేడు, 14న చైనా ఎగుమతి, దిగుమతుల గణాంకాలు వెలువడనున్నాయి.
తక్షణ మద్దతు స్థాయిలు: 36,221, 35,740, 35,375;
తక్షణ నిరోధ స్థాయిలు: 36,873, 37,172, 37,489
మార్కెట్లకు 35,900- 36,200 పాయింట్ల శ్రేణిలో మద్దతు లభించే అవకాశం ఉంది.

- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ
 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.