close
చైనా వస్తువులు కొనాలా.. వద్దా..!

మసూద్‌కు మద్దతుపై ఆగ్రహావేశాలు

1945లో జపాన్‌పై అమెరికా అణుబాంబు విసిరింది. ఆరోజు లగాయతు.. ఇప్పటిదాకా.. జపాన్‌ మార్కెట్లో అమెరికా కేవలం గుండి సూది కూడా అమ్మలేకపోతోంది.కారణం.. అమెరికా తయారుచేసే ఏ ఒక్క వస్తువునూ కొనుగోలు చేయకూడదని జపాన్‌ ప్రజలు స్వచ్ఛందంగా పెట్టుకున్న ఓ కట్టుబాటు.

నిజమైన దేశభక్తికి, సమైక్యతకు ఇదో నిలువెత్తు నిదర్శనం.

చైనా.. పైకి మనతో చేతులు కలుపుతున్నట్లే ఉంటుంది. అది నిజమనుకునేలోపే ఆ చేతుల్ని కర్కశంగా నలిపేస్తూనే ఉంది. పాకిస్థాన్‌కు పరోక్ష మద్దతిస్తూ.. భారత్‌ను అణిచివేయడానికి యథాశక్తి ప్రయత్నిస్తూనే ఉంది. అయితేనేం.. మన చేతుల్లో చైనా మొబైళ్లు, ఇంట్లో చైనా వస్తువులు నాట్యమాడతాయి.

జపాన్‌ మాదిరి మనం కూడా కట్టుబాటు పెట్టుకోలేమా..

ఆ దేశ ఉత్పత్తులపై నిషేధం విధించలేమా?... అంటూ సామాజిక మాధ్యమాలు వేదికగా సగటు భారతీయుల్లో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. అయితే చైనా దిగుమతులపై ఇప్పటికిప్పుడు నిషేధం విధిస్తే భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తప్పదంటున్నాయి కొన్ని వర్గాలు.. వీటిని విశ్లేషిస్తే...

ఈనాడు వాణిజ్య విభాగం

మసూద్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత్‌కు మద్దతుగా బ్రిటన్‌, ఫ్రాన్స్‌, అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సాంకేతిక కారణాలు చూపుతూ చైనా నిలిపివేసింది. దాంతో ఐక్యరాజ్యసమితి కూడా ప్రస్తుతానికి ఈ అంశాన్ని పక్కకుపెట్టింది. అంతర్జాతీయ వేదికలపై భారతీయ ప్రయోజనాలకు చైనా అడ్డుతగలడం ఇదే మొదటిసారి కాదు. గతంలో చాలా సార్లు ఇలాగే మోకాలడ్డువేసింది. ముఖ్యంగా మసూద్‌ విషయంలో. చైనా ఇలా వ్యవహరించినప్పుడల్లా భారతీయుల నుంచి వినిపించే మొట్టమొదటి డిమాండు... ఆ దేశ ఉత్పత్తులపై నిషేధం విధించాలనే. ఎందుకంటే.. చిన్న ఆటవస్తువుల దగ్గర నుంచి స్మార్ట్‌ఫోన్ల వరకు చాలానే ఉత్పత్తులు చైనా నుంచి భారత్‌దేశానికి దిగుమతి అవుతుంటాయి. చైనాకు ప్రధాన విపణుల్లో భారత్‌ కూడా ఒకటి. ఆ దేశంలోని పలు తయారీ సంస్థలు భారత్‌పై ఆధారపడి ఉన్నాయి కూడా. ఇంతగా చైనా ఆర్థిక వ్యవస్థకు భారత విపణి తోడ్పడుతున్నప్పుడు.. ఆ దేశం మాత్రం భారత్‌ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుండటం ఎంత వరకు సమంజసం. అందుకే ఆ కోపంతోనే చైనా వస్తువులపై నిషేధం విధించాలనే మాట భారతీయుల నోట తరచూ వినిపిస్తుంటుంది.

నిషేధం విధిస్తే ఏం జరుగుతుంది?

చైనా ఉత్పత్తులపై నిషేధం విధించడం ద్వారా ఆ దేశంపై భారత్‌ ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుందన్నది చాలా మంది అభిప్రాయం. అయితే ఇలా చేయడం వల్ల చైనా కంటే భారత్‌కే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతాయన్నది కొందరి విశ్లేషణ. భారత్‌కు అత్యంత ముఖ్యమైన వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో చైనా ఒకటి. భారత్‌ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తుల కంటే చైనా నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే ఉత్పత్తులే ఎక్కువ. ఒకవేళ ఇరుదేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తలెత్తితే భారత్‌పైనే ఎక్కువగా ప్రభావం ఉండొచ్చనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా దేశీయ మొబైల్‌ రంగంపై. ప్రస్తుతం భారత్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రంగాల్లో ఇది ఒకటి. మనదేశానికి దిగుమతి అయ్యే స్మార్ట్‌ఫోన్లలో సింహభాగం చైనా నుంచి దిగుమతి అయ్యేవే. షియోమీ, ఒప్పో, వివో, వన్‌ప్లస్‌.. ఇవన్నీ కూడా చైనా మోడళ్లే.  ఇలాంటప్పుడు చైనా ఉత్పత్తులపై నిషేధం విధిస్తే.. దేశీయ మొబైల్‌ రంగంపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉంటుందా? అనే వాదనను వినిపిస్తున్నారు. పైగా చైనా ఉత్పత్తులపై నిషేధం విధిస్తే.. వేరే దేశం నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది. అప్పుడు చైనాతో ఉన్న వాణిజ్య ఉద్రిక్తతలను అనుకూలంగా మల్చుకొని ఇతర దేశాలు మరింత ఎక్కువ ధరకు మనకు ఉత్పత్తులు విక్రయించే పరిస్థితులు రావచ్చు.

ఏది మంచిది?

‘అవసరమైతే పస్తులు ఉండేందుకైనా సిద్ధమవుతాం కాని.. మనకు పడని వ్యక్తి దగ్గరకు వెళ్లి చేయిచాచం కదా’.. ఇది చైనా దిగుమతులపై నిషేధాన్ని సమర్థిస్తూ కొందరు చెబుతున్న మాట. దేశభక్తి విషయానికొస్తే.. ఈ మాట నూటికి నూరుపాళ్లు అక్షర సత్యం. మనదేశ సార్వభౌమ సత్తాను చాటేందుకు చైనా విషయంలో మనం కూడా జపాన్‌ ప్రజలు మాదిరి నిర్ణయం తీసుకోవాల్సిందే. అదే సమయంలో చైనా దిగుమతులతో ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయమే. ఎందుకంటే.. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశంగా భారత్‌ ముందుకెళ్తోంది. ఇలాంటి సమయంలో వాణిజ్య ఉద్రిక్తతల జోలికి వెళ్లకపోవడమే మంచిదనే అభిప్రాయం వినిపిస్తోంది. మనదేశంలో ఇప్పుడిప్పుడే తయారీ రంగం విస్తరిస్తోంది. అందువల్ల తక్షణమే నిషేధం విధించడం కంటే.. క్రమక్రమంగా చైనా దిగుమతులపైఆధారపడటాన్ని భారత్‌ తగ్గించుకోవాలి. తయారీ రంగ అభివృద్ధిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. అలా చేసినప్పుడు కచ్చితంగా రానున్న సంవత్సరాల్లో ‘ఇది చైనా వస్తువు’ అనే మాట భారత్‌లో వినిపించకుండా చేసే వీలుంటుంది.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.