close
ఎందుకో.. ఈ ప్రేమ!

మార్కెట్లలోకి రూ.30,000 కోట్ల విదేశీ పెట్టుబడులు
సూచీల జోరుకు ఇదే కారణం
   బ్యాంకు షేర్లపైనే ఎక్కువ దృష్టి

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైందో లేదో దేశీయ మార్కెట్లలో జోరు కనిపిస్తోంది. ఎన్‌డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న ఎన్నికల ముందస్తు సర్వేలతో మార్కెట్లలో బలం కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనతలున్నా సరే సోమవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు సూచీలు పెరగడమే దీనికి నిదర్శనమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే షెడ్యూల్‌ విడుదలైన తర్వాత రోజు నుంచి వరుసగా మూడు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ సుమారు 1,100 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్ల మేర లాభపడ్డాయి. ఇంతకీ సూచీలు ఇంతలా పెరగడానికి కారణాలు ఏమిటని విశ్లేషిస్తే..

* విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) ఫిబ్రవరి 1 నుంచి దేశీయ మార్కెట్లలో పెట్టుబడులు గుమ్మరిస్తున్నారు. గడిచిన 28 ట్రేడింగ్‌ సెషన్లలో సుమారు రూ.30,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. తొలి 15 ట్రేడింగ్‌ సెషన్లలో రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌ఫీఐలు తర్వాత ఒక్కసారిగా చెలరేగిపోయారు. దీంతో సెన్సెక్స్‌ 1600 పాయింట్లు పెరిగింది. 52 వారాల గరిష్ఠానికి కేవలం 1,200 పాయింట్ల దూరంలో ఉంది.

* గత ఏడాది బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్నును (ఎల్‌టీసీజీ) తిరిగి ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించడంతో ఎఫ్‌పీఐలు డీలా పడ్డారు. ఏకంగా ఈక్విటీ మార్కెట్ల నుంచి గత ఏడాది రూ.32,628 కోట్లు వెనక్కు తీసుకున్నారు. అయితే మళ్లీ వారు ఇప్పుడు పెట్టుబుడులు పెట్టేందుకు ఆసక్తి చూపించడం విశేషం.

* ఎఫ్‌పీఐలు ప్రధానంగా బ్యాంకింగ్‌ షేర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్‌ఎస్‌డీఎల్‌ వద్ద ఉన్న సమాచారం మేరకు రూ.9,154 కోట్లు బ్యాంక్‌ షేర్లలో వారు పెట్టుబడులు పెట్టారు. అందుకే ప్రైవేటు రంగ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి బ్యాంకు షేర్లు 52 వారాల గరిష్ఠానికి చేరాయి.

* బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో (ఎన్‌బీఎఫ్‌సీలు) రూ.1,172 కోట్లు, ఐటీ షేర్లలో రూ.684 కోట్లు, మీడియా షేర్లలో రూ.671 కోట్లు పెట్టుబడులు గుమ్మరించారు. వీటితోపాటు రసాయనాలు, ఔషధ, బీమా, టెలికాం రంగ షేర్లపైనా వారు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు సమాచారం.
* ఈ ఏడాది దేశీయ మార్కెట్లలోకి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో 2009 ఎన్నికల తర్వాత 2010, 2012, 2013లో ఈ స్థాయిలోనే దేశీయ మార్కెట్లలోకి పెట్టుబడులు వచ్చాయి. 2014లోనూ రూ.97,069 కోట్ల పెట్టుబడుల్ని ఎఫ్‌పీఐలు చొప్పించిన సంగతి తెలిసిందే.

* గత ఏడాది సెప్టెంబరు తర్వాత ప్రధానంగా నగదు లభ్యత సంక్షోభం, ముడి చమురు ధరలు పెరగడం, రాజకీయ అనిశ్చితులు వంటి అంశాలు మార్కెట్లను ఎక్కువగా ప్రభావితం చేశాయి. దీంతో గరిష్ఠ స్థాయిల నుంచి సూచీలు డీలా పడుతూ వచ్చాయి. అయితే తాజాగా ముడి చమురు ధరలు స్థిరంగా ఉండటంతోపాటు ఇటీవల కేంద్ర ప్రభుత్వం జరిపిన మెరుపు దాడులతో ఎన్‌డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఎన్నికల ముందు సర్వేలు (ప్రీ పోల్‌ సర్వేలు) తేల్చి చెబుతుండటంతో దేశీయ మార్కెట్లలో మళ్లీ బలం కనిపిస్తోంది.

* కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం వచ్చి ఆర్థిక సంస్కరణలు కొనసాగితే కంపెనీలు కూడా బలమైన వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది. దీన్ని కూడా గమనంలోకి తీసుకొని ఎఫ్‌పీఐలు పెట్టుబడులు పెడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇదే జోరు కొనసాగితే గత ఏడాది ఆగస్టు 29న సెన్సెక్స్‌ నమోదు చేసిన ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయి అయిన 38,989 పాయింట్లను మించి రాణించే అవకాశం లేకపోలేదని వారు విశ్లేషిస్తున్నారు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.