close
టీసీఎస్‌ దూకుడుతో.. 

పెరిగిన సూచీలు 
సెన్సెక్స్‌కు 139 పాయింట్ల లాభం 
మెరిసిన టాటా మోటార్స్‌, కోల్‌ ఇండియా 
సమీక్ష

సూచీలు వరుసగా మూడో రోజూ పెరిగాయి. ఐటీ దిగ్గజం టీసీఎస్‌ గత శుక్రవారం మెరుగైన త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో మదుపర్ల సెంటిమెంటు మెరుగుపడింది. దీంతో సెన్సెక్స్‌ 139 పాయింట్లు, నిఫ్టీ 47 పాయింట్ల మేర లాభపడ్డాయి. విదేశీ నిధుల ప్రవాహం స్థిరంగా కొనసాగడం, అంతర్జాతీయ పరిణామాలు సానుకూలంగా ఉండటంతోపాటు లోహ, వాహన, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం మార్కెట్‌కు కలిసొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లకొస్తే ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, ఐరోపా మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 25 పైసలు కోల్పోయి 69.42 వద్ద ముగిసింది. 
సెన్సెక్స్‌ ఉదయం 38,805.54 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చిన కొనుగోళ్ల మద్దతుతో 38,976.58 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది. అంతకు ముందు ఒక దశలో 38,780.08 పాయింట్ల కనిష్ఠ స్థాయినీ తాకింది. చివరకు 138.73 పాయింట్ల లాభంతో 38,905.84 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 సైతం 46.90 పాయింట్లు లాభపడి 11,690.35 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 11,704.60-11,648.25 పాయింట్ల మధ్య కదలాడింది. 

టీసీఎస్‌ నాలుగో త్రైమాసిక నికర లాభం 17.7 శాతం పెరగడంతో షేరు 5% వరకు పెరిగింది. బీఎస్‌ఈలో 4.78 శాతం లాభంతో రూ.2,110.05 వద్ద ముగిసింది. మార్కెట్‌ విలువ రూ.36,136 కోట్ల మేర పెరిగింది. 
మార్చి త్రైమాసిక ఫలితాలు మదుపర్లను మెప్పించలేకపోవడంతో ఇన్ఫోసిస్‌ షేరు 3 శాతం వరకు పడింది. బీఎస్‌ఈలో 2.83 శాతం నష్టపోయిన షేరు రూ.726.65 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.9,241 కోట్లు హరించుకుపోయింది. 
ముంబయి నుంచి నేరుగా ఏడు అంతర్జాతీయ సర్వీసుల్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో స్పైస్‌జెట్‌ షేర్లు సుమారు 9 శాతం వరకు లాభపడ్డాయి. బీఎస్‌ఈలో 8.60 శాతం పెరిగిన షేరు రూ.119.35 వద్ద ముగిసింది. 
సెన్సెక్స్‌ 30 షేర్లలో టాటా మోటార్స్‌ అత్యధికంగా 7.04 శాతం లాభపడింది. టీసీఎస్‌ 4.78%, కోల్‌ ఇండియా 4.30%, టాటా స్టీల్‌ 3.42%, హీరో మోటోకార్ప్‌ 2.32%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.92%, కోటక్‌ బ్యాంక్‌ 1.91%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.73%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.92%, బజాజ్‌ ఆటో 0.92% మేర లాభపడ్డాయి. ఇన్ఫోసిస్‌ అత్యధికంగా 2.83 శాతం నష్టపోయింది. సన్‌ ఫార్మా 1.26%, యెస్‌ బ్యాంక్‌ 0.93%, ఓఎన్‌జీసీ 0.79%, హెచ్‌డీఎఫ్‌సీ 0.62% చొప్పున నష్టపోయాయి. రంగాల వారీ సూచీలకొస్తే లోహ, స్థిరాస్తి, వాహన, టెలికాం రంగాలు 2.24 శాతం వరకు లాభపడ్డాయి. బీఎస్‌ఈలో 1454 షేర్లు లాభపడగా, 1,141 షేర్లు నష్టపోయాయి. 205 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

నేటి మార్కెట్‌

రుసగా నాలుగో రోజూ అయిన మంగళవారం మార్కెట్లకు లాభాలు రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న భారత వాతావరణ శాఖ అంచనాలు ఇందుకు నేపథ్యం. ఎరువులు, వ్యవసాయ వస్తువులు, ఎఫ్‌ఎమ్‌సీజీ వస్తువుల కంపెనీలు నేడు లాభాలను అందిపుచ్చుకోవచ్చు. పసిఫిక్‌ మహా సముద్రంపై ఎల్‌ నినో ప్రభావం తీవ్రంగా ఏమీ ఉండదని ఆ శాఖ అంచనా కట్టిన సంగతి తెలిసిందే. కాగా, స్కైమెట్‌ మాత్రం వరుసగా మూడో ఏడాది సాధారణం కంటే తక్కువ స్థాయి వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసిన సంగతి తెలిసిందే. నిఫ్టీ-50 నేడు 11,640-11,715 మధ్య కదలాడవచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. వర్షపాతంపై అంచనాలు మార్కెట్‌ను కాస్త ముందుకు తీసుకెళ్లవచ్చని.. అయితే మేలో వెలువడే తుది అంచనాల కోసం చాలా మంది మదుపర్లు ఎదురుచూడవచ్చని విశ్లేషకులు అంటున్నారు. విప్రో మార్చి త్రైమాసిక ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే ఏకీకృత నికర లాభం, విక్రయాల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని మార్కెట్‌ పండితులు అంచనా వేస్తున్నారు. కంపెనీ నిర్వహణ మార్జిన్లు 80 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గవచ్చని చెబుతున్నారు.
 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.