close
చిట్‌ కమీషన్‌పై 12%!

? మేం సెల్యూలోజ్‌ను తయారు చేస్తున్నాం. చమురు- గ్యాస్‌ను వెలికి తీసేందుకు దీనిని వాడతారు. సెల్యూలోజ్‌ తయారీలో వాడే ముడి సరుకులను వివిధ సరఫరాదార్ల నుంచి కొనుగోలు చేస్తున్నాం. కొనుగోళ్లు, అమ్మకాల వివరాలను జీఎస్‌టీఆర్‌-1లో పొందుపరిచాం. వీటిని ఒకటే ఫారంలో పొందుపరిచే వీలుందా? అలాగే పన్నును కూడా ప్రభుత్వానికి రెండు సార్లు చెల్లిస్తున్నాను. ఇలా చెల్లించకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి

- పి.నాగభూషణం

జీఎస్‌టీఆర్‌- 1 రిటర్న్‌లో అమ్మకాల వివరాలు మాత్రమే పొందుపరిచాల్సి ఉంటుంది. అమ్మకాలు, కొనుగోళ్లు రెండింటినీ పొందుపరిస్తే.. అమ్మకాల విలువ రెట్టింపు అవుతుంది. పన్ను విలువ కూడా రెట్టింపు అవుతుంది. సరఫరాదారుకు మీరు చెల్లించిన జీఎస్‌టీని ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ కింద తిరిగి పొందొచ్చు. వినియోగదారు నుంచి వసూలు చేసిన పన్ను మొత్తంలో నుంచి సరఫరాదారుకి చెల్లించిన పన్నును మినహాయించగా మిగిలిన మొత్తాన్ని మీరు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. 2019 జులై నుంచి కొత్త రిటర్న్‌ల ఫారాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. అప్పుడు ఒకటే ఫారంలో కొనుగోళ్లు, అమ్మకాల వివరాలు దాఖలు చేయాల్సి రావచ్చు.

? నేను 2019 మార్చిలో ఒక చిట్‌ఫండ్‌ కంపెనీ నుంచి రూ.5 లక్షల చిట్‌ ఎత్తుకున్నాను. 5% చిట్‌ కమిషన్‌ రూ.25,000. దీనిపైన రూ.3,000 జీఎస్‌టీ వసూలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కమిషన్‌ పైన జీఎస్‌టీ ఉండదని విన్నాను. మరి నేను కట్టిన జీఎస్‌టీని తిరిగి పొందే వీలుందా

- కె.శ్యామ్‌ సుందర్‌రెడ్డి

జీఎస్‌టీ నిబంధనల ప్రకారం చిట్‌ కమీషన్‌ ఫోర్‌మన్‌ కమీషన్‌)పై 12 శాతం జీఎస్‌టీ వర్తిస్తుంది. అందువల్ల చిట్‌ఫండ్‌ సంస్థ మీ నుంచి జీఎస్‌టీ వసూలు చేయడం సబబే. చిట్‌ కమీషన్‌పై చెల్లించిన జీఎస్‌టీ రీఫండ్‌కు తీసుకునే వీల్లేదు.

? 2018 అక్టోబరులో ఓ ఫ్లాటును బుకింగ్‌ చేసుకున్నాను. ఇప్పటివరకు ఫ్లాటు విలువలో 60 శాతాన్ని బ్యాంకు రుణం కింద తీసుకున్నాను. దీనిపై 12 శాతం జీఎస్‌టీ కూడా చెల్లించాను. మిగిలిన మొత్తానికి ఎంత జీఎస్‌టీ రేటు వర్తిస్తుంది? ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ కింద పొందిన ప్రయోజనాన్ని నిర్మాణదారు ఎంత మేర బదిలీ చేశాడో మేము తెలుసుకోవడం ఎలా

- రవి కుమార్‌.బి

స్థిరాస్తి రంగంపై జీఎస్‌టీ రేటుకు సంబంధించి కొత్త నిబంధనల ప్రకారం ఏప్రిల్‌ 1 నుంచి 5 శాతం లేదా 12 శాతం జీఎస్‌టీలో ఏదోకదానిని నిర్మాణదారు ఎంచుకోవచ్చు. ఆయన ఎంపిక ఆధారంగా మీరు జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 1 లోపు చేసిన చెల్లింపులపై మాత్రం 12 శాతం జీఎస్‌టీ వర్తిస్తుంది. మీకు ఎంత మేర ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ బదిలీ చేశాడనే విషయం నిర్మాణదారుకు మాత్రమే తెలుస్తుంది. అందువల్ల ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ కోసం ఆయననే అడగండి. 
? మేం అపార్ట్‌మెంట్‌ నిర్మాణం కోసం సంయుక్త అభివృద్ధి ఒప్పందం కింద ఓ స్థలాన్ని తీసుకున్నాం. 2018 ఫిబ్రవరి 25న ఈ ఒప్పందం కుదుర్చుకున్నాను. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయి. స్థల యజమాని తన కింద వచ్చిన రెండు ఫ్లాట్లను ఇప్పటికే అమ్మేశాడు. స్థల యజమాని వాటా కింద వచ్చిన ఫ్లాట్లపై మేం ఎప్పుడు జీఎస్‌టీ వసూలు చేయాల్సి ఉంటుంది

- ఎన్‌.అప్పారావు

స్థల యజమాని తన వాటా కింద వచ్చిన షేర్లను విక్రయించాడని మీరు ప్రశ్నలో చెప్పారు. అంటే మీరు ఆయనకు ఫ్లాట్లను స్వాధీనం చేశారని అర్థమవుతోంది. స్థల యజమానికి కేటాయించిన ఫ్లాట్లపై నిర్మాణదారు ఎప్పుడు పన్ను చెల్లించాలనే విషయం సెంట్రల్‌ ట్యాక్స్‌ రేట్‌ నోటిఫికేషన్‌ సంఖ్య: 04/2018, తేదీ: 25-01-2018 చెబుతుంది. దీని ప్రకారం.. స్థల యజమానికి ఫ్లాట్లు విక్రయించడానికి మీరు ఎప్పుడు అనుమతిస్తారో.. అప్పుడే మీరు ప్రభుత్వానికి జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. 
? హైదరాబాద్‌లో ఓ ప్లాటును కొనుగోలు చేశాం. 2018 ఫిబ్రవరిలో అగ్రిమెంటు కుదుర్చుకోగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యింది. జూన్‌ లేదా జులైలో ఫ్లాటును స్వాధీనం చేస్తారు. రిజిస్ట్రేషన్‌ కంటే ముందే మేం ఫ్లాటు ధరతో పాటు 12 శాతం జీఎస్‌టీని చెల్లించాం. అయితే ఇంకా అపార్ట్‌మెంటు నిర్మాణదశలో ఉన్నందున నిర్మాణదారు ఇంకా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను క్లెయిమ్‌ చేసుకోలేదు. 2019 ఏప్రిల్‌ నాటికి నిర్మాణదశలో ఉన్నప్పటికీ నిర్మాణదారు ఐటీసీని క్లెయిమ్‌ చేసుకోవచ్చా? ఒకవేళ క్లెయిమ్‌ చేసుకోవచ్చంటే.. మరి మేం చెల్లించిన పన్నును నిర్మాణదారు మళ్లీ మాకు తిరిగిస్తాడా

- నేహా

ఫ్లాటు ఇంకా నిర్మాణదశలోనే ఉన్నందున నిర్మాణదారు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను క్లెయిమ్‌ చేసుకునేందుకు అర్హుడే. అలాగే మీరు చెల్లించిన పన్నును నిర్మాణదారు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను నిర్మాణదారుకు లభిస్తుండటంతో నిర్మాణ వ్యయం తగ్గుతున్నందున.. ధరను కొంత మేర తగ్గించమని మీరు అడగొచ్చు. 

? మేం రూ.64 లక్షలకు ఓ ఫ్లాటును కొనుగోలు చేశాం. 2018 మేలో ఒప్పందం దీనికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాం. అప్పుడు 12 శాతం జీఎస్‌టీ చెల్లించేందుకు కూడా ఆ ఒప్పందంలో పొందుపరిచాం. ఆ ఒప్పందం ప్రకారమే.. 2018 మేలో ఆ ఫ్లాటను మాకు స్వాధీనం చేయాలి. అయితే ఇప్పుడు నిర్మాణ వ్యయాలు పెరిగాయి అలాగే 12 శాతం జీఎస్‌టీ చొప్పున రూ.6,73,000 చెల్లించమని నిర్మాణదారు అడుగుతున్నాడు. మేం ఎంత శాతం జీఎస్‌టీ కట్టాల్సి ఉంటుందో స్పష్టం చేయగలరు? 2019 ఏప్రిల్‌ 1 నుంచి జీఎస్‌టీని ప్రభుత్వం 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. ఒప్పందం కుదుర్చుకున్నప్పుడే ఫ్లాటు ధరలో 20 శాతం చెల్లింపులను బ్యాంకు రుణం ద్వారా చెల్లించాను. అలాగే దశలవారీగా 10 శాతం చొప్పున రుణం డబ్బులను విడుదల చేస్తూ వస్తోంది

- రాజలింగం

జీఎస్‌టీ చట్టంలోని సరఫరా సమయం నిబంధనల ప్రకారం...ఏ రోజైతే ముందుగా అనుకున్న డబ్బుల్లో కొంత చెల్లిస్తారో, ఆ రోజే అప్పుడున్న పన్ను రేటు ప్రకారం ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. మీ విషయంలో మొత్తం డబ్బులతో పాటు జీఎస్‌టీ కూడా చెల్లించారు. అందువల్ల మీరు మున్ముందు ఇంకా చెల్లించాల్సి ఉంటుందన్న ప్రశ్నే ఇక్కడ ఉదయించదు.

? నేను 3 బీహెచ్‌కే ఫ్లాటును బుకింగ్‌ చేసుకున్నాను. ఫ్లాటు ధర రూ.37 లక్షలు కాగా.. అడ్వాన్స్‌ కింద రూ.లక్షను 2017 ఏప్రిల్‌ 29న చెల్లించాను. ఆ సమయంలో ఆ ఫ్లాటు నిర్మాణదశలో ఉంది. 2017 డిసెంబరు 23న అగ్రిమెంటు కుదుర్చుకున్నప్పుడు మరో రూ.14 లక్షలు (ఇందులో రూ.12 లక్షలు బ్యాంకు రుణం) చెల్లించాను. ఇప్పుడు మరో 4 నెలల్లో ఫ్లాటును నాకు స్వాధీనం చెస్తారు. ఇప్పుడు నేను చేసే చెల్లింపులపై ఎంత జీఎస్‌టీ చెల్లించాలి. ఫ్లాటు మొత్తం ధరపై 12% అంటే రూ..4.44 లక్షలను జీఎస్‌టీ కింద కట్టాలని నిర్మాణదారు అంటున్నాడు? నేను నిజంగానే అంత కట్టాల్సి ఉంటుందా. తెలియజేయగలరు

- ఎన్‌.రమేశ్‌

2019 మార్చి 31 వరకు నిర్మాణదశలో ఉన్న స్థిరాస్తులకు 12 శాతం జీఎస్‌టీర్తిస్తుంది. ఏప్రిల్‌ 1 నుంచి దీనిని 5 శాతానికి తగ్గించారు. అయితే 12% లేదా 5 శాతం జీఎస్‌టీలో ఏదోకదానిని ఎంపిక చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. అందువల్ల నిర్మాణదారు ఏ ప్రకారం చెల్లించనున్నాడో మీరు ఆయనను అడగంది. ఆవిధంగా మీరు చేయాల్సిన మిగితా చెల్లింపులపై జీఎస్‌టీ కట్టండి.

? 2018 ఏప్రిల్‌ నుంచి 2018 అక్టోబరు వరకు రిటర్న్‌లను ఇప్పుడు దాఖలు చేయాలని అనుకుంటున్నాం. పన్ను బకాయిలపై మేం ఎంత వడ్డీ కట్టాల్సి ఉంటుందో తెలియజేయగలరు? పైగా 31/03/2019 వరకు ఆలస్య రుసుంపై ఎలాంటి జరిమానా ఉండదని కూడా అంటున్నారు కదా

- శివజ్యోతి కుమార్‌

మీ ప్రశ్నలో రెండు అంశాలు ఉన్నాయి. మొదటిది పన్ను బకాయిలపై వడ్డీ చెల్లింపు. రెండోది ఆలస్య రుసుముపై జరిమానా? వీటికి వేర్వేరుగా సమాధానం బుతాను. 

పన్ను బకాయిలపై వడ్డీ: పన్ను చెల్లింపులు ఆలస్యమైనప్పుడు దానిపై కట్టాల్సిన వడ్డీని ప్రభుత్వం ఎప్పుడు రద్దు చేయదు. నెలకు 1.5 శాతం వడ్డీ చొప్పున ఎన్ని నెలలు ఆలస్యమైతే అన్ని నెలలు చెల్లించాల్సి ఉంటుంది. 
ఆలస్య రుసుంపై జరిమానా: 2017 జులై నుంచి 2018 సెప్టెంబరు వరకు జీఎస్‌టీఆర్‌-3బీ, జీఎస్‌టీఆర్‌-1 రిటర్న్‌ల దాఖలుకు మాత్రం ఆలస్య రుసుం జరిమానాను ప్రభుత్వం రద్దు చేస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోని వాళ్లు రోజుకు రూ.50 చొప్పున గరిష్ఠంగా రూ.10,000 వరకు ఆలస్య రుసుం కట్టాల్సి ఉంటుంది.

మీ సందేహాలు పంపండి

జీఎస్‌టీకి సంబంధించి మీ సందేహాలు మాకు పంపించండి.. మీ సందేహాలు  ఎలాంటివైనా సరే అవి క్లుప్తంగాను, సరళంగాను ఉండాలి..

మా చిరునామా 
eenadubusinessdesk@gmail.com, businessdesk@eenadu.net

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.