close

గాలి వీచేనని.. చినుకు రాలేనని.. 

సూచీలపై రుతుపవనాల ప్రభావం ఎంత?

రుతుపవనాలపై అంచనాలు మార్కెట్లను నిజంగా ప్రభావితం చేస్తాయా? మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించినపుడు ఆ ఏడాది లాభాల వర్షం కురిసిందా లేదా నష్టాలు పలకరించాయా? అసలు వర్షాలకు, మార్కెట్లకు సంబంధం ఏమిటి? రుతుపవనాల అంచనాలకు, మార్కెట్ల లాభాలకు లంకె ఉందా? ఉంటే ఎంత వరకు ఉంది? 

ర్షాలు కురిస్తే ఎవరికైనా ఆనందమే. ముఖ్యంగా రైతన్నకు. మంచి పంటలు పండి దిగుబడి ఎక్కువగా వస్తుందన్న ఆశ. మార్కెట్లకూ ఆనందమే. ఎందుకంటే రైతులకు ఆదాయం పెరిగితే వారి ఖర్చు కూడా పెరిగి.. ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలు, ఎఫ్‌ఎమ్‌సీజీ వస్తువులు వంటి వాటిని ఎక్కువగా కొంటారు. అపుడు కంపెనీలకు విక్రయాలు పెరుగుతాయి. అమ్మకాలు పెరిగితే లాభాలూ వస్తాయి. అవి ఆర్థిక ఫలితాల్లో ప్రతిఫలిస్తాయి. ఫలితాలు బాగుంటే ఆయా కంపెనీల షేర్ల ధరలూ రాణిస్తాయి. అందుకే వర్షాలు పడితే మదుపర్లకూ ఆనందమే. మరి నిజంగా వాతావరణ శాఖ ప్రకటించే వర్షాల అంచనాలకు; ఆ ఏడాది సూచీలు అందించే లాభాలకు ఏమైనా లంకె ఉందేమో చూద్దాం. 
2011, 2014లో ఏం జరిగిదంటే.. 
భారత వాతావరణ విభాగం అంచనాల ప్రకారం.. ఈ ఏడాది సాధారణ స్థాయితో పోలిస్తే 96% వర్షాలు కురుస్తాయి. మరి ఈ ఏడాది స్టాక్‌ మార్కెట్లో లాభాలు ఎలా ఉండబోతున్నాయన్నది చూడాలి. గత అంచనాలు, గత లాభాలు చూస్తే వర్ష అంచనాల ప్రభావం ఆ ఏడాది లాభాలపై పరిమితంగా ఉంటుందని తెలుస్తోంది. 2011లో సాధారణంగా కంటే అధిక వర్షాలే పడ్డా.. 24.6% సెన్సెక్స్‌ నష్టపోయింది. 2014లో వర్షపాతం సాధారణ స్థాయి కంటే 88 శాతానికే పరిమితమైనా 29.9% లాభాలందుకుంది. అంటే వర్షాలకు, లాభాలకు లంకె దాదాపు లేదన్నమాటే. 
ఎలాగో చూద్దాం.. 
ఏప్రిల్‌లో భారత వాతావరణ శాఖ(ఐఎమ్‌డీ) ప్రకటించే అంచనాలకు, ఆ ఏడాది మార్కెట్‌ లాభాలకు సహసంబంధం -0.34 శాతంగా ఉందని విశ్లేషకులు లెక్కగట్టారు. ఇక్కడ విలువ ‘1’ అయితే.. కచ్చితమైన సానుకూల సహసంబంధం ఉన్నమాట. అంటే అంచనాలకు అనుగుణంగా లాభాలు కూడా ఉంటాయన్నమాట. అదే ‘-1’ అయితే ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుందని అర్థం. సున్నా వస్తే రెండింటికి సంబంధం లేకుండా కదలాడతాయన్నమాట. మనకు వచ్చిన విలువ -0.34 శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రభావం పరిమితం అని తెలుస్తోంది. 
ఎందుకిలా.. 
వర్షపాతం ఎంత అన్నదాని కంటే వర్షపాత విస్తృతి ఎలా ఉందన్నది ముఖ్యమని విశ్లేషకులు అంటున్నారు. ఒర ప్రాంతంలో భారీగా వర్షాలు పడి.. మిగతా చోట్ల తక్కువగా పడితే అది ప్రతికూలతలనే ఇస్తుందన్నది వారి వాదన. అయితే ఇపుడు పరిస్థితులు మారి.. గత దశాబ్దకాలంగా సాగునీటి ప్రాజెక్టులు పెరిగాయని..వీటి వల్ల సరైన నీటి నిల్వలు ఉండడంతో ఎక్కువ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉన్నాయని చెబుతున్నారు. భారత్‌కు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయి. రాబోయే కొద్ది నెలల పాటు ఎటువంటి ఇబ్బందీ ఉండదని అంటున్నారు. అయితే ఆహారం సమస్య కాదని.. మొత్తం మీద వర్షపాతం ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపేందుకు అవకాశం ఉందని మరికొంత మంది మాట. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఉందని.. అది వినియోగంపై ప్రభావం చూపగలదని వారు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు సరిగా పడకపోతే గ్రామీణ గిరాకీపై.. తద్వారా మొత్తం మీద దేశ గిరాకీపై ప్రభావం ఉండగలదని అంటున్నారు. 
తక్కువగా కురిస్తే?: భారత వాతావరణ శాఖ అంచనాలు 5% వ్యత్యాసంతో నిజమవుతున్నాయని గణాంకాలను చూస్తే అర్థమవుతుంది(పట్టిక చూడండి). అయితే సూచీల కదలికలను అర్థం చేసుకోవడానికి మొత్తం మీద వర్షాల విస్తృతి ఆ ఏడాదిలో ఎలా ఉంది.. ఆయా ఏడాదుల్లో ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలు, పరిణామాలు జరిగాయో లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తక్కువ వర్షపాతం వల్ల ఎన్నికల ఏడాది త్రైమాసిక వృద్ధిపై ప్రబావం ఉంటుంది. ప్రభుత్వం ఎన్నికల తర్వాత వెంటనే మౌలిక ప్రాజెక్టులను చేపట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మొత్తం మీద వర్షాలు తక్కువ పడితే వృద్ధిపై నేరుగానే ప్రభావం ఉంటుందన్నది వాస్తవం.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.