close
టీవీలన్నింటికీ ఒకటే కాదు!

 

? 2018లో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు సినిమా టికెట్లపై 18% కాకుండా 12% జీఎస్‌టీ వేసి జీఎస్‌టీఆర్‌-3బీ, జీఎస్‌టీఆర్‌-1 రిటర్న్‌లు దాఖలు చేశాం. ఇప్పుడు ఈ 6 శాతం వ్యత్యాసాన్ని ఎలా చూపించుకోవాలి.

- కె.వి.ఎస్‌.శివరావు, పాలకొల్లు

రిటర్న్‌లు సమర్పించేటప్పుడు మీరు చేసిన పొరపాటుపై పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదు. ఇలాంటివి సర్వసాధారణంగా జరిగేవే. ఈ సమస్యకు పరిష్కారం చూపే ఉద్దేశంతోనే ప్రభుత్వం సెంట్రల్‌ ట్యాక్స్‌ సర్క్యులర్‌ సంఖ్య: 16/2017, తేదీ 29-12-2017ను తీసుకొచ్చింది. దీని ప్రకారం.. మీరు తక్కువగా చూపించిన 6 శాతం పన్నును వచ్చే నెల రిటర్న్‌లో పొందుపరిచి దాఖలు చేసి, చెల్లించొచ్చు. అలాగే ఎప్పటి నుంచి ఆ 6 శాతం పన్నును మీరు తక్కువగా చూపిస్తూ వచ్చారో అప్పటినుంచి ఇప్పటివరకు (మీరు చెల్లించే తేదీ నాటికి) ఆ 6 శాతం పన్నుకు 18 శాతం వడ్డీని కలిపి కట్టాలి.

? 2018 సెప్టెంబరులో స్థల యజమాని వాటా కిందకు వచ్చిన ఓ ఫ్లాటును కొన్నాను. దానికి అప్పటికే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ (స్వాధీన ధ్రువీకరణ పత్రం) వచ్చింది. ఇప్పుడు దానికి 12 శాతం జీఎస్‌టీ కట్టాలని అంటున్నారు. అది కూడా చెక్కును నిర్మాణదారు పేరు మీద ఇవ్వాలని అడుగుతున్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ వచ్చినా కూడా నేను జీఎస్‌టీ కట్టాల్సి ఉంటుందా? జీఎస్‌టీని నిర్మాణదారుకే చెల్లించాలా

- శ్రీకుమార్‌ గోవిందరాజు, విజయవాడ

జీఎస్‌టీ చట్టంలో నిబంధనల ప్రకారం.. నిర్మాణ దశలో ఉన్న ఏ స్థిరాస్తికైనా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ వచ్చి ఉంటే జీఎస్‌టీ వర్తించదు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ వచ్చాక ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నా కూడా జీఎస్‌టీ వర్తిచదు. మీ విషయంలోనూ అంతే. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ వచ్చినందున మీరు నిర్మాణదారుకు 12 శాతం జీఎస్‌టీని చెల్లించనక్కర్లేదు.

? నేను 2017 మార్చిలో ఓ ఫ్లాటును బుక్‌ చేసుకున్నాను. అడ్వాన్స్‌ కింద రూ.లక్ష ఇచ్చాను. 2017 మేలో ఒప్పందం కుదుర్చుకున్నాను. ఆ ఏడాది జులైలో రిజిస్ట్రేషన్‌ కూడా చేయించుకున్నాను. అయితే ఇప్పటికీ దాని నిర్మాణం పూర్తి కాలేదు. మరో రెండు నెలలు పడుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎంత జీఎస్‌టీ కట్టాల్సి ఉంటుంది.

- రాజేశ్‌ కుమార్‌ చిత్రాలా

2017 జూన్‌ 30కి ముందు మీరు చేసిన చెల్లింపులకు సేవా పన్ను, వ్యాట్‌ వర్తిస్తాయి. 2017 జులై 1 నుంచి 2019 మార్చి 31 వరకు చేసిన చెల్లింపులకు 12 శాతం జీఎస్‌టీ చెల్లించాలి. ఏప్రిల్‌ 1 తర్వాత చేసే చెల్లింపులకు 12% లేదా 5 శాతాల్లో మీ నిర్మాణదారు ఎంపిక ఆధారంగా జీఎస్‌టీ కట్టాలి.

? యజమాని వాటా కింద వచ్చిన ఫ్లాటును నేను 2019 ఫిబ్రవరి 28న బుక్‌ చేసుకున్నాను. రూ.4,00,000 అడ్వాన్స్‌ కూడా చెల్లించాను. ఫ్లాటు బుకింగ్‌ తేదీ నాటికి కంప్లీషన్‌ సర్టిఫికేట్‌ రాలేదు. బ్యాంకు నుంచి రూ.18,00,000 రుణం తీసుకున్నాను. 2019 ఏప్రిల్‌ 4న రిజిస్ట్రేషన్‌ డీడ్‌ను నా పేరు మీర చేయించుకున్నాను. రిజిస్ట్రేషన్‌ నాటికి ఎంత జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుందో దానిని చెల్తిస్తానని ఒప్పందం రాసుకున్నాను. రూ.22,00,000 లక్షలపై 12 శాతం అంటే రూ.2,64,000 చెల్లించమని నిర్మాణదారు అడుగుతున్నాడు. మా ఫ్లాటు అందుబాటు గృహం కిందకు వస్తుంది. అందుబాటు గృహాలకు ఏప్రిల్‌ 1 నుంచి జీఎస్‌టీ రేట్లను 5 శాతం నుంచి 1 శాతానికి తగ్గించారు. అలాంటప్పుడు నేను ఎంత జీఎస్‌టీ కట్టాల్సి ఉంటుందో తెలియజేయగలరు

- తులసి ప్రసాద్‌ ఎం

స్థల యజమాని నిర్మాణదారుకు మీరు పన్ను చెల్లించాలంటే రిజిస్ట్రేషన్‌ ఎప్పుడు జరిగింది లాంటి విషయాలతో సంబంధం ఉండదు. 2019 మార్చి 31 వరకు చేసిన చెల్లింపుకు 12 శాతం జీఎస్‌టీ వర్తిస్తుంది. ఏప్రిల్‌ 1 నుంచి పాత, కొత్త జీఎస్‌టీ రేట్లతో దేనినైనా నిర్మాణదారు ఎంపిక చేసుకోవచ్చు.

? మేం కాంపోజిషన్‌ విధానంలో ఉన్నాం. ఆదాయపు పన్నుతో పాటు మూడు నెలలకోసారి అమ్మకాలపై 1% జీఎస్‌టీ చెల్లిస్తున్నాం. అయితే మేం పద్దు వివరాలను పుస్తకాల్లో మాత్రమే రాసుకుంటాం. వీటిని కంప్యూటర్లలో ఎక్కించాలని చెప్పి అకౌంటెంటు డబ్బులు ఎక్కువగా డిమాండు చేస్తున్నారు. నిజంగానే పద్దు వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయాల్సి ఉంటుందా

- రామ కృష్ణసాయి

జీఎస్‌టీ విధానంలో పద్దు వివరాలను పుస్తకాల్లోనైనా రాసుకోవచ్చు లేదంటే కంప్యూటర్లలో కూడా నిక్షిప్తం చేసుకోవచ్చు. కంప్యూటర్లోనే పద్దు వివరాలు పొందుపర్చాలనే నియమమేమీ లేదు.

? ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా 2019 మార్చి 8న 32 అంగుళాల ఎల్‌ఈడీ టీవీని కొనుగోలు చేశాను. అయితే దీనిపై 18% కాకుండా 28 శాతం జీఎస్‌టీ వసూలు చేశారు. ఇదే విషయాన్ని ఫిర్యాదుచేస్తూ ఆ సంస్థకు ఇప్పటివరకు ఓ ఆరు మెయిళ్లు పంపించాను. వాళ్ల నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. అసలు ఎల్‌ఈడీ టీవీకి ఎంత జీఎస్‌టీ పడుతుందో తెలియజేయగలరు

- పి.ఎస్‌.ఆర్‌.రామచంద్రం

టీవీ ప్రత్యేకతల ఆధారంగా కొన్నింటికి 18%, మరికొన్నింటికి 28% జీఎస్‌టీ వర్తిస్తుంది. మీరు కొనుగోలు చేసిన టీవీకి ఎంత జీఎస్‌టీ పడుతుందో స్పష్టంగా తెలియాలంటే సెంట్రల్‌ ట్యాక్స్‌ రేట్‌ నోటిఫికేషన్‌ సంఖ్య: 1/2017, తేదీ 28.06.2017ను ఓసారి అధ్యయనం చేయండి.

? మాది వస్త్ర వ్యాపారం. 2017 ఆగస్టులో కాంపోజిషన్‌ డీలరుగా జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ తీసుకున్నాను. మూడు నెలలకోసారి రిటర్న్‌లు దాఖలు చేస్తున్నాం. మా వార్షిక టర్నోవరు రూ.25 లక్షల నుంచి 32 లక్షల వరకు ఉంటుంది. అయితే జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ తీసుకునేందుకు టర్నోవరు పరిమితిని రూ.40 లక్షలకు ప్రభుత్వం పెంచింది. ఇప్పుడు మేం జీఎస్‌టీ లైసెన్సును రద్దు చేసుకోవచ్చా

- పెద్దె ఆంజనేయులు

జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ తీసుకోవాలంటే తెలంగాణ రాష్ట్రంలో వార్షిక టర్నోవరు పరిమితి రూ.20 లక్షలు కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో రూ.40 లక్షలు. మీరు ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్‌ తీసుకొని ఉంటే.. లైసెన్సు రద్దుకు దరఖాస్తు చేసుకోచ్చు. లైసెన్సు రద్దు నిమిత్తం జీఎస్‌టీ నెట్‌వర్క్‌ పోర్టల్‌లో జీఎస్‌టీ ఆర్‌ఈజీ-16ను సమర్పించాల్సి ఉంటుంది.

? 2018 నవంబరులో కుత్బుల్లాపూర్‌లో ఓ ఫ్లాటును కొనుగోలు చేశాను. ప్రస్తుతం ఇది నిర్మాణదశలో ఉంది. ఇప్పటివరకు రూ.18 లక్షలు చెల్లించాను. మరో రూ.10 లక్షలను రుణం తీసుకొని కట్టాను. ఈ రూ.10 లక్షలపై 12 శాతం జీఎస్‌టీ కట్టాను. ఇంకా నేను రూ.17.5 లక్షలు చెల్లించాల్సి ఉంది. దీనికి కూడా 12 శాతం జీఎస్‌టీ కట్టాల్సి ఉంటుందని నిర్మాణదారు చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే నేను 12 శాతం జీఎస్‌టీ కట్టాల్సి ఉంటుందా

- రాజ్‌ కిరణ్

2019 మార్చి 31 వరకు నిర్మాణదశలో ఉన్న ఫ్లాట్లకు 12 శాతం జీఎస్‌టీ ఉండేది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త జీఎస్‌టీ రేట్లు అమల్లోకి వచ్చాయి. అయినప్పటికీ కొంత కాలం పాటు పాత, కొత్త పన్ను రేట్లలో దేనినైనా ఎంపిక చేసుకునే వెసులుబాటును నిర్మాణదార్లకు కల్పించింది. మీ నిర్మాణదారు 12 శాతం జీఎస్‌టీని అడుగుతున్నారంటే.. ఆయన పాత జీఎస్‌టీ రేట్లను ఎంపిక చేసుకొని ఉండవచ్చు. అందువల్ల మీరు ఆ విషయాన్ని ఓసారి ఆయనను అడిగి తెలుసుకొని, అప్పుడు ఆయన చెప్పినట్లుగా 12 శాతం జీఎస్‌టీని చెల్లించండి.

 ? గచ్చిబౌలిలో నిర్మాణదశలో ఉన్న ఓ ఫ్లాటును కొనుగోలు చేశాను. ఇప్పటివరకు చేసిన చెల్లింపులపై నిర్మాణదారు 12 శాతం జీఎస్‌టీ వసూలు చేశాడు. మిగిలిన మొత్తానికి ఎంత మేర జీఎస్‌టీ కట్టాల్సి ఉంటుంది. ఇదే ప్రాజెక్టులో మరో ఫ్లాటును కూడా కొనాలని అనుకుంటున్నా. దీనికి ఎంత జీఎస్‌టీ వర్తిస్తుంది? 2018 ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. 2020 జూన్‌లో ఇది పూర్తయ్యే అవకాశం ఉంది.

- రమణ

2019 మార్చి 31 వరకు నిర్మాణదశలో ఉన్న ప్రాజెక్టులకు 12 శాతం జీఎస్‌టీ వర్తిస్తుంది. అయితే ఏప్రిల్‌ 1 తర్వాత నుంచి పాత, కొత్త జీఎస్‌టీ రేట్లలో (12 శాతంతో ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ లేదా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ లేకుండా 5%) నిర్మాణదారు దేనిని ఎంపికచేసుకుంటే ఆ ప్రకారమే జీఎస్‌టీ చెల్లించాలి. అందువల్ల మీరు నిర్మాణదారును కలిసి ఆయన ఏ జీఎస్‌టీ రేటును ఎంపిక చేసుకున్నారో తెలుసుకోండి. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న మరో ఫ్లాటుకు కూడా ఇదే విషయం వర్తిస్తుంది.

మీ సందేహాలు పంపండి

* జీఎస్‌టీకి సంబంధించి మీ సందేహాలు మాకు పంపించండి.. మీ సందేహాలు  ఎలాంటివైనా సరే అవి క్లుప్తంగాను, సరళంగాను ఉండాలి.. మా చిరునామా
eenadubusinesssdesk@gmail.com; businesdesk@eenadu.net

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.