close
ధర పెరిగింది.. గిరాకీ తగ్గింది

ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో క్షీణత
ఆఫర్లు, తగ్గింపులతో ఆకట్టుకునేందుకు డీలర్ల ప్రయత్నం
ఈనాడు - హైదరాబాద్‌

ద్విచక్ర వాహనాలకు గిరాకీ తగ్గడం వాహన ఉత్పత్తి సంస్థలతోపాటు, డీలర్లనూ కలవర పెడుతోంది. ఇదే సమయంలో వీటి ధరలు కూడా స్వల్పంగా పెరగడంతో కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తగ్గిన గిరాకీని తట్టుకునేందుకు వాహన సంస్థలు, డీలర్లు పలు ఆకర్షణీయమైన పథకాలు ప్రవేశ పెడుతున్నప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండా పోతోంది.

పెట్రోలు ధర పెరిగిపోవడం, ద్విచక్ర వాహనాల ధరలు కూడా అందుబాటులో లేకపోవడంలాంటి కారణాలతో ద్విచక్ర వాహనాల మార్కెట్‌ కుదేలవుతోంది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం దాదాపు అన్ని వాహన విక్రయాలూ 17 శాతం పైగానే అమ్మకాలు తగ్గాయి. ప్రముఖ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 20 శాతం వరకూ క్షీణించాయి. చాలామంది డీలర్ల దగ్గర వాహనాలు అలాగే మిగిలిపోతున్నాయి. దీంతో డీలర్లకు తాము పెట్టిన పెట్టుబడులపై లాభం రాకపోగా నష్టం వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మరోవైపు ఏప్రిల్‌ 1 నుంచి ద్విచక్ర వాహనాల్లోనూ ఏబీఎస్‌ (యాంటీ బ్రేకింగ్‌ సిస్టం) ఏర్పాటు చేయాలనే నిబంధనలు రావడంతో పాత వాహనాలను కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవచ్చనే ఆందోళనా వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం ప్రతి ద్విచక్ర వాహన మోడళ్లపైనా రూ.250 నుంచి రూ.1,000 వరకూ ధర పెరిగింది. దీంతో ఈ పెరిగిన ధరను ఏదో విధంగా తగ్గించి, వినియోగదారులను ఆకట్టుకునేందుకు డీలర్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ‘ఒక బైకు కొనాలంటే కనీసం నాలుగైదు చోట్ల విచారణ చేశాకే నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డీలర్ల మధ్య పోటీ పెరిగింది. పెట్టుబడి పెరిగిపోతుండటంతో లాభం రాకపోయినా సరే.. బండి వెళ్తే చాలని అనుకోవాల్సి వస్తోంది’ అని ఒక డీలర్‌ అభిప్రాయపడ్డారు.

బీమా ప్రీమియం పెరగడంతో..
గత ఏడాది అక్టోబరు నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా ఐదేళ్ల వాహన బీమా తీసుకోవాలి. ఇందులో మొదటి ఏడాది పూర్తిస్థాయి బీమాకాగా.. తర్వాత థర్డ్‌ పార్టీ లేదా పూర్తి స్థాయి బీమా పాలసీ తీసుకోవచ్చు. దీంతోపాటు రూ.15లక్షల విలువైన వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ కోసం రూ.750 చెల్లించాలి. ఇవన్నీ కచ్చితమైన నిబంధనలు కావడం, బండిని బట్టి ఈ ప్రీమియం దాదాపు రూ.4,000కు పైగానే ఉండటంతో మోటార్‌ సైకిళ్ల ఆన్‌రోడ్‌ ధర అమాంతం పెరిగింది. బీమా పాలసీ ప్రీమియానికి రుణం లభించదు. దీంతో ముందస్తు చెల్లింపు (డౌన్‌ పేమెంట్‌) పెరుగుతుంది. వాహనాన్ని కొనాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడానికి ఇదీ కొంత కారణం అవుతోంది. విక్రయాలను పెంచుకునేందుకు వాహన సంస్థలతోపాటు, డీలర్లు కూడా బీమా ప్రీమియంపై కొంత తాము భరిస్తామంటూ చెబుతున్నారు. అదికూడా వాహనదారులతో తమకు ఉన్న పరిచయం, సర్వీసింగ్‌ కోసం మళ్లీ వారి దగ్గరకు  వెళ్తారనే నమ్మకం ఉన్నవారికే కాస్త తగ్గింపును వర్తింప చేస్తున్నారు.

తాయిలాలు ఇస్తున్నా..
వాహన విక్రయాలు పెంచుకునేందుకు డీలర్లు సొంతంగానే కొన్ని తాయిలాలు ప్రకటిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా కొన్ని యాక్సెసరీలు ఉచితంగా ఇస్తామంటూ పేర్కొంటున్నారు. కొంతమంది యాక్సెసరీలను బయట బిగించుకుంటామని చెబుతుంటారనీ.. అలాంటి వారికి ఎలాంటి డిస్కౌంట్లూ ఇచ్చేందుకు వీలుపడటం లేదని ఒక డీలర్‌ పేర్కొన్నారు. పాత వాహనాలు అలాగే ఉన్నప్పటికీ.. కొత్త బండ్లు తీసుకొస్తూనే ఉండాల్సి ఉంటుంది. దీంతో వినియోగదారులు ఉత్పత్తి తేదీని బట్టి బండి తీసుకునేందుకు చూస్తున్నారనీ, ఇలా ఒకటి రెండు నెలలపాటు అమ్ముడుపోకుండా ఉంటే.. వాటిని వదిలించుకోవడమూ కష్టంగానే మారుతుందని మరో డీలర్‌ పేర్కొన్నాడు.

వాహనదారులకూ ఇబ్బందే..
వాహనాల ధరలు పెరగడంతోపాటు, ఇంధన ధరలు అధికంగా ఉండటంతో వాహనదారులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. షోరూం ధర ఆధారంగా 85శాతం వరకూ రుణం వచ్చినా.. మిగతాది సొంతంగా సమకూర్చుకోవాల్సిందే. ఉదాహరణకు ఒక 125సీసీ మోటార్‌ సైకిల్‌ షోరూం ధర రూ.66,053 ఉందనుకుందాం. అందులో 90శాతం రుణం వస్తుందనుకుందాం. అప్పుడు మిగతా రూ.6,605తో పాటు జీవిత కాలం పన్ను రూ.7,175,  బీమా కోసం రూ.5,037 చెల్లించాలి. దీంతోపాటు యాక్సెసరీలు, రిజిస్ట్రేషన్‌ ఖర్చులు అదనం. ఇలా దాదాపు రూ.20,000 వరకూ ఉండాలి. ఇది చాలామందికి భారమే అవుతోంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.