close
14,000 కోట్లకు కొంటాం

ఎస్‌బీఐ క్యాప్స్‌తో డార్విన్‌ గ్రూప్‌ చర్చలు
ఆ గ్రూప్‌ సామర్థ్యాన్ని పరిశీలించనున్న బ్యాంకర్లు
ముంబయి

జెట్‌ ఎయిర్‌వేస్‌ను రూ.14,000 కోట్లకు కొనుగోలు చేసేందుకు డార్విన్‌ గ్రూప్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ వాటా విక్రయానికి బిడ్ల ప్రక్రియ నిర్వహిస్తున్న ఎస్‌బీఐ క్యాప్స్‌తో డార్విన్‌ గ్రూప్‌ ఉన్నతాధికారులు ఈ విషయమై బుధవారం సంప్రదింపులు జరిపారు.

ఏప్రిల్‌ 17 నుంచి కార్యకలాపాలు నిలిపేసిన జెట్‌లో 75 శాతం వరకు వాటా విక్రయానికి స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వంలోని బ్యాంకర్లు ప్రయత్నిస్తున్న సంగతి విదితమే. ఈ ప్రక్రియను ఎస్‌బీఐ క్యాప్‌ చేపట్టింది. ఏప్రిల్‌8-12 తేదీల్లో ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు దాఖలు చేసిన 4 సంస్థల్లో డార్విన్‌ గ్రూప్‌ లేదు. అయితే ఫైనాన్షియల్‌ బిడ్ల దాఖలుకు గడువుగా నిర్ణయించిన ఈనెల 10కి ముందు ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌తో పాటు కొన్ని కొత్త సంస్థలు బిడ్లు దాఖలు చేశాయని బ్యాంకర్ల బృందం ప్రకటించింది. ఈనెల 13న బిడ్లను బ్యాంకర్లు పరిశీలించారు. కొత్తగా బిడ్‌ దాఖలు చేసిన వాటిలో ఒకటైన డార్విన్‌ గ్రూప్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) రాహుల్‌ గన్‌పులె ఎస్‌బీఐ క్యాప్‌ ఉన్నతాధికారులతో బుధవారం చర్చించారు. రూ.14,000 కోట్లకు అయితే జెట్‌ ఎయిర్‌వేస్‌ను కొంటామని పేర్కొన్నారు. ఎతిహాద్‌ బిడ్‌లో పలు షరతులు ఉన్నట్లు బ్యాంకర్లు గుర్తించారు.

8నే బిడ్‌ వేశాం: డార్విన్‌ గ్రూప్‌

డార్విన్‌ గ్రూప్‌ గురించి విపణిలో పెద్దగా అవగాహన లేదు. చమురు, సహజవాయువు, ఆతిథ్యరంగం, స్థిరాస్తితో పాటు పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టామని డార్విన్‌ ప్లాట్‌ఫామ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చెప్పుకుంటోంది. తాము ఈనెల 8న బిడ్‌ అందించామని సంస్థ సీఈఓ రాహుల్‌ బుధవారం విలేకరులకు వెల్లడించారు. దీనిపై చర్చించేందుకు ఎస్‌బీఐ క్యాప్స్‌ ఆహ్వానంతోనే వచ్చినట్లు పేర్కొన్నారు. జెట్‌ ఎయిర్‌వేస్‌కు సంబంధించి రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌ఓసీ) వద్ద, ఇతర సంస్థల వద్ద బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఫైనాన్షియల్‌ బిడ్‌ వేశామని, అయితే సంస్థ ఆస్తులు, అప్పులు-చెల్లించాల్సిన మొత్తాలపై బయటకు రాని వివరాలు తెలుసుకునేందుకు, పూర్తిగా అవగాహన చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. తమకు ఏయే వివరాలు కావాలో ఎస్‌బీఐ క్యాప్స్‌కు వెల్లడించినట్లు తెలిపారు. సామర్థ్యం కలిగిన కంపెనీలుగా గుర్తించిన వాటికి జెట్‌పై పూర్తి వివరాలు అందాయని, తమకు ఇవ్వలేదన్నారు. బ్యాంకర్లు తమ బిడ్‌ను క్షుణ్నంగా తనిఖీ చేసి, అంగీకరిస్తేనే ఆ సమాచారం ఇస్తారని రాహుల్‌ వివరించారు.

బాకీలన్నీ తీరుస్తాం

జెట్‌ స్వాధీనానికి తమ గ్రూప్‌ రూ.14,000 కోట్లు చెల్లించేందుకు ముందుకు వచ్చిందని రాహుల్‌ తెలిపారు. ఒక్కసారి చెల్లింపు కింద, పాత బాధ్యతలన్నీ నెరవేరుస్తామని వెల్లడించారు. తమ గ్రూప్‌ అంతర్గత సమీకరణల ద్వారా నిధులు చెల్లిస్తుందని పేర్కొన్నారు. నిధులు ఎలా సమీకరిస్తారో వెల్లడించాలని ఎస్‌బీఐ క్యాప్స్‌ తమను కోరిందని రాహుల్‌ చెప్పారు. ఎతిహాద్‌తో కూడా చర్చలు జరుపుతున్నామని, ఆ సంస్థను కూడా జెట్‌ బోర్డులో భాగస్వాములను చేయాలన్నది తమ ప్రతిపాదనగా వివరించారు.

అప్పట్లో

* 2001లో ఎయిరిండియాలో 40 శాతం వాటా విక్రయించాలనే ప్రతిపాదన వచ్చినపుడు హిందూజా గ్రూప్‌ బిడ్‌ వేసింది.
* ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌లోనూ 26 శాతం వాటా కొనుగోలు కోసం అశోక్‌ లేలాండ్‌, హిందూజా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌తో పాటు విదేశీ కార్పొరేట్‌ సంస్థ మాకెన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లతో కలిసి బిడ్‌ వేశారు.
* అప్పట్లో ఈ ప్రభుత్వరంగ విమానయాన సంస్థల్లో వాటా విక్రయ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇటీవల ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రతిపాదన ముందుకు వచ్చినపుడు కూడా హిందూజా గ్రూప్‌ ఆసక్తి చూపిందని సమాచారం.

జెట్‌లో హిందూజా?
ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ సంప్రదింపులు
బ్యాంకర్లకూ అంగీకారమే
ఆసక్తి చూసినా, స్పష్టత ఇవ్వని హిందూజా గ్రూప్‌

జెట్‌ ఎయిర్‌వేస్‌లో వాటాను ఆర్థికంగా స్థితిమంతులకే విక్రయించాలని భాగస్వామి ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌తో పాటు, ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకర్లు యోచిస్తున్నారు. భారతీయ నేపథ్యం కలిగిన బ్రిటన్‌ కుబేరులు హిందూజా సోదరులకు చెందిన హిందూజా గ్రూప్‌తో ఇందుకోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ‘జెట్‌లో పెట్టుబడులకు సంబంధించి హిందూజా గ్రూప్‌ ఇప్పటివరకు స్పష్టమైన నిబద్ధత కనబరచలేదు. అయితే ఎతిహాద్‌ ప్రతినిధులు హిందూజా గ్రూప్‌ అధిపతి అయిన జీపీ హిందూజాను కలిసిన తరవాత, ఆ గ్రూప్‌ ఆసక్తి అయితే చూపుతోంది. హిందూజా గ్రూప్‌ భారతీయ వ్యాపారాలను పర్యవేక్షించే తన సోదరుడు అశోక్‌ హిందూజాను ఎతిహాద్‌ ప్రతినిధులకు జీపీ హిందూజా పరిచయం చేశారు’ అని ఎకనామిక్‌ టైమ్స్‌ వెల్లడించింది. హిందూజా సోదరుల సంపద విలువ 22 బిలియన్‌ పౌండ్లుగా (సుమారు రూ.1.98 లక్షల కోట్లు) సండేటైమ్స్‌ రిచ్‌లిస్ట్‌ ఇటీవల ప్రకటించిన సంగతి విదితమే.

* జెట్‌ ఎయిర్‌వేస్‌లో భాగస్వామిగా ఉన్న ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ కూడా మరికొంత వాటా కొనుగోలుకు ఫైనాన్షియల్‌ బిడ్‌ సమర్పించినా, మైనారిటీ వాటాదారుగా మాత్రమే ఉంటానని పేర్కొన్న సంగతి విదితమే. ప్రధాన వాటాదారుగా మరో సంస్థను జెట్‌లోకి ఆహ్వానించడమే ధ్యేయమని పేర్కొంది.
* జెట్‌లో వాటాల విక్రయం తేలకపోవడం, కార్యకలాపాలు నిలిచిపోయి నెల కావస్తుండటంతో, లీజ్‌పై ఉన్న విమానాల్లో సగానికి పైగా వాటి యజమానులు వెనక్కి తీసుకుని, ఇతర సంస్థలకు కేటాయించారు కూడా. సీఈఓ సహా నలుగురు ఉన్నతాధికారులు, పలువురు డైరెక్టర్లు జెట్‌ నుంచి వైదొలిగారు. జెట్‌కు వివిధ విమానాశ్రయాల్లో ఉన్న సమయాల్లో (స్లాట్స్‌) 60 శాతం వరకు పోటీ సంస్థలకు తాత్కాలిక ప్రాతిపదికన ప్రభుత్వం కేటాయించింది. జనవరి నుంచి వేతనాలు అందనందున, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పైలట్లు సహా ఇతర సిబ్బంది కూడా అవకాశం ఉన్న సంస్థల్లో చేరుతున్నారు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.