Eenadu Online Edition Business News - EENADU
close
38400 ఎగువన లాభాల జోరు!

సమీక్ష : పెద్ద షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం, షార్ట్‌ కవరింగ్‌ నేపథ్యంలో గత వారం మార్కెట్లు బలంగా పుంజుకున్నాయి. ఒకవైపు అమెరికా- చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగినప్పటికీ.. కంపెనీల త్రైమాసిక ఫలితాలు సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఆహార వస్తువుల ధరలు ప్రియం కావడంతో ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. భారత ఎగుమతులు నాలుగు నెలల కనిష్ఠానికి చేరగా, ద్రవ్యలోటు 5 నెలల గరిష్ఠానికి చేరింది. జూన్‌ 6న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మూలాలు బాగున్న షేర్ల వైపు మదుపర్లు మొగ్గుచూపారు. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. అమెరికా- చైనా వాణిజ్య పరిణామాల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు అప్రమత్తమయ్యాయి. అమెరికా ఆర్థిక గణాంకాలు, కంపెనీల ఫలితాలు దన్నుగా నిలిచాయి. ముడిచమురు ధరలు స్థిరంగా కదలాడాయి.మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 1.2 శాతం లాభంతో 37,931 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 1.1 శాతం పెరిగి 11,407 పాయింట్ల దగ్గర స్థిరపడింది. మన్నికైన వినిమయ వస్తువులు, ఎఫ్‌ఎమ్‌సీజీ, బ్యాంకింగ్‌ షేర్లు రాణించగా, ఆరోగ్య సంరక్షణ, లోహ, విద్యుత్‌ స్క్రిప్‌లు డీలాపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.6221 కోట్ల షేర్ల విక్రయించగా, డీఐఐలు, ఫండ్లు రూ.6730 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 1:1గా నమోదు కావడం..
చిన్న, మధ్య తరహా షేర్లలో అమ్మకాలను సూచిస్తోంది.

ఈవారంపై అంచనా
వరుసగా రెండు వారాల నష్టాల తర్వాత.. 36,956 పాయింట్ల వద్ద మద్దతు దక్కించుకున్న మార్కెట్‌ బలంగా పుంజుకుంది. 38,400 పాయింట్ల ఎగువకు చేరితే.. 38,920 వరకు ర్యాలీ కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత సరికొత్త జీవనకాల గరిష్ఠాలను పరీక్షించొచ్చు. ఇదే జరిగితే.. స్వల్పకాలంలో మార్కెట్‌లో లాభపడే షేర్ల సంఖ్య పెరగొచ్చు. ఇక 37,370 పాయింట్ల దిగువకు చేరితే.. 36,702 పాయింట్ల వరకు దిద్దుబాటుకు ఆస్కారం ఉంది.

ప్రభావిత అంశాలు
ఈ వారం అంతర్జాతీయ సంకేతాలు, ముడిచమురు ధరల కంటే దేశీయ పరిణామాలు మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. దేశీయంగా చూస్తే.. 23న సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇవి స్వల్పకాలంలో మార్కెట్లకు కీలకం కానున్నాయి. భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ మళ్లీ అధికారంలోకి రావొచ్చని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేయడంతో.. మార్కెట్ల జోరు కొనసాగే అవకాశం ఉంది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు చోటుచేసుకోవచ్చు. టాటా మోటార్స్‌, టెక్‌ మహీంద్రా, దివీస్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌, గ్రాసిమ్‌, హెచ్‌పీసీఎల్‌, ఐజీఎల్‌, బాటా, బీఎంఈఎల్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఈ వారం ఫలితాలు వెలువరించనున్నాయి. మధ్యప్రాచ్య దేశాల్లో ఉద్రిక్తతలు పెరగడంతో ముడిచమురు ధరల కదలికల నుంచి మార్కెట్లు సంకేతాలు తీసుకోవచ్చు. ధరలు మరింత పెరిగితే సెంటిమెంట్‌ దెబ్బతినే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లపై అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు ప్రభావం చూపొచ్చు. బ్రెగ్జిట్‌ పరిణామాలు, జపాన్‌ జీడీపీ, అమెరికా ఫెడ్‌ నిర్ణయాల నుంచి మదుపర్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు.

తక్షణ మద్దతు స్థాయిలు: 37,415, 36,956, 36,260;
తక్షణ నిరోధ స్థాయిలు: 38,460, 38,920, 39,487
మార్కెట్‌ 38,400 ఎగువకు చేరితే.. 38,920 వరకు లాభపడొచ్చు.
ఆ తర్వాత జీవనకాల గరిష్ఠాలకు చేరే అవకాశం ఉంది.

- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.