close
పామోలిన్‌ పైపైకి!

బంగారం, వెండి

పసిడి జూన్‌ కాంట్రాక్టు గతవారం రూ.31,987 వద్ద ఆరంభమైంది. ఆ తర్వాత సానుకూలంగా చలిస్తూ రూ.32,538 వద్ద వారం గరిష్ఠ స్థాయిని చేరింది. అనంతరం అధిక స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో కొంత దిద్దుబాటుకు లోనైంది. చివరకు 0.61 శాతానికి లాభాన్ని పరిమితం చేసుకుని రూ.31,791 వద్ద కాంట్రాక్టు స్థిరపడింది. గతవారం రూ.32,478 స్థాయిని అధిగమించడంలో కాంట్రాక్టు విఫలమైనందున సమీపకాలంలో కాంట్రాక్టు డీలాపడే అవకాశం ఉంది. సాంకేతికంగా కూడా కాంట్రాక్టు కూడా బలహీనంగానే కనిపిస్తోంది. ఈవారం విడుదలయ్యే అమెరికా కీలక ఆర్థిక గణాంకాలు ప్రభావం చూపుతాయి. ఏప్రిల్‌-మే అమెరికా ఫెడ్‌ సమావేశ ముఖ్యాంశాలను ట్రేడర్లు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. వెండి జులై కాంట్రాక్టు రూ.37,305 వద్ద సానుకూలంగా మొదలైంది. కొనుగోళ్ల దన్నుతో రూ.37,762 స్థాయి వద్ద వారం గరిష్ఠాన్ని చేరింది. అధిక స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడికి లోనై రూ.36,528 వరకు దిద్దుబాటుకు లోనైంది. ఆఖరుకు 1.95 శాతం నష్టపోయి రూ.36,577 వద్ద స్థిరపడింది. అయినా ఈవారం లాంగ్‌ పొజిషన్లు అట్టేపెట్టుకోవడం మంచిదే. అదే సమయంలో రూ.35,730 స్థాయికి దిగివచ్చే అవకాశాలూ లేకపోలేదు. అప్పుడు ఈ స్థాయి వద్ద తర్వాత నెల కాంట్రాక్టుకు మరికొన్ని లాంగ్‌ పొజిషన్లు జత చేసుకోవడం మంచి వ్యూహం అవుతుంది.


ప్రాథమిక లోహాలు

రాగి జూన్‌ కాంట్రాక్టు ఈవారం కనీసం ఒక ట్రేడింగ్‌ సెషన్‌లోనైనా రూ.424.30 కంటే కింద కదలాడితే ప్రతికూల ధోరణిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే తక్కువ స్థాయిల వద్ద మద్దతు దొరికే అవకాశమూ ఉండటంతో తిరిగి పుంజుకోవచ్చు. ఈ నేపథ్యంలో ధర తగ్గినప్పుడల్లా కొనుగోలు చేసే వ్యూహంతో ముందుకెళ్లొచ్చు. రూ.418.80 దిగువన స్టాప్‌లాస్‌ పెట్టుకోవడం మరవద్దు. సీసం మే కాంట్రాక్టు ఈవారం రూ.125.45 దిగువకు రాకుంటే.. కొత్తగా షార్ట్‌ పొజిషన్లు తీసుకోకపోవడం మంచిది. రూ.125.65- 126.35 మధ్య కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు. రూ.131.75 వరకు కాంట్రాక్టు వెళ్లే అవకాశం ఉంది. జింక్‌ మే కాంట్రాక్టు గత 4 వారాలుగా సానుకూలంగా చలించిన నేపథ్యంలో ఈవారం కొంత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఏదేని సానుకూల వార్త వస్తే కాంట్రాక్టు తిరిగి పుంజుకుంటుంది. ఈ నేపథ్యంలో రూ.207.85 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, ధర తగ్గినప్పుడల్లా కొనుగోలు చేసే వ్యూహాన్ని అనుసరించొచ్చు. అల్యూమినియం మే కాంట్రాక్టు ఈవారం రూ.147.95 స్థాయిని నిలబెట్టుకుంటే రూ.151.90; రూ.154.45 వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ రూ.146.70 కంటే కిందకు వస్తే రూ.150.55 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని షార్ట్‌ సెల్‌ పొజిషన్లు తీసుకోవచ్చు. నికెల్‌ మే కాంట్రాక్టు ఈవారం రూ.829.65 కంటే దిగువన ట్రేడ్‌ కాకుంటే.. కొనుగోళ్లు కొనసాగించొచ్చు. సాంకేతికంగా చూస్తే మధ్యకాలంలో కాంట్రాక్టు మరోమారు రూ.854; రూ.868 స్థాయిలను తాకే అవకాశం ఉంది.


ఇంధన రంగం

ముడి చమురు మే కాంట్రాక్టు సాంకేతికంగా ఈవారం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. రూ.4,462 దిగువకు రానంత వరకు కాంట్రాక్టుకు లాంగ్‌ పొజిషన్లు జతచేసుకోవడం మంచి వ్యూహం అవుతుంది. ఒకవేళ ఈ స్థాయి కంటే దిగువకు వస్తే కాంట్రాక్టు రూ.4,336; రూ.4,281 వరకు పడిపోయే అవకాశం ఉంటుంది. సహజ వాయువు మే కాంట్రాక్టుకు ఈవారం రూ.187.35 స్థాయిపై కన్నేసి ఉంచాలి. ఈ స్థాయి ఎగువన చలిస్తే కాంట్రాక్టుకు కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశం ఉంటుంది. ముడి పామోలిన్‌ నూనె (సీపీఓ) ఈవారం కూడా సానుకూలంగా చలించే అవకాశం ఉంది. రూ.515.80 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని రూ.519.65- 522 మధ్య ధర తగ్గినప్పుడల్లా కొనుగోలు చేసే వ్యూహంతో ముందుకెళ్లడం మంచిదే.


వ్యవసాయ ఉత్పత్తులు

పసుపు ఫ్యూచర్‌ కాంట్రాక్టు ఈ వారం రూ.7,200 స్థాయిని నిలబెట్టుకుంటే రూ.7,400 వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కాంట్రాక్టుకు నిరోధం ఎదురుకావొచ్చు. అప్పుడు లాభాలు స్వీకరించడం మంచి వ్యూహం అవుతుంది. సోయాబీన్‌ ఫ్యూచర్‌ కాంట్రాక్టు ఈవారం రూ.3,768 స్థాయిని నిలబెట్టుకోకుంటే మరింత డీలాపడొచ్చు. రూ.3,675 స్థాయి కంటే కిందకు వస్తే, అమ్మకాల ఒత్తిడి పెరిగి రూ.3,632; ఆ తర్వాత రూ.3,600 వరకు కాంట్రాక్టు పడిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ స్థాయిలపై ఓ కన్నేసి ఉంచడం మంచిది. జీలకర్ర ఫ్యూచర్‌ కాంట్రాక్టు ఈవారం మరోమారు గతవారం గరిష్ఠ స్థాయిని తాకే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రూ.17,231 వద్ద స్టాప్‌లాస్‌తో రూ.17,387- 17,543 మధ్య ధర తగ్గినప్పుడల్లా కొనుగోలు చేసే వ్యూహాన్ని అనుసరించడం మేలు.

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటిî

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.