close
కొత్త గరిష్ఠాలకు నిఫ్టీ?

ఎగ్జిట్‌పోల్స్‌ ప్రభావం
ఔషధ, ఐటీ రంగ షేర్లపై ఒత్తిడి
ఎఫ్‌ఎంసీజీ, బ్యాంక్‌ షేర్లు రాణిస్తాయ్‌
విశ్లేషకుల అంచనాలు

ఎగ్జిట్‌పోల్స్‌ ప్రకటన నేపథ్యంలో మార్కెట్ల జోరు సోమవారం కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్‌డీఏ కూటమే మళ్లీ అధిక స్థానాలు సాధిస్తుందనే అంచనాలను ఎక్కువ సంస్థలు వ్యక్తం చేయడమే ఇందుకు కారణం. స్థిరమైన ప్రభుత్వం వస్తుందనే మార్కెట్‌ వర్గాల అంచనాల వల్లే గత వారంలో.. ముఖ్యంగా శుక్రవారం సూచీలు (నిఫ్టీ 150 పాయింట్లు, సెన్సెక్స్‌ 537 పాయింట్లు) భారీ లాభాలు ఆర్జించిన సంగతి విదితమే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సాధారణ మెజార్టీ 272 సీట్లను అధిగమించి, ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఎన్‌డీఏ 300 సీట్లు సాధిస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ నిర్వహించిన ఎక్కువ సంస్థలు అంచనా వేశాయి. అయితే భారతీయ జనతా పార్టీ (భాజపా) ఎన్ని స్థానాలు దక్కించుకుంటుందనే అంశాన్ని మదుపర్లు కీలకంగా భావిస్తున్నారు. భాజపాయే సొంతగా ఆధిక్యం సాధిస్తే, సూచీలు మరింత దూసుకెళ్తాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సమీపకాలంలో మార్కెట్లు 5-10 శాతం లాభాలు ఆర్జించవచ్చని అధిక బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ భాజపాకు 250 సీట్ల కంటే ఎక్కువ వచ్చినా కూడా, నిఫ్టీ 50 ప్రస్తుత స్థాయిల కంటే 5 శాతం పెరుగుతుందని అంటున్నారు. ఆర్థిక సంస్కరణలను ప్రధాని మరింత ముందుకు తీసుకెళ్తారనే అంచనాలే ఇందుకు ప్రధాన కారణం. అయితే గురువారం (ఈనెల 23న) ఓట్ల లెక్కింపు ముగిసి, వాస్తవ ఫలితాలు వెల్లడైతేనే, లాభాలు స్థిరపడతాయి. నిఫ్టీ 50 ప్రస్తుత జోరు కొనసాగి, ఫలితాలు వెల్లడయ్యే గురువారానికే 11,650 స్థాయికి చేరొచ్చని భావిస్తున్నారు. స్థిరప్రభుత్వం ఏర్పాటైతే నిఫ్టీ 12,000 పాయింట్లకు దూసుకెళ్తుందని మార్కెట్‌వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయా రంగాలపై విశ్లేషకుల అంచనాలు ఇలా..

* మ్యూచువల్‌ఫండ్లు విక్రయాలు సాగిస్తున్నందున, ఔషధరంగ కంపెనీల షేర్లపై ఒత్తిడి కొనసాగొచ్చు. ధరలు పెంచి ఉత్పత్తులు విక్రయిస్తున్నాయని దేశీయ కంపెనీలపై అమెరికాలో నమోదైన కేసు ప్రభావమూ ఉంటుంది. జనరిక్‌ ఔషధాలు తయారుచేసే 20 సంస్థలపై అమెరికాలో కేసులు నమోదైన సంగతి విదితమే. అరబిందో ఫార్మా, లుపిన్‌ యూనిట్లపై యూఎస్‌ఎఫ్‌డీఏ ఇటీవలి చర్యల వల్ల, సెంటిమెంటు ప్రతికూలంగా మారింది.
* ప్రధాన మార్కెట్లకు అనుగుణంగా ఎఫ్‌ఎంసీజీ షేర్లు రాణించవచ్చు. కొత్త ప్రభుత్వంపై సందేహాలతో ఇప్పటివరకు ట్రేడింగ్‌కు దూరంగా ఉన్న వారు కూడా, మళ్లీ రంగంలోకి దిగుతారని పేర్కొంటున్నారు. వినియోగదారుల గిరాకీ పెంచేందుకు ఎన్డీయే ప్రభుత్వం భారీగా ఉద్దీపనలు ప్రకటిస్తుందనీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
* ప్రధాన మార్కెట్లతో బాటే బ్యాంకింగ్‌ షేర్లు సానుకూలంగా చలిస్తాయని అంచనా. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య సంప్రదింపులనూ మదుపర్లు గమనిస్తారు. అయితే స్వల్పకాలానికి ప్రతి గరిష్ఠ స్థాయిల వద్ద, ఒడుదొడుకులు ఎదురుకావచ్చని ఒక బ్రోకరేజీ సంస్థ పేర్కొంటోంది. ఫలితాల నేపథ్యంలో స్టాక్‌ ఆధారిత కదలికలు ఉండొచ్చు. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంకులు ఈ వారంలో ఫలితాలు ప్రకటించనున్నాయి.
* నిలిచిపోయిన మౌలిక వసతుల ప్రాజెక్టులతో పాటు సరికొత్త ప్రాజెక్టులపైనా కొత్త ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, నిర్మాణరంగానికి ప్రాధాన్యమిస్తుందని మార్కెట్‌వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, సిమెంటుకు గిరాకీ పెరుగుతుందనే అంచనాలతో, ఈ రంగ షేర్లు కూడా పరుగులు తీయొచ్చు. ఇటీవలి కాలంలో ధరల పెంపును ఉపసంహరించడం, నగదు లభ్యత కొరత వల్ల ఈ రంగ షేర్లపై ఒత్తిడి నెలకొంది. ఇవన్నీ తొలగుతాయని భావిస్తున్నారు.
* ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వస్తే రూపాయి బలోపేతం అవుతుందనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ రంగ షేర్లపై ఒత్తిడి పడుతుందని భావిస్తున్నారు. అందువల్ల మార్కెట్లు బాగా రాణించినా, ఐటీ రంగ షేర్లలో లాభాలు పరిమితంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. మంగళవారం ఫలితాల నేపథ్యంలో టెక్‌మహీంద్రా షేరు వెలుగులోకి రావచ్చు. డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే, మార్చిలో సంస్థ ఏకీకృత ఆదాయం 1-3 శాతం పెరగొచ్చని అంచనా.
* ప్రధాన సూచీలతో పాటే లోహ రంగ షేర్లు రాణించవచ్చు. ఫలితాల నేపథ్యంలో జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు వెలుగులోకి రావచ్చు.
* ప్రస్తుత ప్రభుత్వమే కొనసాగడానికి తోడు ఆర్డర్లు బాగున్నాయని దిగ్గజ సంస్థలు ఎల్‌ అండ్‌ టీ, సీమెన్స్‌ ప్రకటించడంతో, భారీ యంత్రపరికరాల షేర్లు రాణించవచ్చు. 2019-20లో ప్రైవేటు పెట్టుబడులు కూడా అధికమవుతాయని ఆశిస్తున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.