close
డబ్బుల పండుగ ఎగ్జిట్‌ పోల్స్‌ 

నిమిషంలో రూ.3.2 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద 
రోజు మొత్తానికి రూ.5.33 లక్షల కోట్లు 
పదేళ్లలో తొలిసారి నిఫ్టీ దూకుడు 
సెన్సెక్స్‌ హల్‌చల్‌

ఒక నిమిషంలో.. నూడుల్స్‌ కూడా ఉడకవు. 
ఒక నిమిషంలో.. సినిమా ట్రైలర్‌ కూడా పూర్తి కాదు. 
ఒక నిమిషంలో.. పిజ్జా ఇంటికి రాదు. 
ఒక నిమిషంలో.. వీవీ ప్యాట్‌ లెక్క సైతం తేలదు. 
కానీ.. సోమవారం స్టాక్‌ మార్కెట్లు ప్రారంభమైన నిమిషం వ్యవధిలోనే మదుపర్ల సంపద రూ.3.2 లక్షల కోట్లు పెరిగింది. సూచీలు రాకెట్‌ వేగంతో దూసుకెళ్లడంతో అంతే వేగంగా షేర్ల ధరలూ కదిలాయి. ఇది నిజంగా నిజం. 
ఎన్‌డీఏ ప్రభుత్వమే మళ్లీ గద్దెనెక్కుతుందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు కాస్తా.. మదుపర్లను, మార్కెట్లను డబ్బుల్లో ముంచెత్తాయి. 
ఈ లాభాలు రాబోయే రోజుల్లోనూ కొనసాగుతాయని.. ఫలితాల రోజున ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ నిజం అయితే వాటికి అడ్డూ అదుపూ ఉండదని విశ్లేషకులు అంటున్నారు. అయితే మదుపర్లు మాత్రం జాగ్రత్తగా ఉండక తప్పదనీ హెచ్చరిస్తున్నారు.

న్నికలలో భారతీయ జనతా పార్టీ (భాజపా) నేతృత్వంలోని ఎన్డీయే అంచనాలకు మించి మెజారిటీ సాధిస్తుందని ఆదివారం సాయంత్రం ఎగ్జిట్‌పోల్స్‌ ప్రకటించాయి. సోమవారం స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలు సాధించాయి. ‘మార్కెట్లు ఎన్డీయే పార్టీలకు అనుకూలమా, అందుకే ఇంతగా రాణించాయా’ అంటే, అదేమీ కాదు.. పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావడం వల్ల పాలన, విధానాల్లో స్థిరత్వం ఉంటుందనే భావనతోనే మార్కెట్లు స్పందించాయని నిపుణులు చెబుతున్నారు. 

‘మండే’ ఎండల్లో.. మదుపర్లపై లాభాల వర్షం కురిసింది. నిమిషం వ్యవధిలో రూ.3.2 లక్షల కోట్లు పెరిగిన మార్కెట్‌ విలువ కాస్తా.. రోజు మొత్తం మీద రూ.5.33 లక్షల కోట్లు అదనంగా పెరిగింది. ప్రజలు భాజపా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచారన్న ఎగ్జిట్‌ పోల్స్‌ వివరాలు సూచీలను పైపైకి లాక్కెళ్లాయి. ట్రేడింగ్‌ చివరకు బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.1,51,86,312.05 కోట్లకు చేరింది. శుక్రవారం ముగింపు రూ.1,46,58,709.68 కోట్లుగా ఉంది. వరుస మూడు రోజుల లాభాల కారణంగా మొత్తం మీద మదుపర్ల సంపద రూ.7.48 లక్షల కోట్లు పెరగడం విశేషమనే చెప్పాలి. 

సెన్సెక్స్‌, నిఫ్టీ.. జూమ్‌.. జూమ్‌.. 
మోదీ ప్రభంజనం మరోసారి కనిపిస్తుందన్న అంచనాల మధ్య సూచీలకు రెక్కలు వచ్చాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఏకంగా 1422 పాయింట్లు; నిఫ్టీ 421 పాయింట్లు మేర పెరిగాయి. సూచీల దూకుడు మొదటి నుంచి చివరి దాకా కొనసాగింది. సెన్సెక్స్‌ ప్రారంభంలోనే 770 పాయింట్లకు పైగా లాభంతో గట్టి ఆరంభాన్ని ఇచ్చింది. ఒక 15 నిమిషాల వ్యవధిలో 38,570.04 పాయింట్ల వద్ద కనిష్ఠ స్థాయిని చేరినా ఆ తర్వాత ఎక్కడా తడబడలేదు. ఒక దశలో 39,412.56 వద్ద గరిష్ఠ స్థాయినీ చేరింది. చివరకు 1,421.90(3.73%) పాయింట్ల లాభంతో 39,352.67 వద్ద స్థిరపడింది. మొత్తం మీద 39,300 కీలక స్థాయిని అధిగమించింది. నిఫ్టీ కూడా ఇదే తరహాలో పరుగులు తీసి చివరకు 421.10 పాయింట్ల (3.69%) లాభంతో 11,828.25 వద్ద స్థిరపడింది. ఏప్రిల్‌లో నమోదు చేసిన ఆల్‌టైం గరిష్ఠ స్థాయి అయిన 11,856కు ఇక కొద్ది దూరంలోనే ఉంది. ఒక రోజులోనే పొందిన లాభాల విషయంలో నిఫ్టీ పదేళ్లలోనే అత్యుత్తమంగా రాణించింది. జనవరి 25, 2009 తర్వాత 421 పాయింట్లు పొందడం ఇదే తొలిసారి. సెన్సెక్స్‌ సైతం గత ఆరేళ్లలోనే అత్యధిక ఒక రోజు లాభాలను పొందింది. 
బజాజ్‌ ఆటో, ఇన్ఫీ మినహా.. 
సెన్సెక్స్‌ షేర్లలో బజాజ్‌ ఆటో, ఇన్ఫోసిస్‌ మినహా మిగతా కంపెనీల షేర్లన్నీ లాభాల్లో తేలియాడాయి. 
ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఎల్‌ అండ్‌ టీ, యెస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎం అండ్‌ ఎం, మారుతీ, ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లు 8.64 శాతం దాకా రాణించాయి. ఐటీ షేర్లు మిశ్రమ ధోరణిని ప్రదర్శించాయి. 
52 వారాల గరిష్ఠ స్థాయిలకు.. 
మార్కెట్ల దూకుడులో 66 స్క్రిప్‌లు 52 వారాల గరిష్ఠాలకు చేరడం గమనార్హం. ఆ జాబితాలో బజాజ్‌ ఫైనాన్స్‌, డీసీబీ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, టైటన్‌, కోటక్‌ మహీంద్రా, పీవీఆర్‌లు కూడా ఉన్నాయి. మరో పక్క 151 స్క్రిప్‌లు 52 వారాల కనిష్ఠ స్థాయికి చేరుకోవడం గమనార్హం. వాటిలో బయోకాన్‌, బినానీ ఇండస్ట్రీస్‌, జుబిలంట్‌, మోన్‌శాంటోలున్నాయి. 
ఇక పయనం ఎటు..? 
మే 23 వరకు కొంత స్థిరీకరణ కనిపించొచ్చని ఎక్కువ భాగం విశ్లేషకులు అంటున్నారు. సాధారణంగా ఈ తరహా దూకుడు తర్వాత కొంత స్థిరీకరణకు జరుగుతుంటుందని.. ఫలితాలకు ఇంకా సమయం ఉన్నందున ఇపుడు కూడా అదే బాట పట్టవచ్చని అంటున్నారు. ఇక తుది ఫలితాలు స్వల్పకాల ధోరణిని దిశానిర్దేశం చేయొచ్చని అంటున్నారు. అయితే సూచీలపై లాంగ్‌పొజిషన్లు తీసుకున్న వారు లాభాలను స్వీకరించడం మేలని కొంత మంది అంటున్నారు. ఒక వేళ నిప్టీ 11,856(ఆల్‌టై గరిష్ఠం) స్థాయిని అధిగమిస్తే మాత్రం ఆ ర్యాలీ 12,100 వరకూ వెళుతుందని అంచనా వేస్తున్నారు. 11,720 వద్ద బలమైన మద్దతు ఉందని.. 11,590 వద్ద తాజా కొనుగోళ్లు చేయవచ్చని సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  అంతా అనుకున్నట్లు ప్రస్తుత ప్రభుత్వమే వస్తే.. ఎన్నికల ఫలితాల అనంతరం ర్యాలీ కనిపిస్తుందని దేశీయ బ్రోకరేజీలు అంటున్నాయి. ఎఫ్‌ఐఐలు కూడా భారత్‌ వైపు చూస్తాయని.. ఇది వచ్చే కొద్ది రోజుల పాటు లాభాలకు కారణమవుతుందని అవి అంటున్నాయి.

ఏపార్టీ వస్తే మాకేంటి 
మార్కెట్‌ వర్గాల మాట

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల తరుణంలో బిజినెస్‌ న్యూస్‌ ఛానళ్లతో పాటు సామాజిక మాధ్యమ వెబ్‌సైట్లు చూస్తుంటే కలిగే అభిప్రాయం ఒక్కటే.. ‘ఈక్విటీ మార్కెట్లు భాజపాకే అనుకూలం. ఆ పార్టీ విజయం సాధిస్తే సూచీలు మరింత దూసుకెళ్తాయి, లేకపోతే భారీగా నష్టపోతాయనే భావన వ్యాప్తి చెందేలా వ్యవహారం సాగింది. ముఖ్యంగా ఫండ్‌ మేనేజర్లు, మార్కెట్‌ నిపుణులు కూడా ఆయా అంశాలపై ప్రభుత్వాన్ని విమర్శించడం మానేశారు. నిఫ్టీ 50 సోమవారం 3 శాతానికి పైగా లాభపడింది. ఎగ్జిట్‌పోల్స్‌ వల్లే మార్కెట్లు ఇంతగా రాణించాయని అంటున్నారు కూడా. వాస్తవానికి మార్కెట్లు ఏ రాజకీయ పారీకైనా అనుకూలంగా ఉంటాయా.. అన్నది పరిశీలిద్దాం.  
ఈ ఉదాహరణలు చూడండి 
స్వేచ్ఛాయుత మార్కెట్లు సంప్రదాయకంగా మితవాద పార్టీలకు అనుకూలంగా ఉంటాయన్న వాదన ఉంది. ఈ పార్టీలు ‘మార్కెట్‌ అనుకూల విధానాలను’ అనుసరిస్తాయనే భావన ఇందుకు ప్రధాన కారణం. అదే అతివాద పార్టీల మద్దతుదార్లను మార్కెట్ల గురించి ప్రశ్నిస్తే, వెక్కిరింపు ధోరణితో మాట్లాడుతుంటారు. అయితే బ్రిటిష్‌ ఆర్థికవేత్త అయిన అలాడైర్‌ మెక్‌లోడ్‌ 2017లో రాసిన ఒక వ్యాసంలో ‘స్వేచ్ఛాయుత మార్కెట్లు ఎప్పుడూ రాజకీయంగా తటస్థ వైఖరితోనే ఉంటాయ’ని పేర్కొన్నారు. మార్కెట్లు రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తాయని తేల్చి చెప్పారు. ఈ వాదనలోనే అర్థముంది.  
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు ఓటు వేయాల్సి వచ్చినపుడు అక్కడి మదుపర్లు తీవ్ర ఆందోళన చెందారు. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఎన్నికయ్యాక, కీలకమైన ఎస్‌ అండ్‌ పీ సూచీ 36 శాతం పైగా రాణించడం గమనార్హం.  
మన దేశంలోనూ 2004లో అధికారంలో ఉన్న  ఎన్డీయే కూటమి కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ చేతిలో ఓటమి పాలైంది. ఆ ఏడాది చివరికి నిఫ్టీ  18 శాతం రాణించింది.  ఆ రెండు ఘటనలు పరిశీలిస్తే, ఎన్నికల ముందు మార్కెట్ల అంచనాలకు విరుద్ధంగా అధికారంలోకి వచ్చిన నేతలు/పార్టీలు స్థిరత్వాన్ని అందించగలిగారు. ఫలితమే మనదేశంలో యూపీఏ పాలనలో మార్కెట్లు రాణించగా, ట్రంప్‌ నేతృత్వంలో అమెరికాలో సానుకూలంగా చలిస్తున్నాయి.  
ఇప్పుడేం జరుగుతోంది?: ప్రస్తుత ఎగ్జిట్‌పోల్స్‌ను గమనిస్తే, మన స్టాక్‌మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న మదుపర్లు భాజపా నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు కనపడుతున్నారు. ఇందుకు కారణం భాజపా మితవాద పార్టీ అనో, దాని చరిస్మాటిక్‌ నాయకుడు, అధికారంలో కఠినంగా వ్యవహరించే నరేంద్రమోదీ ప్రధానిగా ఉన్నారనో కాదు. విధానాల పరంగా చూసినా, భాజపా-రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీల మధ్య పెద్దగా తేడాలేం లేవు. రెండు పార్టీలు కూడా మార్కెట్‌ సానుకూల విధానాలకు మద్దతు పలికేవే. తమకు సంతోషం కలిగించే నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ప్రభుత్వ జోక్యానికి మార్కెట్లు ఆహ్వానం పలికాయి కూడా. మార్కెట్లకు ప్రధానంగా కావాల్సింది .. విధాన నిర్ణయాలు, అమల్లో స్థిరత్వమే.  
స్థిర విధానాలు అవలంబిస్తే..: ప్రభుత్వ విధాన నిర్ణయాలు స్థిరంగా ఉంటే, భవిష్యత్తు పెట్టుబడులకు సంబంధించి ఎలా వ్యవహరించాలనే విషయంలో మదుపర్లు నిశ్చితాభిప్రాయానికి వస్తారు. ప్రస్తుత ఎన్నికలనే తీసుకుంటే, ఉన్న పార్టీల్లో అధిక సీట్లు సాధించే వీలు భాజపాకు ఉందని మార్కెట్లు భావిస్తున్నాయి. ఈ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వమే స్థిరంగా ఉండగలదనే అంచనాల వల్లే, ఎగ్జిట్‌పోల్స్‌కు అనుగుణంగా మార్కెట్లు భారీగా స్పందించాయి. మార్కెట్లు ఎక్కడైనా ఇదేవిధంగా వ్యవహరిస్తాయి. 

రూపాయి మెరిసింది

రూపాయి సోమవారం మెరిసింది. డాలరుతో పోలిస్తే రెండు నెలల్లోనే అత్యధికంగా 49 పైసలు పెరిగి 69.74 వద్ద ముగిసింది. విదేశీ ట్రేడర్లు ఎగ్జిట్‌ పోల్స్‌కు ఆహ్వానం పలకడం ఇందుకు నేపథ్యం. రూపాయి తొలుత 70.36 వద్ద ప్రారంభమై  ఒక దశలో 69.44 వద్ద గరిష్ఠ స్థాయినీ తాకింది. అయితే చివరకు మాత్రం శుక్రవారం ముగింపు 70.23తో పోలిస్తే 49 పైసలు మాత్రమే మెరుగైంది.

సెబీ జాగ్రత్తలు

గ్జిట్‌ పోల్స్‌ నేపథ్యంలో మార్కెట్లు భారీగా పెరగడంతో సెబీ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. పర్యవేక్షక వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసింది. ఈ వారం వ్యవధిలో ఏవైనా అవకతవకలు జరుగుతాయేమోనన్న అనుమానాలతో నిరంతరం ట్రేడింగ్‌ను పరిశీలిస్తోంది.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.