Eenadu Online Edition Business News - EENADU
close
సంచలనం చేయదల్చుకోలేదు

 సుబ్రమణియన్‌ ఆరోపణల్ని ఖండిస్తున్నాం: పీఎం ఆర్థిక సలహా మండలి
 నిపుణుల సిఫారసుల మేరకే ప్రాతిపదిక మార్పు
 గణాంకాలను ఆయన ఇంకా అర్థం చేసుకోలేదేమో

దిల్లీ: జీడీపీ గణాంకాలను ఎక్కువ చేసి చూపారంటూ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్‌ సుబ్రమణియన్‌ చేసిన ఆరోపణలను ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎమ్‌) తీవ్రంగా ఖండించింది. త్వరలోనే ఆయన ఆరోపణలన్నిటిపైనా ఒక్కోటిగా సవివరంగా సరైన సమాధానాలిస్తామని తెలిపింది. 2011-12 నుంచి 2016-17 కాలంలో జీడీపీ గణాంకాలను 2.5 శాతం ఎక్కువ చేసి చూపారని.. జీడీపీ గణాంకాల లెక్కింపు పద్ధతిలో మార్పు వల్లే ఇలా జరిగిందని ఆయన మంగళవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, హార్వర్డ్‌ యూనివర్సిటీ పరిశోధన పత్రంలో ఆయన పేర్కొన్న ఆ అంశాలు, అంచనాలను ఆర్థిక సలహా మండలి పరిశీలించనుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.
జాతీయ ఆదాయ ఖాతాల్లో నిపుణలతో ఏర్పాటైన పలు కమిటీల సిఫారసుల మేరకే భారత ఆదాయ గణాంకాల లెక్కింపునకు ప్రాతిపదిక సంవత్సరాన్ని నుంచి 2011-12కు మార్చినట్లు ఈఏసీ-పీఎమ్‌ తెలిపింది. కొన్నేళ్ల పాటు పరిశీలించిన అనంతరం జనవరి 2015లో ఆ మార్పు చేసినట్లు వివరించింది. కాబట్టి నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదన్నది అవాస్తవమని వివరించింది. ఈ కొత్త జీడీపీ సిరీస్‌ ప్రకారం.. భారత వృద్ధి రేటు నాటకీయంగా పెరుగుతూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరు తెచ్చిందని పలువురు ఆర్థికవేత్తలు, విధానకర్తలు గతంలోనూ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ కూడా అధిక వృద్ధి రేటుతో ఆశ్చర్యానికి లోనైట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే.

‘ఆ అంశాల వినియోగమే ప్రశ్నార్థకం’
కాగా, సుబ్రమణియన్‌ తన పరిశోధనా పత్రంలో పేర్కొన్న ‘కొన్ని అంశాల’ వినియోగాన్ని సైతం ఈఏసీ ప్రశ్నించింది. ‘2001-2017 కాలానికి వృద్ధి రేటు లెక్కింపులో 17 అంశాలను సుబ్రమణియన్‌ లెక్కలోకి తీసుకున్నారు. అందులో విద్యుత్‌ వినియోగం, ద్విచక్ర, వాణిజ్య వాహన విక్రయాలు, విమానయాన ప్రయాణికుల రద్దీ, విదేశీ ప్రయాణికుల రాక, రైల్వే రవాణా, పారిశ్రామికోత్పత్తి సూచీ, వస్తువుల, సేవల ఎగుమతులు తదితరాలున్నాయి. ఇవన్నీ కేంద్ర గణక కార్యాయలంతో సంబంధం లేకుండా వెలువడే గణాంకాలు కాబట్టే సుబ్రమణియన్‌ వాటిని ఎంచుకున్నార’ని ఈఏసీ అంటోంది. సుబ్రమణియన్‌ తన పత్రంలో 17 అంశాల్లో 16 అంశాలు 2011కు ముందు వరకు జీడీపీతో సానుకూలంగా కదిలాయని; అయితే 2011 తర్వాత 17 అంశాల్లో 11 ప్రతికూలంగా చలించాయని ఆయన చెబుతున్నారు. ఉత్పాదకత ప్రయోజనాల ఆధారంగా జీడీపీ పెరిగిందని చెప్పడానికి ఆ పత్రంలో వీలు లేకుండా చేశారని ఈఏసీ ఛైర్మన్‌ వివేక్‌ దేవ్‌రాయ్‌ పేర్కొన్నారు.

‘ప్రస్తుతానికి ఈ అంశాన్ని సంచలన వార్తగా చేయదలచుకోలేదు. భారత గణాంకాల వ్యవస్థకున్న స్వతంత్రాన్ని, నాణ్యతను కాపాడడం కోసం ప్రస్తుతానికి చర్చలు చేపట్టాలని భావించడం లేదు. సుబ్రమణియన్‌ లేవనెత్తిన కొన్ని అంశాలు ఆయన సీఈఏగా ఉన్న సమయంలోనివే. అంటే ఆయన భారత వృద్ధి గణాంకాలను అర్థం చేసుకోవడానికి సమయం తీసుకున్నారన్నమాట. ఇప్పటికీ అర్థం అయిందో లేదో అనుమానమే’నని ఆర్థిక సలహా మండలి విమర్శించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.