close

ప్రధానాంశాలు

ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం
జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి
మొక్క నాటి నీరు పోస్తున్న జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఫొటో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. స్థానిక జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఫొటో ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించి పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని ఓటర్లందరూ ఈ నెల 31వ తేదీలోపు ఓటరు జాబితాలో తమ వివరాలను సరి చూసుకోవాలన్నారు. ఇందుకోసం ఓటర్‌ హెల్స్‌లైన్‌, చరవాణి యాప్‌, లేకుంటే బీఎల్‌వోల సహాయం తీసుకోవాలన్నారు. ఓటరు జాబితాలో మార్పులు చేర్పులపై కూడా ఓటర్లు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సెప్టెంబరు 1 నుంచి 30 వరకు బూత్‌ లెవల్‌ అధికారులు ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరిస్తారని ఆయన చెప్పారు. అక్టోబరులో డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌, నవంబరు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందన్నారు. డిసెంబరు 25న తుది జాబితా విడుదల కోసం కమిషనర్‌ కార్యాలయానికి వివరాలు పంపనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. తుది ఓటరు జాబితాను వచ్చే ఏడాది జనవరి 15వ తేదీలోపు ఎన్నికల కమిషన్‌ విడుదల చేయనుందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఓ.జే మధు, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఆర్డీవోలు మధుమోహన్‌, రమేష్‌, డీఆర్డీవో రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆర్డీవో కార్యాలయ ఆవరణలో హరితహారం

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: స్థానిక ఆర్డీవో కార్యాలయ ఆవరణలో గురువారం అధికారులు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అధికారులతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు విస్తృతంగా మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ ఆర్డీవో మధుమోహన్‌, తహసీల్దార్‌ సలీం, ఉద్యోగులు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫుడ్‌ ప్రాసెస్‌ యూనిట్‌ ఏర్పాటు చేయండి

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధానన కార్యదర్శులు బొమ్మినేని వెంకట్‌రెడ్డి, ఆది సాయన్న మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న జనగామ జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్యను తీర్చాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజారెడ్డి, బర్ల శ్రీరాములు, జనార్థన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఓటరు జాబితాలో లోపాలను సవరించాలని..

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: ఓటరు జాబితాలో ఉన్న లోపాలను సవరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం స్థానిక జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డికి వినతిపత్రం అందించారు. ఓటరు జాబితాలో చోటు చేసుకున్న తప్పులను సవరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు సీపీఎం నాయకులు తెలిపారు. మృతి చెందిన వారిని ఓటరు జాబితా నుంచి తొలగించాలని కోరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బూడిద గోపి, బొట్ల శ్రీనివాస్‌, బొట్ల శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.