close
ఒక్కసారిగా మార్చేయగలమా?

2025 కల్లా ద్వి, త్రిచక్ర వాహనాలన్నీ సాధ్యం కాదు
 ఆధార్‌ వివరాలతో కార్డులు ముద్రించినంత సులభమా?
 దశలవారీగా మారడమే పరిష్కారం
 నీతిఆయోగ్‌ ప్రతిపాదనలపై హీరో, బజాజ్‌, టీవీఎస్‌

దిల్లీ: ఆటోలను 2023కు, బైక్‌లను 2025 కల్లా పూర్తిగా విద్యుత్తుతో నడిచేలా తయారు చేయడం సాధ్యమయ్యే పనికాదని దిగ్గజ వాహన తయారీ కంపెనీలు హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ ఆటో, టీవీఎస్‌ మోటార్‌ పేర్కొన్నాయి. కోట్ల మందితో ముడిపడిన, ఆర్థిక వ్యవస్థపై అత్యంత ప్రభావం చూపే ఈ నిర్ణయాన్ని ‘ఆధార్‌ వివరాలతో ప్లాస్టిక్‌ కార్డు తయారు చేసినంత సులభంగా’ చూడొద్దని హితవు పలికాయి. 100 శాతం ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు విద్యుత్తుతో నడిచేలా తయారు చేసేందుకు, గడువును నిర్దేశిస్తూ నీతిఆయోగ్‌ చేసిన ప్రతిపాదనలను కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. నిశిత అధ్యయనం, పరిశీలన లేకుండానే ఇలా చేశారంటూ ఆక్షేపించాయి. విద్యుత్తు వాహనాలకు సత్వరం మారేందుకు ఎలాంటి చర్యలు అవసరమో 2 వారాల్లోగా వాహన తయారీదార్ల సంఘం (సియామ్‌), కంపెనీలు తెలపాలంటూ నీతిఆయోగ్‌ గతవారం కోరడంపై ఇలా స్పందించాయి.

విద్యుత్‌ షాక్‌’పై వాహన కంపెనీలు

ఆధార్‌ లేదా సాఫ్ట్‌వేర్‌తో కార్డులు ముద్రించినంత సులభంగా, ప్రస్తుతం తయారు చేస్తున్న వాహనాలను విద్యుత్తులోకి మార్చడం సాధ్యం కాదని గుర్తించాలి. పూర్తిస్థాయి సరఫరా వ్యవస్థలు సిద్ధం కావాలి. ప్రస్తుత వ్యవస్థల నుంచి ఇవి కొత్తగా మారాల్సి ఉంది. తగిన ప్రణాళికలను 4 నెలల్లో రూపొందిస్తామని చెప్పాం. అత్యధిక ద్విచక్ర వాహనాలున్న ఒక నగరంతో ప్రారంభించి, క్రమంగా విస్తరించుకుంటూ వెళ్లాలి. 2 కోట్ల వాహనాలు, 15 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.05 లక్షల కోట్ల) అమ్మకాలు, 10 లక్షల మంది ఉద్యోగులతో ముడిపడిన వాహన వ్యవస్థను ఒక్కసారిగా పూర్తిగా మార్చేయడం ఎంత కష్టం. దీనివల్ల పడే వాస్తవ ప్రభావాలపై ప్రజల నుంచి ఆలోచనలు వస్తాయి.

- వేణు శ్రీనివాసన్‌, ఎండీ, టీవీఎస్‌ మోటార్‌

 150 సీసీ లోపు సంప్రదాయ ద్విచక్ర వాహనాలను పూర్తిగా నిషేధించాలనే నీతిఆయోగ ప్రతిపాదన వల్ల  అవాంఛనీయ పరిణామాలు సంభవించవచ్చు. 2020 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తున్న ప్రమాణాల వల్ల, ప్రపంచంలోనే అధిక ఇంధన సామర్థ్యంతో పనిచేస్తూ, అతి తక్కువ ఉద్గారాలు మాత్రమే వెదజల్లేలా మన ద్విచక్ర వాహనాలుంటాయి. విద్యుత్తు వాహనాలను బలవంతంగా రుద్దక, రెండు రకాల వాహనాలు ఆరోగ్యకరంగా సాగేలా విధానాలుండాలి. వినియోగదారుల అంగీకారం, మార్కెట్‌ పరిస్థితులనూ పరిగణనలోకి తీసుకోవాలి. అందుకు భిన్నంగా సంప్రదాయ వాహనాలను నిషేధించడం అంటే, వాహన పరిశ్రకు భారీ నష్టం తప్పదు. కల్పిస్తున్న లక్షల ఉద్యోగాలు, జీడీపీలో వాటాలను గమనిస్తే, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావం ఏర్పడుతుంది. ఒక్కసారిగా అన్నీ మారాలంటే, తయారీసంస్థలు, విడిభాగాల సంస్థలు, అమ్మకందార్లు, మెకానిక్కులకు వీలు కాదు. ఇందువల్ల కోట్ల మందిపై ప్రభావం పడుతుంది. అందువల్ల దశలవారీగా అమలు చేయడమే పరిష్కారం.

- హీరో మోటోకార్ప్‌

ద్వి, త్రిచక్ర వాహనాలన్నీ 100 శాతం విద్యుత్తుతోనే నడిపించాలన్న ప్రతిపాదనే సరికాదు. వాస్తవ కార్యాచరణకు దూరంగా, ప్రస్తుత సమయంలో చేశారు. పరిశ్రమ పరిమాణం, ఇందులో ఎంతమంది భాగస్వాములున్నారనే అంశాన్ని గమనిస్తే, అర్థవంతమైన సూచనే కాదు. ఒకపక్క పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలను బీఎస్‌ 6 ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ఇచ్చిన గడువుకు సమీపంలోనే, మళ్లీ విద్యుత్తుకు మారాలంటే ఎంత వ్యయాలు అవసరం. బొగ్గుతో జరిగే విద్యుదుత్పత్తితో ఛార్జింగ్‌ అయ్యే బ్యాటరీలను వాహనాల్లో వినియోగించినంత మాత్రాన కాలుష్యం ఏమీ తగ్గదు. మొత్తం కాలుష్యంలో వాహన ఉద్గారాల వాటా 20 శాతం. వాహన ఉద్గారాల్లో ద్విచక్ర వాహనాల వాటా 20 శాతం. అంటే మొత్తం కాలుష్యంలో వీటి వాటా 4 శాతం మాత్రమే. స్థిర విధానాల వల్లే, ద్విచక్ర వాహన రంగంలోకి విదేశీ పెట్టుబడులు వస్తున్నాయన్నది గమనించాలి. అత్యంత పోటీ ఉన్న ఈ రంగంలో, బాగా వృద్ధి చెందుతోంది ఇదే.

- రాజీవ్‌ బజాజ్‌, ఎండీ, బజాజ్‌ ఆటో

  

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.