close

ప్రధానాంశాలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. టీచర్ల భర్తీకి క్యాలెండర్‌ సిద్ధం చేయండి: జగన్‌

రాష్ట్రంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి క్యాలెండర్ తయారు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగానే ఉపాధ్యాయల సంఖ్య ఉండాలని ఆయన స్పష్టం చేశారు. కొన్ని చోట్ల అన్ని తరగతులకూ ఒక్క గురువే ఉన్నారని సీఎం దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపర్చే విషయంలో అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘త్వరలో గాంధీభవన్‌కు ఫర్‌ సేల్‌ బోర్డు’

టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్ రెడ్డిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. 370 ఆర్టికల్‌, జమ్మూ కాశ్మీర్ విభజనపై చర్చకు ఉత్తమ్ సిద్ధంగా ఉండాలని సవాల్‌ చేశారు. జాతీయ సమస్యను ఓ అంతర్జాతీయ సమస్యగా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వివేక్‌తో గంటసేపు చర్చలు జరిపినా తమపై నమ్మకంతోనే ఆయన భాజపాలో చేరారని చెప్పారు. కొద్ది రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం గాంధీభవన్‌కు ఫర్ సేల్ బోర్డు పెడతారని ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కశ్మీర్‌ మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు తగవు

జమ్మూకశ్మీర్‌ మహిళలపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగినవి కావని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. ఖట్టర్‌ వ్యాఖ్యలపై శనివారం ఆయన ట్విటర్‌ ద్వారా స్పందించారు. ఈ సందర్భంగా ట్వీట్‌లో పేర్కొంటూ... ఈ వ్యాఖ్యల్ని చూస్తుంటే ఇన్ని సంవత్సరాలుగా ఆర్‌ఎస్‌ఎస్‌ శిక్షణ వారి మనసుల్ని ఎంత బలహీనంగా చేసిందో అర్థమవుతోందని అన్నారు. మహిళల్ని సొంతం చేసుకోవడానికి వారేమైనా ఆస్తులా అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కొచ్చిలో విమాన సర్వీసుల పునరుద్ధరణ

గత కొన్ని రోజులుగా కేరళలో కురుస్తున్న వర్షాల కారణంగా కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం నుంచి విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. మొదట ఆదివారం మధ్యాహ్నం 3:00 గంటల వరకు విమాన సర్వీసులను నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. తాజా సమాచారం మేరకు  ప్రకటించిన సమయం కంటే మూడు గంటలు ముందే.. అంటే ఆదివారం మధ్యాహ్నం 12:00 గంటలకే సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నట్లు కొచ్చి అంతర్జాతీయ విమానయాన సంస్థకు చెందిన అధికార ప్రతినిధి  తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘సాహో’ ట్రైలర్‌ వచ్చిందండోయ్‌..

6. ఆహార పొట్లాలపై నవ్వుతూ ఫొటోలెందుకు

వరదల వల్ల సర్వం కోల్పోయిన ప్రజలకు పంచుతున్న ధాన్యం పొట్లాల విషయంలోనూ మహారాష్ట్ర ప్రభుత్వం స్వార్థపూరితంగా ప్రచారం చేసుకుంటోందని ఎన్సీపీ నాయకుడు ధనుంజయ్‌ ముండే విమర్శించారు. సంగ్లీ జిల్లాలో నిరాశ్రయులైన వారికి పంచుతున్న ధాన్యం ప్యాకెట్లపై ముఖ్యమంత్రి ఫడణవీస్‌, భాజపా ఎమ్మెల్యే సురేశ్‌ హల్వంకార్‌ ఫొటోలు నవ్వుతూ ఉండడాన్ని ఆయన తప్పుబట్టారు. వరద బాధితులకు ప్రభుత్వం చేస్తున్న సాయం కూడా స్వార్థపూరితంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ముండే ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆర్టికల్‌370 రద్దుపై సుప్రీంకు నేషనల్‌ కాన్ఫరెన్స్‌

జమ్ముకశ్మీర్‌లో 370 అధికరణను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆ రాష్ట్ర మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లాకు చెందిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ ఉత్తర్వులు చెల్లుబాటు కాకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆ పార్టీ నేతలు మహ్మద్‌ అక్బర్‌ లోన్‌, హస్నేన్‌ మసూదీ నేడు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అంతేగాక.. జమ్ముకశ్మీర్‌ రీ ఆర్గనైజేషన్‌ యాక్ట్‌ 2019 రాజ్యంగ విరుద్ధమని ప్రకటించాలని పిటిషనర్లు కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆగస్టు 15 తర్వాత టీమిండియా కోచ్ ఎంపిక?

టీమిండియా ప్రధాన కోచ్‌ ఎంపిక ఆలస్యం కావొచ్చని తెలుస్తోంది. భారత జట్టు కోచ్‌ పదవికి దరఖాస్తు చేసిన అందరినీ వడబోసి సుమారు ఆరు మందిని ఇంటర్వ్యూకు ఎంపిక చేశారని సమాచారం. అయితే ఈ ఇంటర్వ్యూలు ఆగస్టు 13, 14వ తేదీల్లో జరగాలి. కానీ పేపర్‌ వర్క్‌ ఇంకా మిగిలి ఉండటంతో ఆగస్టు 15 తర్వాత ఇంటర్వ్యూలు జరుగుతాయని, ఒకే రోజులో ఇంటర్వ్యూ ప్రక్రియను పూర్తిచేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రష్యాలో అణు ప్రమాదమా..?

మాస్కోలోని ఆర్కిటిక్‌ క్షిపణి పరీక్షా కేంద్రంలో నేడు జరిగిన పేలుడులో దాదాపు ఐదుగురు చనిపోయినట్లు సమాచారం. ఆ దేశ సైన్యం మాత్రం ఇద్దరే చనిపోయారని పేర్కొంటోంది. ఈ పేలుడు జరిగిన వెంటనే సమీపంలోని పట్టణంలో రేడియేషన్‌ భారీగా పెరిగిపోయిందని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. కానీ, రష్యా సైన్యం మాత్రం దీనిపై పెదవి విప్పలేదు. ఈ ప్రమాదం గురువారం సంభవించింది. ఒక ద్రవ రాకెట్‌ ఇంజిన్‌కు పరీక్షలు నిర్వహిస్తుండగా ఈ ఘటన సంభవించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రౌడీ తరహాలో విద్యార్థిపై అధ్యాపకుడి దాడి

పాఠాలు బోధించాల్సిన ఓ అధ్యాపకుడు రౌడీగా మారారు. తరగతి గదిలోనే విద్యార్థిపై  పిడి గుద్దులతో విరుచుకుపడ్డాడు. జగిత్యాలలో ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న సిద్ధిరాజ్‌.. మనోజ్‌ అనే విద్యార్థిని చితకబాదాడు. రౌడీ తరహాలో కాలితో తన్నుతూ చెలరేగిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై బాధిత విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.