close
పసిడి బేలచూపులు 

వాస్తవ ధరల కంటే తక్కువకే విక్రయం 
అయినా కొనుగోలుదార్లు లేరు 
ఈనాడు వాణిజ్య విభాగం

బంగారం దిగుమతిపై కస్టమ్స్‌ సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచారు. ఇంకేముంది బంగారం ధర భగ్గుమంటుందనే అందరూ భావించారు. అయితే కొనేవారుంటేనే కదా.. ఏ వస్తువుకైనా గిరాకీ ఏర్పడేది. ఇదే సూత్రం బంగారానికీ అన్వయిస్తుంది. దేశీయంగా బంగారానికి అధిక గిరాకీ లభించేది గ్రామీణ ప్రాంతాల నుంచే. జులై మధ్యకు వచ్చినా, చినుకు కరవై రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. వర్షాలు సరిగా లేకపోతే, గ్రామీణ ఆదాయాలు మందగిస్తాయి కాబట్టి, పసిడికి గిరాకీ తగ్గిపోతుందనే భావిస్తున్నారు. ఇతర వ్యాపారాలు కూడా అంతంతమాత్రంగా ఉండటంతో, బులియన్‌ సైట్లలో చూపుతున్న బ్యాంక్‌ ఆధారిత పసిడి ధరల కంటే, విపణిలో తక్కువమొత్తానికే విక్రయాలు సాగుతున్నాయి.

అంతర్జాతీయ విపణిలో మేలిమి బంగారం ఔన్సు (31.10 గ్రాములు) 1415 డాలర్ల మేర ఉంది. డాలర్‌ విలువ రూ.68.457గా ఉంది. అందువల్ల ఔన్సు విలువ రూ.96,866 అవుతుంది. అంటే గ్రాము రూ.3115 చొప్పున, 10 గ్రాములు రూ.31,150 అవుతుంది. దీనికి 15.5 శాతం (కస్టమ్స్‌ 12.5 శాతం+ 3 శాతం జీఎస్‌టీ). పన్ను రూ.4827 కలిపితే రూ.35,973 అవుతుంది. ఇది పూర్తిగా అధికారికంగా దిగుమతి చేసుకున్న సంస్థలు విక్రయించాల్సిన ధర. అయితే హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో గురువారంనాడు 10 గ్రాముల మేలిమి (999 స్వచ్ఛత) బంగారం ధర రూ.35,685 మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే ధర పలుకుతోంది. అయితే వాస్తవంగా వచ్చేసరికి రూ.34,500కు కొనేవారు కూడా లేరని వ్యాపారులు చెబుతున్నారు. అంటే మేలిమి బంగారం 10 గ్రాములకు దిగుమతిదార్లకు అయ్యే వాస్తవ ధర కంటే రూ.1185 తక్కువకే లభిస్తోంది. అయితే బిస్కెట్‌ రూపంలో 100 గ్రాముల పరిమాణంలో అయితేనే తక్కువ ధరకు బులియన్‌ వ్యాపారులు విక్రస్తున్నారని బులియన్‌ సంఘాలు పేర్కొంటున్నాయి. అంటే బిస్కెట్‌ (100 గ్రాములు) ఆన్‌లైన్‌ ట్రేడిండ్‌ ధర రూ.3,56,850 అయినా రూ.3,45,000కు (రూ.11,850) తక్కువకే విక్రయిస్తున్నారు. అయినా కూడా విక్రయాలు లేవనే చెబుతున్నారు.

అంతర్జాతీయంగా ప్రస్తుత ధరే ఉన్నా, దేశీయంగా బడ్జెట్‌లో పన్ను పెంచిన రోజు హైదరాబాద్‌ విపణిలో 10 గ్రాముల బంగారం రూ.36,200కు చేరిన సంగతి విధితమే.అయినా విక్రయాలు మాత్రం తక్కువ మొత్తానికే జరిగాయి.

భిన్న ప్రాంతాల్లో వేర్వేరు ధరలు 
అంతర్జాతీయ ట్రేడింగ్‌ ధరలు, డాలర్‌ మారకపు విలువ పసిడి ధర నిర్ణయంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. దీనికి సుంకాల భారం అదనం. అయినా కూడా బంగారానికి దేశ వ్యాప్తంగా లేదా ఏదైనా రాష్ట్రంలోని అన్ని నగరాల్లో ఒకే ధర అనేదే అమలు కావడం లేదు. బంగారాన్ని దిగుమతి చేసుకునే సంస్థలు, తమ దిగుమతి ఖర్చులు, వ్యయాలు కలుపుకుని, స్థానిక గిరాకీకి అనుగుణంగా కొంత అదనపు ధర కలిపి విక్రయిస్తుంటాయి.

అమెరికాలో వడ్డీరేట్లు తగ్గిస్తామని, ఆదేశ కేంద్ర బ్యాంక్‌ అయిన ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ ప్రకటించడంతో, పెట్టుడులు పసిడిపైకి మళ్లుతాయని, భావించారు. ఫలితంగా బుధవారంతో పోలిస్తే, గురువారం ఉదయం అంతర్జాతీయ ట్రేడింగ్‌ విపణిలో 5 డాలర్లు పెరిగి ఔన్సు బంగారం 1420 డాలర్లకు చేరింది. ఫలితంగా దిల్లీలో గురువారం ఉదయం 10 గ్రాముల మేలిమిబంగారం ధర రూ.930 పెరిగి రూ.35,800కు చేరింది. అయితే సాయంత్రానికి ఔన్సు ధర 1415 డాలర్లకు దిగివచ్చింది. ముంబయిలో చూస్తే 10 గ్రాముల మేలిమిబంగారం రూ.34,768గా ఉంది.

కొనుగోలుదార్లు ఏం చేయాలి? 
ఆషాఢమాసం కావడంతో, శుభకార్యాలు లేనందున ఈ నెలలో పసిడి ధరలు తక్కువగానే ఉండొచ్చనే అభిప్రాయాన్ని బులియన్‌ వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు. వర్షాల స్థితి ఇలానే ఉంటే, పండుగల సమయానికీ గిరాకీలో పెద్దగా మార్పు రాదనే అంటున్నారు. అదీకాక, బంగారంపై కస్టమ్స్‌ సుంకం 10 శాతంగా ఉన్నప్పుడు దిగుమతి చేసుకున్నవారు, పెద్దనోట్ల రద్దు సమయంలో, పెద్దమొత్తంలో పసిడి బిస్కెట్లు కొనుగోలు చేసుకున్న వారు కూడా ఇప్పుడు ట్రేడింగ్‌ ధర కంటే తక్కువ విక్రయిస్తున్నారు. వారు కొనుగోలు చేసిన ధరలతో పోలిస్తే, ఇప్పుడు అధిక మొత్తం రావడం ఇందుకు కారణం. అత్యవసరం కాని లోహం కనుకే, దిగుమతులను నిరుత్సాహ పరచేందుకు కస్టమ్స్‌ భారాన్ని పెంచినట్లు స్పష్టం చేసింది. బంగారాన్ని అవసరం మేర కొనుగోలు చేసుకుంటే ఉత్తమమని  చెబుతోంది. అందువల్ల శుభకార్యాలకు అవసరమైన వారే కొనుగోలు చేసుకుంటే, గిరాకీ అదుపులో ఉండి, ధరలు పెరగకుండా ఉంటాయి. పెట్టుబడులకు ప్రత్యామ్నాయ సాధనాలను ఎంచుకుంటే, విదేశీ మారక ద్రవ్యం ఆదా చేయాలన్న ప్రభుత్వ లక్ష్యమూ నెరవేరుతుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.