close
అయిదేళ్లలో రెట్టింపు ఐటీ ఉద్యోగాలు 

10 లక్షలకు చేరొచ్చు: ‘హైసియా’ అంచనా 
ఎగుమతుల్లో ఈ ఏడాదీ 17% వృద్ధి!

ఈనాడు, హైదరాబాద్‌:  హైదరాబాద్‌ ఐటీ రంగం బహుముఖంగా విస్తరిస్తోందని హైసియా (హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎక్స్‌పోర్టర్స్‌ అసోసియేషన్‌) అభిప్రాయపడింది. ఈ రంగం సాధిస్తున్న వృద్ధిని పరిగణనలోకి తీసుకుంటే స్థానికంగా ఐటీ రంగంలో ఉద్యోగాల సంఖ్య వచ్చే అయిదేళ్లలో రెట్టింపు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. బహుళ జాతి ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో శరవేగంగా విస్తరిస్తున్నాయని, అంతేగాక కృత్రిమ మేధ, డేటా సైన్స్‌, బ్లాక్‌చైన్‌ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావటం, అంకుర సంస్థలు విస్తరించటం దీనికి దోహదపడనున్నట్లు వివరించింది. హైసియా అధ్యక్షుడు మురళి బొల్లు, ఎస్‌టీపీఐ- హైదరాబాద్‌ డైరెక్టర్‌ సీవీడీ రామ్‌ప్రసాద్‌, ఐటీ రంగ ప్రతినిధులు సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.

హైదరాబాద్‌ నుంచి గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,08,000 కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు నమోదయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు 17 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే 17 శాతం వృద్ధి ఉంటుందని మురళి బొల్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఐటీ రంగంలో 5.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 65,000 మందికి ఉద్యోగాలు లభించినట్లు అంచనా. స్థానికంగా ఐటీ రంగం తీరుతెన్నులు, వివిధ దేశీయ- విదేశీ ఐటీ కంపెనీల విస్తరణ కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకుంటే వచ్చే అయిదేళ్లలో హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగాల సంఖ్య 10 లక్షలకు చేరుకునే అవకాశం కనిపిస్తున్నట్లు మురళి బొల్లు అభిప్రాయపడ్డారు. ఐటీ కంపెనీల కార్యకలాపాలకు అనువైన దాదాపు 5 కోట్ల చదరపు అడుగుల ఆఫీసు స్థలం హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి పట్టణాలు/ నగరాల నుంచి ఆశించిన స్థాయిలో ఐటీ ఎగుమతులు నమోదు కావటం లేదని ఎస్‌టీపీఐ- హైదరాబాద్‌ డైరెక్టర్‌ రామ్‌ ప్రసాద్‌ అన్నారు.  ఎస్‌టీపీఐ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి ఎగుమతులు నామమాత్రంగానే ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.1,000 కోట్ల సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు ఆంధ్రప్రదేశ్‌ నుంచి నమోదయ్యాయి. ప్రధానంగా విశాఖపట్టణం, విజయవాడలోని ఐటీ కంపెనీలు కొద్దిమేరకు ఎగుమతులు చేస్తున్నాయి.

1న సదస్సు: హైసియా, ఎస్‌టీపీఐ-హైదరాబాద్‌ కలిసి ‘ఇన్నోవేషన్‌ సమ్మిట్‌ 2019’ పేరుతో ఐటీ సదస్సును హైదరాబాద్‌లో వచ్చే నెల 1న నిర్వహించనున్నాయి. ఈ సదస్సులో ఎస్‌టీపీఐ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఓంకార్‌ రాయ్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ మాజీ సీఈఓ వినీత్‌ నయ్యర్‌, టెల్‌స్ట్రా ఇండియా ఎండీ అండ్‌ కంట్రీ హెడ్‌ అరుణ్‌కుమార్‌, ఇన్ఫోసిస్‌ సెంటర్‌ ఫర్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ ఏఐ- బ్లాక్‌చైన్‌ విభాగం అధిపతి శ్యామ్‌కుమార్‌ తదితరులు పాల్గొంటారు. అంతేగాక ఐటీ ఉత్పత్తులు, సేవల ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తారు.  ఈ సందర్భంగా 10 అంకుర సంస్థలను ఎంపిక చేస్తారు. వాటికి హైసియా అన్ని రకాలుగా మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.