close
చౌక ధరల జన ఔషధి 

ఔషధ కంపెనీలకు చేదు గుళిక 
20% మార్కెట్‌పై ప్రభావం 
బ్రాండెడ్‌ సంస్థలకు ఇబ్బందే

డాక్టర్‌ దగ్గరకు వెళ్లని వారంటూ ఉండరేమో. కనీసం జ్వరం వచ్చినపుడయినా వెళ్లి ఉంటారు. ఆ సమయంలో డాక్టర్‌ చీటీలో ఏ మందు రాసిస్తే అదే తీసుకుంటాం. అలాగే తీసుకోవాలి కూడా. అయితే ఒక్కోసారి అదే మందు.. అదే కాంపోజిషన్‌లో వేరే బ్రాండ్‌లో తక్కువ ధరకు రావొచ్చు. అదేనండీ జనరిక్‌ రూపంలో అన్నమాట. వాటిని విక్రయించే  ‘జన ఔషధి’  గత కొన్నేళ్లుగా అమ్మకాల్లో దూసుకెళుతూ.. బ్రాండెడ్‌ ఔషధ కంపెనీలకు సవాలు విసురుతోంది. 
 

నాణ్యమైన ఔషధాలను తక్కువ ధరకు అందించడం కోసం ప్రభుత్వం జన ఔషధి పథకాన్ని ప్రారంభించింంది. ఇపుడు ఆ జన ఔషధి కేంద్రాలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. భారత ఔషధ విక్రయాల్లో 20 శాతం వాటాను పొందే దిశగా దూసుకెళుతున్నాయి.

ఏమిటీ జన ఔషధి 
భారత్‌లో రోగం రావడం ఆలస్యం వాటిపై పెట్టే మందుల ఖర్చులతో పేద, మధ్య తరగతి వర్గాలపై పెనుభారం పడుతుంటుంది. ఆ భారాన్ని తగ్గించేందుకోసమే బ్రాండెడ్‌ మందులతో పోలిస్తే 50-90 శాతం తక్కువ ధరకు నాణ్యమైన మందులను అందించడం కోసమే ఈ జన ఔషధి పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని అమలు చేసేందుకు 2008లో భారత ప్రభుత్వ రంగ ఫార్మా సంస్థల బృందం(బీపీపీఐ) పేరుతో ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల అవి జన బాహుళ్యంలోకి చొచ్చుకుపోలేకపోయాయి. అయితే గత కొద్ది సంవత్సరాలుగా మార్పు కనిపిస్తోంది.

ఏ ఔషధాలున్నాయ్‌.. 
ప్రస్తుతం భారత్‌లో 5,000కు పైగా జన ఔషధి స్టోర్లున్నాయి. వీటి ద్వారా 800కు పైగా మందులను విక్రయిస్తున్నాయివి. ఇందులో దీర్ఘకాలిక రోగాలతో పాటు.. అపుడపుడూ వచ్చే వ్యాధుల చికిత్సకు ఉపయోగించే ఔషధాలు ఉంటున్నాయి. ముఖ్యంగా కేన్సర్‌, ఇన్‌ఫెక్షన్లు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌, సంతాన సాఫల్య చికిత్సలకు ఉపయోగించే మందులను విక్రయిస్తున్నారు. ఇవన్నీ కూడా బ్రాండెడ్‌ వాటితో పోలిస్తే 50-90 శాతం వరకు తక్కువకే లభిస్తున్నాయి. అదీ కాక 2020 కల్లా మరో 2,500 స్టోర్లను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వీటి విక్రయాలు రూ.600 కోట్లకు చేరొచ్చని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంటే సగటు ధరతో పోలిస్తే రూ.25,000-30,000 కోట్ల వరకు బ్రాండెడ్‌ విక్రయాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇవి భారత బ్రాండెడ్‌ విక్రయాల్లో 20 శాతానికి సమానం.

ఇది ఎలా సాధ్యమంటే.. 
గత కొన్నేళ్లుగా బీపీపీఐ విక్రయాలు పెరుగుతూ వస్తున్నాయి. వాటి ప్రగతిని బట్టి చూస్తే రూ.600 కోట్లకు ఎలా చేరుతాయన్నది మనకు అవగాహన వస్తుంది. 
జన ఔషధి స్టోర్ల ద్వారా 2017-18లో రూ.120 కోట్ల విక్రయాలు జరిగాయి. అంతక్రితం మూడేళ్లలో ఇవి రూ.12.4 కోట్లు; రూ.33 కోట్లు చొప్పున అమ్మకాలు సాధించాయి. 
2018-19లో జనఔషధి విక్రయాలు రెట్టింపై ఆదాయం రూ.300 కోట్లకు చేరొచ్చు. 
2021 కల్లా మొత్తం స్టోర్ల సంఖ్యను 10,000కు పైగా చేరుతాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్కో స్టోరు సగటున నెలవారీ రూ.5 లక్షల అమ్మకాలు సాధించినా 2021 కల్లా రూ.600 కోట్ల అమ్మకాలు సాధించే అవకాశం ఉంది. అంటే సగటు ధర వ్యత్యాసం అయిదింతలు ఉంటుందని అనుకున్నా.. రూ.25,000-30,000 కోట్ల వరకు విక్రయాలపై ప్రభావం చూపుతుందన్నమాట. 
అంటే శాతంలో చెప్పాలంటే.. భారత ఫార్మా ఉత్పత్తుల అమ్మకాల్లో 20 శాతాన్ని లాగేసుకుంటుందన్నమాట.

బ్రాండెడ్‌ కంపెనీలకు ఇబ్బందేనా.. 
వచ్చే కొన్నేళ్ల పాటు జనరిక్‌ మార్కెట్‌ పెరుగుతూనే ఉంటుందన్న దానిలో ఎటువంటి అనుమానం లేదు. జన ఔషధితో పాటు బ్రాండెడ్‌ కాని జనరిక్‌ ఔషధాలకు గిరాకీ పెరిగితే ఇది భారత ఫార్మా కంపెనీలపై ప్రభావం చూపుతుంది. వాటి ఆదాయ వృద్ధిని తగ్గించే అవకాశమూ ఉంది. ఇప్పటికే ఆ ప్రభావం పడినట్లు కనిపిస్తోంది. ఎలాగంటే.. 2014-15 నుంచి 2017-18 మధ్య భారత ఫార్మా మార్కెట్‌ వృద్ధి 13.5 శాతం నుంచి 10 శాతానికి పరిమితమైంది. గత రెండేళ్లలో కొత్త ఉత్పత్తుల రాక సగానికి తగ్గింది. కొత్త ఔషధాలపై నియంత్రణ సంస్థల కఠిన వైఖరి ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఈ లెక్కన ఇప్పటికిప్పుడు ఆ కంపెనీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినప్పటికీ.. భవిష్యత్‌లో మార్కెట్‌ వాటా తగ్గకుండా చూసుకోవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 

ఏ ఔషధం ధర ఎంత తక్కువకు లభిస్తుందో http://janaushadhi.gov.in వెబ్‌సైట్లో చూసుకోవచ్చు.

- ఈనాడు వాణిజ్య విభాగం

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.