close
కార్మికులు దొరకట్లేదు..!! 

నిపుణులకూ కొరతే 
విస్తరిస్తున్న నిర్మాణ రంగం 
వచ్చే అయిదేళ్లలో రూ.లక్ష కోట్ల స్థాయికి 
ఈనాడు - హైదరాబాద్‌

నిర్మాణ రంగం రానున్న అయిదేళ్లలో అంచనాలకు మించి విస్తరించనుంది. దీంతో నిర్మాణ రంగ కార్మికులు, నిపుణుల కొరత పెద్ద సమస్యగా మారనుంది. నిర్మాణ రంగం ఏటా 8-12 శాతం వృద్ధి చెందుతోంది. కార్మికుల లభ్యత మాత్రం గణనీయంగా తగ్గిపోతోంది. ఇప్పటికే 20-25 శాతం వరకు ఉన్న కొరత రానున్న రోజుల్లో మరింత తీవ్రం కానుంది. నిర్మాణ రంగం భవిష్యత్తుపై హైదరాబాద్‌లోని జాతీయ నిర్మాణ అకాడమి (నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌-న్యాక్‌) అధ్యయనం చేసింది. వ్యవసాయం తరవాత అత్యధిక ఉపాధిని కల్పిస్తోంది నిర్మాణ రంగమే. ఉపాధి మార్గంగా ఎంచుకునే వారి సంఖ్య మునుపటితో పోలిస్తే తగ్గుతోంది. నిర్మాణ రంగం వ్యాపారం మాత్రం అంచనాలకు అందనంతగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఈ రంగం వారు పెరుగుతున్న కార్మికుల కొరతపై దృష్టి సారించారు. నిర్మాణ రంగంలో పనులు కఠినంగా ఉండటంతోపాటు వేతనాలు తక్కువగా ఉండటంతో ఆసక్తిచూపే వారు తగ్గుతున్నారు. శిక్షణకు వచ్చే వారిని ప్రోత్సహించేందుకు ఆర్థిక భృతిని అందిస్తున్నా స్పందన అంతమాత్రంగానే ఉండటం విశేషం.

రూ. 60 వేల కోట్లకు చేరువలో... 
తెలంగాణ రాష్ట్ర నిర్మాణ రంగం రూ.60 వేల కోట్లకు చేరువలో ఉందన్నది అంచనా. అపార్టుమెంట్ల నుంచి విల్లాల వరకు ఏడాదికి సగటున లక్షన్నర వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆదాయమే సుమారు రూ.2,500-3,000 కోట్ల వరకు ఉంటుంది. నిర్మాణ రంగంతో ముడిపడిన వివిధ రంగాల వ్యాపారం మరో రూ.10,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇంత పెద్ద రంగం రానున్న రోజుల్లో తీవ్ర స్థాయిలో కార్మికుల కొరతను ఎదుర్కోనుంది. నిర్మాణ రంగం కన్నా కాస్తంత తేలికపాటి ఉపాధి మార్గాలు పుష్కలంగా అందుబాటులో ఉన్న రంగాలవైపు యువత దృష్టిసారిస్తోంది. సివిల్‌ ఇంజినీరింగులో పట్టభద్రులు సైతం నిర్మాణ రంగంపై ఆసక్తి చూపకపోవటం విశేషం. ఈ రంగంలో వేతనాలు అంతంత మాత్రంగానే ఉండటం కూడా ఒక కారణమని న్యాక్‌ అభిప్రాయపడుతోంది. వచ్చే అయిదేళ్లల్లో నిర్మాణ రంగ వ్యాపారం రూ. లక్ష కోట్ల స్థాయికి చేరవచ్చని ఆ రంగానికి చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ స్థాయిలో వ్యాపారం విస్తృతమైతే కార్మికుల కొరత సమస్యను ఎదుర్కోవటం ఎలా అన్నది జవాబులేని ప్రశ్నే.

60 శాతం పెరగనున్న కొరత 
న్యాక్‌ అంచనా ప్రకారం 2022-23 నాటికి రాష్ట్రంలో కార్మికుల కొరత 60 శాతానికి చేరుకునే ప్రమాదం ఉందని అంచనా వేస్తోంది. నూతన సాంకేతికతతోపాటు నూతన నిర్మాణ మెటీరియల్‌ విస్తృతం అయితే కార్మికుల కొరతకు కొంత మేరకు పరిష్కారం లభిస్తుందని నిర్మాణ రంగ నిపుణులు ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు.   కార్మికులను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కార్మికుల కొరత విషయంలో ఇప్పుడిప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. నిర్మాణ రంగ కార్మికులకు శిక్షణ ఇచ్చేందుకు కేరళ రాష్ట్రం కూడా తెలంగాణలోని న్యాక్‌ తరహా సంస్థను ఏర్పాటు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా గ్రామీణ నిరుపేదలను గుర్తించి నిర్మాణ రంగంలో వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నా పెద్దగా స్పందన లభించటంలేదని అధికారులు చెబుతున్నారు.

నాలుగేళ్లల్లో 64 వేల మందికి శిక్షణ

కార్మికుల కొరత గణనీయంగా ఉంది. శిక్షణను విస్తృతం చేస్తున్నాం. 1998 నుంచి ఇప్పటికు 3.94 లక్షల మందికి శిక్షణ ఇస్తే గడిచిన నాలుగేళ్లల్లో ఒక్క తెలంగాణలోనే 63,544 మందికి శిక్షణ ఇచ్చాం. దీన్ని మరింత పెంచేందుకు కసరత్తు చేస్తున్నా ఆసక్తి చూపే వారి సంఖ్య తగ్గుతోంది. వేతనాలు తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఇంజినీరింగు గ్రాడ్యుయేట్స్‌కు కూడా రూ. పది వేలకుమించి లభించటం లేదు. వారికి స్వల్పకాలిక శిక్షణ ఇవ్వటంతో ఇప్పుడిప్పుడే వేతనాలు రూ.20 వేలకు చేరుకున్నాయి.  జెఎన్‌టీయూహెచ్‌ సహకారంతో సివిల్‌ ఇంజినీరింగులో పోస్టుగ్రాడ్యుయేషన్‌ కోర్సు నిర్వహిస్తున్నాం. డిమాండ్‌ పెరగటంతో సీట్ల సంఖ్యను 120కి పెంచేందుకు కసరత్తు చేస్తున్నాం.
- కె.భిక్షపతి, న్యాక్‌, డైరెక్టర్‌ జనరల్‌

నైపుణ్యం, యాంత్రికీకరణ అనివార్యం

తీవ్ర స్థాయిలో ఉన్న కార్మికుల కొరతను అధిగమించడానికి నైపుణ్యాన్ని పెంచుకోవటం, యాంత్రికీకరణలొక్కటే మార్గం. పరిశ్రమపరంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ రంగంలోకి వచ్చేందుకు ఆసక్తి చూపే వారు తగ్గుతున్నారు. ఇతర దేశాల్లో నైపుణ్య కార్మికులకు మంచి ఆదరణ ఉంది. కార్మికుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు న్యాక్‌తోపాటు ఇతర సంస్థలను నియమించుకుని శిక్షణ ఇప్పిస్తున్నాం. యాంత్రికీకరణ కూడా మరింత పెరగాలి. 
- జి.రామిరెడ్డి, క్రెడాయ్‌, తెలంగాణ అధ్యక్షుడు


  
 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.