close
రూ.లక్ష కోట్ల దిగుబడులు కాపాడుకుందాం

తద్వారా రైతులకు మరింత ఆదాయం
ఆహార తయారీ పరిశ్రమలతో సాధ్యమే
భారీసంఖ్యలో ఉద్యోగాల కల్పన!
రంగం ఫుడ్‌ ప్రాసెసింగ్‌

దేశంలో ఏటా వృథా అవుతున్న పంట దిగుబడుల విలువ సుమారు రూ.లక్ష కోట్ల వరకు ఉంటోంది. కాయగూరలు, పండ్ల వంటివి రోజుల తరబడి నిల్వ ఉండే పరిస్థితి లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. ఆహార తయారీ (ఫుడ్‌ ప్రాసెసింగ్‌) పరిశ్రమల ద్వారా పంట దిగుబడులకు మరింత విలువ జోడించే వీలుంటుంది. తద్వారా రైతులకూ అధికాయాదాయం సమకూరుతుంది. పంట దిగుబడుల రవాణా, ప్రాసెసింగ్‌, నిల్వ వంటి ప్రక్రియల్లో ఉద్యోగాలు అధికంగా కల్పించడం కూడా వీలవుతుంది. ఈ అంశాలపై అవగాహన ఉన్నా, సామర్థ్యానికి తగినట్లు పరిశ్రమలు ఏర్పాటు కాకపోవడానికి అడ్డుపడుతున్న అంశాలేమిటి, ప్రభుత్వం ఏం చేస్తే ఈ రంగం వృద్ధి చెందుతుందో తెలుసుకుందాం.

ఎస్‌.శివకుమార్‌

రూ.లక్ష కోట్ల వ్యవసాయ దిగుబడుల వృథాను నివారించడం అంటే, ఆ మేర అదనంగా పండించినట్లే. టమోట, బంగాళాదుంప, ఉల్లి వంటివి.. ఏది తీసుకున్నా, ఇవి పాడవకుండా ఉండే సమయం 4-15 రోజుల వరకు ఉంటుంది. పప్పుదినుసుల వంటివి ఏడాది, మసాలా దినుసుల (స్పైసెస్‌) వంటివి రెండేళ్ల వరకు చెడిపోవు. పళ్లు, కూరగాయల వంటి చాలా త్వరగా పాడయ్యే దిగుబడులను ప్రాసెస్‌ చేస్తే రైతు ఆదాయం కోల్పోరు.. అదనంగా ఆర్జించ గలుగుతారు.  దిగుబడులను శుభ్రం చేసి మలినాలు, వ్యర్థాలు తొలగించి, తినడానికి సిద్ధంగా, మరింత రుచికరంగా అందించవచ్చు. విటమిన్లు జతచేసి, పోషకాహారంగా తీర్చిదిద్దవచ్చు.. ఆహార, ఔషధరంగాలకు సహజసిద్ధ అదనపు వనరులుగా జతచేయొచ్చు. 2-3 రకాల రుచులను కలిపి, సరికొత్త పదార్థాలు, పానీయాలు తయారు చేయొచ్చు. ప్యాకింగ్‌ ద్వారా వీటిని దేశ, విదేశాల్లోని దూరప్రాంతాలకూ రవాణా చేయొచ్చు.

 

ఉద్యోగాలు ఇలా..

వ్యవసాయం, తయారీ రంగాలు అనుసంధానమే ఫుడ్‌ ప్రాసెసింగ్‌గా చెప్పుకోవాలి. ఇందువల్ల వివిధ రకాల ఉద్యోగాల కల్పనకు వీలుంటుంది. ఫలితంగా ఆర్థిక వృద్ధికీ దోహద పడుతుంది. జీడీపీ కంటే వేగవంత వృద్ధిని ఈ రంగం నమోదు చేస్తోంది. పంట ఉత్పత్తులు, తయారైన పదార్థాలను అవసరమైన చోట్లకు తరలించడం, నిల్వకు సంబంధించి లాజిస్టిక్స్‌ సేవల్లో, ప్రాసెసింగ్‌ ప్రక్రియ కోసం ప్లాంట్లలో ఉద్యోగాలు, ఈ ప్లాంట్లకు అవసరమైన పంటలకు అనుగుణమైన గోదాములు, ఇతర వ్యవస్థల్లో భారీగా ఉపాధికి చోటుంటుంది.

అడ్డుకుంటున్న అంశాలు ఇవే

* పంట దిగుబడులు ఆయా ప్రాంత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, ఏదో ఒక కాలంలో మాత్రమే పండటం. మామిడినే తీసుకుంటే, అనేకరకాల ఉత్పత్తులు తయారు చేయొచ్చు. కాని మామిడిపళ్లు 2 నెలలు లేదా 6 వారాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. ఈ ప్లాంటు పెడితే, 2 నెలలు మాత్రమే పని ఉంటుంది. తరవాత మూసిఉంచాలి. ఇంకోరకానికి వినియోగించాలంటే, మరింత యంత్రసామగ్రికి అదనపు పెట్టుబడులు కావాలి.
* తినేందుకు, తాగేందుకు ఇష్టపడేవి, ప్రాసెసింగ్‌కు పనికివచ్చేవి వేర్వేరుగా ఉండొచ్చు. మామిడిలోనే పల్ప్‌ ఎక్కువగా, తోలు పలుచగా ఉండే, తక్కువ ధర ఉండే తోతాపురి రకం ప్రాసెసింగ్‌కు పనికొస్తాయి. అయితే బంగినపల్లి రకం తినడానికి ఇష్టపడతారు. పల్ప్‌ తీసి, నిల్వ చేసేందుకు ఇది అనువుగా ఉండదు. నూజివీడు రసాలను ఇంట్లో అధికంగా వాడతారు కనుక ధరలు ఎక్కువ. అందువల్ల పరిశ్రమకు అవసరమైన రకాలు పండించేలా రైతులతో పరిశ్రమకు సమన్వయం పెరగాలి.
* పంట ఉండి, పరిశ్రమ లేకున్నా, పరిశ్రమకు తగినంత దిగుబడి లేకున్నా ఉపయోగం లేదు. రైతుతో ముందుగానే పరిశ్రమల వారు మాట్లాడుకుని, కావాల్సిన రకాన్ని, పండింపచేసుకునేందుకు ఏపీఎంసీ చట్టం అడ్డుగోడలా ఉండేది. కొన్నేళ్లుగా చేస్తున్న సంస్కరణలు నెమ్మదిగా ఫలిస్తున్నాయి.

పన్నులతో మరింత భారం

ప్రాసెస్‌ చేసి, ప్యాక్‌ చేసిన, బ్రాండెండ్‌ ఆహార పదార్థాలకు అధిక పన్నురేట్లు వర్తింప చేస్తున్నారు. ప్రాసెసింగ్‌పైనా 5, 12, 18 శాతం పన్నురేట్లు అమలవుతున్నాయి. ప్యాకింగ్‌ సామగ్రి, రవాణాపై పన్నులపై పన్నులు కూడా జతచేరుతున్నాయి. ఉదాహరణకు గోధుమపిండిని తీసుకున్నా, తయారీతేదీ సహా అన్ని వివరాలతో ఉండే బ్రాండెడ్‌ కంపెనీల సరకుకు అధిక పన్ను విధిస్తుంటే.. ఎవరు, ఎలా తయారు చేశారో వివరాలు లేని, నాణ్యతకు భరోసా ఇవ్వని పిండికి మాత్రం తక్కువ పన్ను లేదా అసలు పన్ను లేకుండా ఉంటోంది. అంటే నాణ్యమైన ఉత్పత్తులుగా ప్రజలు భావించి, కొనుగోలు చేస్తున్నవి విలాస వస్తువులుగా ప్రభుత్వం పరిగణిస్తుందా అనేది పరిశీలించాల్సిన అంశం.

ఈ రంగం వృద్ధికి..

ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం తప్పనిసరి: ఈ పరిశ్రమలు స్థాపించేందుకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, రైతుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు సహాయాన్ని ప్రభుత్వం చేయాలి. రైతులకు సాంకేతిక సలహాలు, మార్కెట్‌ వృద్ధిని పరిశ్రమ కల్పిస్తుంది.

భారీ పెట్టుబడులు అవసరం: మెగా ఫుడ్‌పార్కులకు తక్కువ ధరకు స్థలం కేటాయించి, మౌలిక సదుపాయాలను చిన్న ప్లాంట్ల యజమానులంతా వినియోగించుకునే వీలును ప్రభుత్వం కల్పిస్తోంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, శీతల గిడ్డంగులు, ఇతర అనుసంధాన ప్రక్రియలు, బ్రాండ్‌బిల్డింగ్‌కు భారీ పెట్టుబడులు అవసరం. అందువల్ల  భారీ సంస్థలకూ సబ్సిడీ వీలు కల్పిస్తే, మరింత వేగంగా ఏర్పాటవుతాయి.

సుంకాలతో రక్షణ కల్పించాలి: మన దగ్గర అధికంగా పండే వ్యవసాయ దిగుబడులతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసేప్పుడు, విదేశాల నుంచి సంబంధిత దిగుమతులు రాకుండా, ఒకవేళ వచ్చినా, ఇక్కడి ధరలతో సమానంగా ఉండేలా సుంకాలు విధించాలి. పళ్ల రసాలకు సంబంధించి, బ్రెజిల్‌ - అమెరికా వంటి దేశాల నుంచి భారీమొత్తం కాన్సట్రేషన్‌ దిగుమతులు రాకుండా చూస్తేనే, ఇక్కడి రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మనుగడ ఉంటుంది.

ప్రాసెస్డ్‌ ఆహారంపై పన్నులు తగ్గించాలి: ప్రాసెస్‌ చేసిన ఆహారంపై వివిధ రకాల పన్ను రేట్లు అమలవుతున్నాయి. వీటిని అతి తక్కువ పన్నురేటు పరిధిలోకి తేవాలి. దీంతోపాటు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ అమలు చేయాలి. ఇందువల్ల తక్కువ ధరలు నిర్ణయిస్తూ, వినియోగదార్లపై భారం పడకుండా చూడొచ్చు. వినియోగమూ అధికమవుతుంది. బ్రాండెడ్‌, బ్రాండ్‌ లేని ఉత్పత్తుల మధ్య వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రేటు తేడాను తొలగించాలి.

వ్యవసాయ మార్కెటింగ్‌ చట్టాలకు సవరణ చేయాలి: సరికొత్త ఏపీఎంసీ చట్టాన్ని అధిక రాష్ట్రాలు అమలు చేసేలా చూడాలి. ఇందువల్ల రైతులు, ప్రాసెసింగ్‌ యూనిట్ల మధ్య లావాదేవీలు సులభంగా మారతాయి.

నిత్యావసరాల చట్టం అమలుపై సమీక్ష: ఎవరికీ వివరాలు వెల్లడించకుండా, నిత్యావసరాలను పెద్దఎత్తున నిల్వ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్న వారిని నిరోధించేందుకు నిత్యావసరాల చట్టం ఉపయోగ పడుతోంది. అయితే వ్యవసాయ ఉత్పత్తులను సక్రమంగా, పారదర్శకంగా అందించే సంస్థలకు దీనివల్ల ఇబ్బంది కలుగుతోంది. అందువల్ల కేంద్రీయ సమాచార పోర్టల్‌ రూపొందించి, సంస్థల వద్ద ఉన్న సరకు వివరాలు ఎప్పటికప్పుడు అందులో పొందుపరచేలా చూడాలి. ఇలా చేసి, ఎంతైనా కొనేలా చూస్తే, ఇబ్బంది ఉండదు.

(రచయిత ఐటీసీ వ్యవసాయ, ఐటీ విభాగాల అధిపతి)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.