close
వదలని మొండి ఘటాలు

ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రస్తుతం అతిపెద్ద సమస్య మొండి బకాయిలు. గత నాలుగేళ్లుగా దీనిపై ప్రధానంగా దృష్టి సారించి కొంత సానుకూల ఫలితాలు సాధించినా.. ఇప్పటికీ ఈ సమస్య తలకుమించిన భారంగానే ఉంది. దీని తీవ్రత ఎంత... ఎందుకు ఈ సమస్య పెద్దదైంది.. పరిష్కారమార్గం ఏమిటి... భవిష్యత్తు ఎలా ఉంటుంది.. అనే అంశాలను పరిశీలిద్దాం..
? మొండి బాకీల సమస్య ఎంత పెద్దది
ఈ సమస్య అంచనాలకంటే పెద్దది. నికర నిరర్ధక ఆస్తుల సంఖ్య ఎప్పుడూ నిజం చెప్పదు. ఇందులో పునర్‌వ్యవస్థీకరించిన రుణాల మొత్తం కలిసి ఉండదు. మొత్తం కార్పొరేట్‌ రుణాల్లో 40 శాతం రుణాలు మొండి బాకీలుగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇందులో చాలా సొమ్ము తిరిగి రానట్లే. కానీ ఈ అనుభవం నుంచి ఎంతో నేర్చుకోవాలి. మొండి బాకీలను తట్టుకోవటానికి ప్రభుత్వం బ్యాంకులకు కొంత మూలధనాన్ని సమకూర్చిన్పటికీ అది సరిపోదు.
? ఈ పరిస్థితికి బాధ్యులు ఎవరు
బ్యాంకుల వైపు నుంచి కొన్ని పొరపాట్లు ఉన్నాయి. ఆడిట్‌ పకడ్బందీగా లేదు. విచిత్రమేమిటంటే చేసిన తప్పులకు బ్యాంకులు శిక్ష మోస్తున్నాయి.  కానీ ఆడిటర్ల పాత్రను ఎవరూ ప్రశ్నించటం లేదు. బ్యాంకుల సీఈఓలకు ఉండే పదవీ కాలం తక్కువ. మెరుగైన వృద్ధి కనబరచాలని తమ పదవీ కాలంలో వారు ఆశపడతారు. అందులో భాగంగా రాని బాకీలను పూర్తిగా గుర్తించటానికి ఇష్టపడరు. కప్పిపుచ్చేందుకే ప్రయత్నిస్తారు. అటువంటి యత్నాలను ఆడిటర్లు అడ్డుకోవాలి. కానీ అది జరగలేదు. అంతర్గత ఆడిట్‌ విధానాన్ని పూర్తిగా సంస్కరించాలి. రిస్కును ముందస్తుగానే గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకునే ఆడిటింగ్‌ వ్యవస్థ ఉండాలి.
? ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం లేదా ప్రైవేటీకరణ సరైన పరిష్కారం అవుతుందా
బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను 50 శాతం కంటే దిగువకు తగ్గించుకోవాలని నాయక్‌ కమిటీ సిఫారసు చేసింది. ప్రభుత్వం బ్యాంకుల విలీనాల వైపు  మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. అలా చేసినప్పటికీ చివరికి కొన్ని ప్రభుత్వ బ్యాంకులు మిగిలే ఉంటాయి. అంతేగాక అన్నిసార్లూ విలీనాలు సత్ఫలితాలు ఇస్తాయని చెప్పలేం. ఎస్‌బీఐ విలీనం సజావుగానే జరిగింది కదా... అని ఎవరైనా అనొచ్చు. కానీ ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకులను విలీనం చేయటం వేరు, విడివిడిగా ఉన్న ప్రభుత్వ బ్యాంకులను కలపటం వేరు. విలీనం అనేది సమస్యకు పరిష్కారం చూపదు... సమస్యను తప్పించుకోవటం. కార్యకలాపాల నిర్వహణలో పూర్తి స్వేచ్ఛ, ప్రగతి సాధించాలనే తపన ఒక్కటే ప్రభుత్వ బ్యాంకుల విషయంలో ఉన్న ఏకైక పరిష్కారం.

? అంటే ప్రభుత్వం పాత్ర తగ్గాలంటారా
బ్యాంకుల పాలనా వ్యవహారాల్లో డైరెక్టర్ల బోర్డుకే పూర్తిస్థాయి అధికారం ఉండాలి. బోర్డుపై బయటి నుంచి ఒత్తిళ్లు ఉండకూడదు. ప్రభుత్వ వర్గాలు కానీ, రాజకీయ నాయకులు కానీ బోర్డు నిర్ణయాలను ప్రభావితం చేసే పరిస్థితి ఉంటే దానివల్ల నష్టమే కానీ ప్రయోజనం లేదు. దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు ఇదే జరిగింది. రాజకీయ నాయకుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందుకు నడిచినంత కాలం ఆశించిన మార్పులు రావు. సమర్ధులైన వారిని, నైపుణ్యం కల వారిని బోర్డు డైరెక్టర్లుగా నియమించి వారికి పూర్తి స్వేచ్ఛ నివ్వటం ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు తీసుకురావచ్చు.
? సమీప భవిష్యత్తులో ప్రభుత్వ బ్యాంకులు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది....
కేవలం రుణ నిధులు సమకూర్చే సంస్థలు గానే బ్యాంకులు మనలేవు. బ్యాంకింగ్‌లో ప్రాథమిక మార్పులు ఎన్నో వస్తున్నాయి. లావాదేవీలు/ చెల్లింపుల సేవలు అందించటం, పెట్టుబడి సలహాలు ఇవ్వటం, ఇతరుల ఉత్పత్తులు విక్రయించటం (మ్యూచువల్‌ ఫండ్లు, బీమా పాలసీల పంపిణీ), ఆస్తుల యాజమాన్య సేవలు అందించటం... వంటి భిన్న అవకాశాలు ఇప్పుడు బ్యాంకుల ముందున్నాయి. కానీ ఈ విభాగాల్లో విస్తరించటానికి అవసరమైన మానవ వనరులు, సాంకేతిక నైపుణ్యం, స్వేచ్ఛ ప్రభుత్వ బ్యాంకులకు ఉండటం లేదు. అందువల్ల ప్రభుత్వ బ్యాంకుల మార్కెట్‌ వాటాను కొన్ని ఫిన్‌టెక్‌ కంపెనీలు, ఎన్‌బీఎఫ్‌సీలు, ప్రైవేటు బ్యాంకులు కొల్లగొడుతున్నాయి. ఈ పరిస్థితులకు తగ్గట్లుగా సన్నద్ధం కావటమే ప్రభుత్వ బ్యాంకుల ముందున్న ప్రధాన సవాలు.
? ఈ సంక్షోభంలో బ్యాంకు బోర్డుల పాత్ర ఏమీ లేదా
బ్యాంకు బోర్డుల్లో డైరెక్టర్లుగా నిజాయితీ, అంకితభావం, బాధ్యత కలవారు అధికంగా ఉండాలి. అప్పుడు సమర్థ పర్యవేక్షణ ఉంటుంది. కానీ బోర్డు డైరెక్టర్లను ఎంపిక చేసే అధికారం ప్రభుత్వం చేతిలో ఉండటంతో వారికి నచ్చిన వారిని ఎంచుకునే అవకాశం వచ్చింది. నైపుణ్యం, అనుభవం... ప్రామాణికం కావటం లేదు. అటువంటి డైరెక్టర్లు రాజకీయ నాయకుల అజెండాకు అనుగుణంగా పనిచేసే పరిస్థితి ఉంటోంది.

(రచయిత ప్రముఖ ఆర్థిక నిపుణులు)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.