close
ఐఓసీని వెనక్కి నెట్టిన ఆర్‌ఐఎల్‌ 

ఫార్చ్యూన్‌ గ్లోబల్‌ 500 జాబితాలో దేశీయంగా అగ్రస్థానం

దిల్లీ: ఫార్చ్యూన్‌ గ్లోబల్‌ 500 కంపెనీల్లో, దేశీయంగా అగ్రస్థానాన్ని ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే ఈ జాబితాలో రిలయన్స్‌ 42 స్థానాలు పైకి వచ్చి, 106వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వరంగ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ)కు 117వ స్థానం మాత్రమే లభించింది. 2010 నుంచి రూపొందిస్తున్న ఈ జాబితాలో ఇప్పటివరకు దేశీయంగా అగ్రస్థానంలో నిలిచిన ఐఓసీ ఈసారి ఆర్‌ఐఎల్‌ కంటే వెనుకబడిందని ఫార్చ్యూన్‌ తెలిపింది. ఈ జాబితాలో దేశీయ సంస్థలైన ఓఎన్‌జీసీ, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), టాటా మోటార్స్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌కూ చోటు దక్కింది.

అంతర్జాతీయ జాబితాలో ఓఎన్‌జీసీ 37 స్థానాలు పైకి లేచి, 160కి, బీపీసీఎల్‌ 39 స్థానాలు ఎగబాకి 275కు చేరాయి. ఎస్‌బీఐ 20 స్థానాలు దిగజారి 236కు, టాటా మోటార్స్‌ 33 స్థానాలు జారి 265కు, రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ 90 స్థానాలు క్షీణించి 495కు పరిమితమయ్యాయి.

అగ్రస్థానం వాల్‌మార్ట్‌దే 
ఫార్చ్యూన్‌ 500 జాబితాలో అమెరికా దిగ్గజం వాల్‌మార్ట్‌ ప్రథమస్థానంలో, చైనా ప్రభుత్వరంగ చమురు-సహజవాయువు కంపెనీ సినోపెక్‌ గ్రూప్‌ రెండో స్థానంలో, డచ్‌ కంపెనీ రాయల్‌ డచ్‌ షెల్‌ మూడో స్థానంలో, చైనా నేషనల్‌ పెట్రోలియం నాలుగో స్థానంలో, స్టేట్‌గ్రిడ్‌ అయిదో స్థానంలో నిలిచాయి. సౌదీచమురు సంస్థ సౌదీ ఆరామ్‌కో (6), బీపీ (7), ఎగ్జాన్‌ మొబిల్‌ (8), ఫోక్స్‌వ్యాగన్‌ (9), టయోటా మోటార్‌ 10వ స్థానాల్లో నిలిచాయి.

ఇదీ లెక్క 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆదాయం 2018 నాటి 62.3 బిలియన్‌ డాలర్ల నుంచి 32.1 శాతం పెరిగి 2019లో 82.3 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. 
ఇదే సమయంలో ఐఓసీ ఆదాయం మాత్రం 65.9 బిలియన్‌ డాలర్ల నుంచి 17.7 శాతం మాత్రమే పెరిగి 77.6 బి.డా.కు చేరింది. 
గత పదేళ్లుగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆదాయం 7.2 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. 2010లో ఆర్‌ఐఎల్‌ ఆదాయం 41.1 బిలియన్‌ డాలర్లు కావడం గమనార్హం. ఇదే కాలంలో ఐఓసీ ఆదాయం 3.64 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. 2010లో ఐఓసీ ఆదాయం 54.3 బి.డాలర్లు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.