close
మళ్లీ డివిడెండ్ల గూటికి..! 

తగ్గనున్న షేర్ల బైబ్యాక్‌లు 
20% పన్నే ప్రధాన అవరోధం 
ప్రత్యామ్నాయాలపై కంపెనీల దృష్టి 
ఈనాడు - హైదరాబాద్‌

కంపెనీల యాజమాన్యాలు తమ వాటాదార్లకు లబ్ది చేకూర్చేందుకు ఉన్న మార్గాలు తక్కువ. ప్రధానమైన అవకాశం డివిడెండ్‌ చెల్లించటమే. బాగా ఆదాయాలు, లాభాలు  ఆర్జించిన పక్షంలో కంపెనీలు తమ వాటాదార్లకు ఆకర్షణీయ డివిడెండ్లు చెల్లిస్తుంటాయి. ఇక షేరు ధర పెరిగి వాటిని మంచి ధరలో మార్కెట్లో విక్రయిస్తే మూలధన లాభం వస్తుంది. ఇంతకు మించి వాటాదారు లాభపడే మార్గం లేదు. బోనస్‌ షేర్లు జారీ చేయటం, మార్కెట్‌ ధర కంటే తక్కువ ధరకు రైట్స్‌ షేర్లు ఇవ్వటం, ప్రత్యేక డివిడెండ్లు ప్రకటించటం, షేర్ల బైబ్యాక్‌... ఇతర మార్గాలు. వీటన్నింటి కంటే డివిడెండ్‌  చెల్లించటమే వాటాదారుకు లాభదాయకం. కంపెనీలు చెల్లించే డివిడెండ్లపై కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం డివిడెండ్‌ పంపిణీ పన్ను (డీడీటీ) విధించింది. అంతేగాక 2016-17 తర్వాత వాటాదార్లు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డివిడెండ్‌ తీసుకుంటే 10 శాతం పన్ను చెల్లించాలనే నిబంధన అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి షేర్ల బైబ్యాక్‌ వైపు కంపెనీల యాజమాన్యాలు మొగ్గుచూపాయి. అంతేగాక గత ఏడాది బడ్జెట్‌లో దీర్ఘకాలిక లాభాలపై 10 శాతం పన్ను చెల్లించాలనే నిబంధన కూడా విధించారు. దీంతో బైబ్యాక్‌ మెరుగైన మార్గంగా కంపెనీలకు కనిపించింది. షేర్ల బైబ్యాక్‌ వల్ల నేరుగా వాటాదారుకు లాభం లేకపోయినా పరోక్షంగా వాటాల విలువ పెరిగి మేలు చేకూరుతుంది. అందువల్ల కంపెనీలు భారీగా డివిడెండ్‌ ఇవ్వటానికి బదులు నామమాత్రంగా డివిడెండ్‌ చెల్లిస్తూ తమ వద్ద ఉన్న మిగులు నిధులను షేర్ల బైబ్యాక్‌కు వెచ్చిస్తూ వచ్చాయి. గత రెండేళ్ల నుంచి ఎన్నో కంపెనీలు షేర్ల బైబ్యాక్‌ను అమలు చేశాయి. కానీ ఇకపై ఈ పరిస్థితి ఉండకపోవచ్చని మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. షేర్ల బైబ్యాక్‌పై కేంద్ర ప్రభుత్వం తాజాగా బడ్జెట్‌లో 20 శాతం పన్ను విధించటమే దీనికి కారణం. దీనివల్ల కంపెనీల యాజమాన్యాలు ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ చేయాలంటే... ఒకటికి రెండు సార్లు  ఆలోచించుకోవలసిన అవసరం ఏర్పడినట్లు చెబుతున్నారు.

ఇంతకు ముందు అన్‌ లిస్టెడ్‌ కంపెనీలకే... 
స్టాక్‌ మార్కెట్లో నమోదు కాని (అన్‌ లిస్టెడ్‌) కంపెనీల షేర్ల బైబ్యాక్‌కు 20 శాతం పన్ను అమల్లో ఉంది. ఇకపై ఇది స్టాక్‌ మార్కెట్లో నమోదైన కంపెనీలకు కూడా అమలు కానుంది. దీని ప్రకారం ఈక్విటీ షేర్ల జారీ ధరకు, తిరిగి కొనుగోలు చేసిన ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ లాభంపై పన్ను చెలించాల్సి వస్తుంది.

ఎన్ని కంపెనీలో... 
గత ఏడాదిలో పలు కంపెనీలు షేర్ల బైబ్యాక్‌ చేపట్టాయి. దాదాపు రూ.55,000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కంపెనీలు వెనక్కి కొనుగోలు చేశాయి. 
ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో 70 కంపెనీలు బైబ్యాక్‌ చేపట్టాయి. ఇందులో సాఫ్ట్‌వేర్‌ దిగ్గజాలైన విప్రో, ఇన్ఫోసిస్‌ తదితర కంపెనీలు ఉన్నాయి. దాదాపు రూ.35,000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ఆయా కంపెనీలు వెనక్కి కొనుగోలు చేశాయి. కొన్ని ఇంకా కొనసాగుతున్నాయి. 
అదానీ గ్రూపునకు చెందిన అదానీ ఎస్‌ఈజడ్‌ రూ.1960 కోట్ల విలువైన బైబ్యాక్‌ను అమలు చేయబోతోంది.

వాటాదారుడికి ప్రయోజనం ఎలా? 
సాధారణంగా డివిడెండ్‌ చెల్లిస్తే వాటాదార్లకు లబ్ది చేకూరుతుంది. కానీ షేర్ల బైబ్యాక్‌తో ప్రయోజనం ఉంటుందా..., అదెలా? అనేది పెద్ద సందేహం. వాస్తవానికి షేర్ల బైబ్యాక్‌లో పాల్గొనకుండా వాటాదార్లుగా కొనసాగిన వారికే ఎక్కువగా లాభం కలుగుతుంది. సాధారణంగా ఏదైనా కంపెనీ బైబ్యాక్‌ ప్రకటించినప్పుడు అందుకు రిజర్వులు/ మిగులు నిధుల నుంచి కొంత సొమ్ము కేటాయిస్తారు. ఆ సొమ్ముకు ఎన్ని షేర్లు వస్తే అన్ని షేర్లను వెనక్కి కొనుగోలు చేస్తారు. కొనుగోలు ధర ఆ షేర్‌ స్టాక్‌మార్కెట్‌ ధరకు దగ్గరగా ఉంటుంది. టెండర్‌ పద్ధతిలో గానీ, స్టాక్‌మార్కెట్‌ ద్వారా కానీ బైబ్యాక్‌ను అమలు చేసే వీలుంది. కంపెనీ యాజమాన్యం బైబ్యాక్‌ను ప్రకటించినప్పుడు ఆ కంపెనీ వాటాదార్లలో విశ్వాసం పెరుగుతుంది. అదొక సానుకూలత. అంతేగాక బైబ్యాక్‌ తర్వాత జారీ మూలధనం తగ్గిపోతుంది. ఉదాహరణకు ఏ అనే ఐటీ కంపెనీ జారీ మూలధనం ఒక్కొక్కటీ రూ.10 ముఖ విలువ కల ఒక కోటి షేర్లు అనుకుందాం. ఆ కంపెనీ ఏడాదికి రూ.10 కోట్ల లాభం సంపాదిస్తే, ఒక్కో షేర్‌కు ఆర్జన రూ.10 అవుతుంది. ఐటీ కంపెనీలకు స్టాక్‌మార్కెట్లో కనీసం 10 రెట్లు (ప్రైస్‌ ఎర్నింగ్‌- పీఈ) అధిక ధర లభిస్తుంది. అంటే ఈ షేర్‌ ధర రూ.100 ఉండవచ్చు. కంపెనీ యాజమాన్యం బైబ్యాక్‌ ప్రకటించి 10 లక్షల షేర్లను వెనక్కి కొనుగోలు చేసిందనుకుంటే..., ఆ 10 లక్షల షేర్లు రద్దవుతాయి. ఇక మిగిలేది 90 లక్షల షేర్లే. అప్పుడు ఒక్కో షేర్‌కు లాభం రూ.11.11. పీఈ 10 ప్రకారం చూస్తే మార్కెట్‌ ధర రూ.110 లభించే అవకాశం ఉంటుంది. అంటే బైబ్యాక్‌ తర్వాత జారీ మూలధనం తగ్గిపోయి, ఒక్కో షేర్‌కు లాభం పెరిగి ఆమేరకు స్టాక్‌మార్కెట్‌ షేర్‌ ధర పెరిగే అవకాశం వస్తుంది. అంటే కంపెనీ యాజమాన్యం షేర్లు బైబ్యాక్‌ చేయటం ద్వారా వాటాదారుడికి లాభం చేసినట్లే కదా. అందుకే ఈ పద్ధతిని గత రెండేళ్లలో ఎన్నో కంపెనీలు అనుసరించాయి. డివిడెండ్‌ చెల్లించి పన్ను భారాన్ని మోసే బదులు బైబ్యాక్‌ మార్గాన్ని ఎంచుకున్నాయి. ఇప్పుడు బైబ్యాక్‌పై కూడా పన్ను భారాన్ని మోపటంతో ఎన్నో కంపెనీలు పునరాలోచనలో పడ్డాయి.

స్థానికంగా... 
షేర్ల బైబ్యాక్‌ను ఇటీవలి కాలంలో ఇక్కడి పలు కంపెనీలు చేపట్టాయి. ఐటీ రంగానికి చెందిన సంస్థ అయిన సైయెంట్‌ లిమిటెడ్‌ రూ.200 కోట్ల షేర్ల బైబ్యాక్‌ చేపట్టింది. అదేవిధంగా నాట్కో ఫార్మా కూడా షేర్ల బైబ్యాక్‌ ప్రకటించి పూర్తి చేసింది. విద్యుత్తు, షుగర్‌, ఫెర్రోఅల్లాయ్స్‌ రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న నవభారత్‌ వెంచర్స్‌ చేపట్టిన బైబ్యాక్‌ ప్రస్తుతం కొనసాగుతోంది. విత్తన సంస్థ అయిన కావేరీ సీడ్‌ కంపెనీ వాటాదార్లకు లబ్ది చేకూర్చే లక్ష్యంతో గత రెండేళ్లుగా షేర్లను వెనక్కి కొనుగోలు చేస్తూ వస్తోంది. మిగులు నిధులతో మరో దఫా కూడా బైబ్యాక్‌ చేపట్టేందుకు సిద్ధపడుతున్నట్లు ఇటీవల పలు సందర్భాల్లో కంపెనీ యాజమాన్యం సంకేతాలు ఇచ్చింది. కానీ తాజాగా పన్ను భారం మోయాల్సి వస్తున్న పరిస్థితుల్లో ఈ కంపెనీ ఏం చేస్తుందో చూడాల్సి ఉంది.

డివిడెండ్‌ చెల్లింపే మార్గం 
ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీలు మళ్లీ డివిడెండ్‌ చెల్లింపు వైపు మొగ్గు చూపాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇకపై బైబ్యాక్‌ చేపట్టేందుకు కంపెనీలు కొంత ఆలోచిస్తాయని, అందువల్ల గతంలో ఉన్నంత అధికంగా బైబ్యాక్‌లు ఉండకపోవచ్చని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జారీ మూలధనాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశం ఉన్న కంపెనీలు మాత్రమే ఇందుకు మొగ్గు చూపుతాయని, కేవలం పన్ను భారాన్ని తప్పించుకోవాలనే ఆలోచన ఉన్న కంపెనీలు బైబ్యాక్‌ వైపు రాకపోవచ్చని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.