Eenadu Online Edition Business News - EENADU
close
37290 దగ్గర మద్దతు!

సమీక్ష : బలహీన దేశీయ సెంటిమెంట్‌, అంతర్జాతీయ వృద్ధి భయాలతో గత వారం మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం, మూడు రోజులే మార్కెట్‌ పనిచేయడం ప్రభావం చూపింది. ఎఫ్‌పీఐలపై పన్ను సర్‌ఛార్జీ ప్రతిపాదనపై ఎటువంటి పునరాలోచన ప్రకటన వెలువడకపోవడం మదుపర్ల అప్రమత్తతకు కారణమైంది. జులైలో వాహన విక్రయాలు 19 ఏళ్ల కనిష్ఠానికి చేరినట్లు సియామ్‌ గణాంకాలు స్పష్టం చేశాయి. అనేక కంపెనీలు ఉత్పత్తికి తాత్కాలిక విరామం ఇవ్వడం, ఉద్యోగాల్లో కోత వంటివి మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అయితే ఏజీఎం తర్వాత రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడం సూచీలకు కాస్త ఉపశమనం ఇచ్చింది. అమెరికా- చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, మాంద్యం భయాలతో అంతర్జాతీయ మార్కెట్లు కలవరపడ్డాయి. అయితే కేంద్ర బ్యాంకుల ఉద్దీపనలపై ఆశలు, చైనా ఉత్పత్తులపై సుంకాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ జాప్యం చేయడం కొంత కలిసొచ్చింది. నిల్వలు పెరగడం, వృద్ధి భయాలతో చమురు ధరలు స్తబ్దుగా కదలాడాయి. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 0.6 శాతం నష్టంతో 37,350 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 0.6 శాతం తగ్గి 11,048 పాయింట్ల దగ్గర స్థిరపడింది. ఐటీ, యంత్ర పరికరాలు, వాహన షేర్లు డీలాపడగా, చమురు- గ్యాస్‌, లోహ, స్థిరాస్తి స్క్రిప్‌లు రాణించాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.363 కోట్ల షేర్లను విక్రయించగా, డీఐఐలు, ఫండ్ల కొనుగోళ్లు రూ.2880 కోట్లుగా నమోదయ్యాయి. ఎఫ్‌పీఐలు ఈ నెల 16 వరకు నికరంగా రూ.8,320 కోట్లు వెనక్కి మళ్లించారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 9:10గా నమోదు కావడం.. 
మార్కెట్‌లో ఎక్కువ శాతం షేర్లు నష్టపోవడాన్ని సూచిస్తోంది.

ఈవారంపై అంచనా 
36400- 37950 పాయింట్ల శ్రేణిలో స్థిరీకరణకు గురైన సెన్సెక్స్‌, గత వారం నష్టపోయింది. ఈ శ్రేణిని అధిగమిస్తేనే మార్కెటకు సరైన దిశానిర్దేశం లభిస్తుంది. సెన్సెక్స్‌ 200 రోజుల కదలికల సగటు అయిన 37,290 స్థాయి స్వల్పకాలంలో కీలకం కానుంది. ఈ స్థాయి దిగువకు చేరితే మరిన్ని నష్టాలకు అవకాశం ఉంది.

ప్రభావిత అంశాలు 
దేశీయ పరిణామాలు, అంతర్జాతీయ సంకేతాలు ఈ వారం మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. దేశీయంగా చూస్తే.. ఆర్థిక వ్యవస్థపై భయాలతో బలహీనతలు కొనసాగొచ్చు. మొదటి త్రైమాసికంలో కంపెనీ ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. వాహన, ఆర్థిక రంగాలకు దన్నుగా ప్రభుత్వం ప్రకటించబోయే నిర్ణయాల కోసం మార్కెట్లు ఎదురుచూడొచ్చు. ఒకవేళ మార్కెట్లకు అనుకూలమైన నిర్ణయాలు రాకుంటే సెంటిమెంట్‌ దెబ్బతినే అవకాశం ఉంది. గతవారం ఒత్తిడి ఎదుర్కొన్న ముడిచమురు ధరల నుంచి మార్కెట్లకు మద్దతు దక్కొచ్చు. సరఫరా, గిరాకీ వార్తలకు అనుగుణంగా ముడిచమురు ధరలు కదలాడనున్నాయి. గతవారం రూపాయి భారీగా దిద్దుబాటుకు గురికావడంతో, డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలపై మదుపర్లు దృష్టి పెట్టొచ్చు. అంతర్జాతీయ పరిణామాల వల్ల స్వల్పకాలంలో రూపాయి ఒడుదొడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎఫ్‌ఐఐల పెట్టుబడుల ధోరణి సైతం కీలకం కానుంది. రుతుపవనాల పురోగతిపై ఓ కన్నేయొచ్చు. అమెరికా- చైనా వాణిజ్య పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లకు కీలకం కానుంది. పెద్ద దేశాల మాంద్యం భయాలు ఇందుకు తోడవ్వచ్చు.

తక్షణ మద్దతు స్థాయిలు: 36,888, 36,371, 35,714 
తక్షణ నిరోధ స్థాయిలు: 37,690, 37,950, 38,330

స్వల్పకాలంలో సెన్సెక్స్‌కు 37,290 పాయింట్ల స్థాయి కీలకం కానుంది.

- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.