Eenadu Online Edition Business News - EENADU
close
వెండి దిద్దుబాటు! 

కమొడిటీస్‌ ఈ వారం

బంగారం, వెండి 

సిడి అక్టోబరు ఫ్యూచర్‌ కాంట్రాక్టు గత సోమవారం రూ.38,257 వద్ద ప్రారంభమైంది. అమెరికా- చైనా వాణిజ్య యుద్ధ పరిణామాలు, హాంకాంగ్‌లో రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో మంగళవారం పసిడి కాంట్రాక్టు రాణించి రూ.38,666 స్థాయిని చేరింది. అయితే చైనా దిగుమతులపై టారీఫ్‌ల విధింపు ఆలస్యం కావొచ్చంటూ అమెరికా చేసిన ప్రకటనతో అదే రోజు గణనీయ స్థాయిలో పడిపోయింది. రూ.37,344 వద్ద వారం కనిష్ఠాన్ని చేరింది. వారం మొత్తం మీద 0.68 శాతానికి నష్టాన్ని పరిమితం చేసుకుని రూ.37,995 వద్ద కాంట్రాక్టు ముగిసింది. ఈవారం పసిడి కాంట్రాక్టుకు రూ.38,952 వద్ద గట్టి నిరోధం కనిపిస్తోంది. ఈ స్థాయిని అధిగమించకుంటే కొంత దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది. సాంకేతికంగా కూడా పసిడి కాంట్రాక్టు మరికొంత కిందకు దిగివచ్చేందుకు అవకాశం కనిపిస్తోంది. అయినా, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు పసిడి కాంట్రాక్టు సానుకూలతను తెచ్చిపెట్టొచ్చన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని స్టాప్‌లాస్‌తో, ధర తగ్గినప్పుడల్లా కొనుగోలు చేసే వ్యూహంతో ముందుకెళ్లొచ్చు. గతవారం రూ.43,411 వద్ద ఆరంభమైన వెండి సెప్టెంబరు కాంట్రాక్టు.. ఆ తర్వాత కొనుగోళ్ల దన్నుతో రూ.44,584 వద్ద వారం గరిష్ఠాన్ని చేరింది. పసిడి కాంట్రాక్టు మాదిరే అమెరికా- చైనా వాణిజ్య యుద్ద పరిణామాలు వెండి కాంట్రాక్టు రాణించేందుకు తోడ్పడ్డాయి. అనంతరం దిద్దుబాటు కారణంగా కాంట్రాక్టు రూ.42,042 స్థాయికి దిగివచ్చింది. అయితే తక్కువ స్థాయిల వద్ద కొనుగోళ్లు వెల్లువెత్తడంతో కాంట్రాక్టు గణనీయంగా పుంజుకుంది. చివరకు 0.95% లాభంతో రూ.43,824 వద్ద కాంట్రాక్టు స్థిరపడింది. సాంకేతికంగా ఈవారం కాంట్రాక్టు కిందకు దిగివచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే మోతాదుకు మించి పెరిగి ఉండటమూ ఇందుకు మరో కారణం. అలాగే ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు పుంజుకున్నా కూడా వెండి కాంట్రాక్టుపై ప్రతికూల ప్రభావం పడుతుందనే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. వీటన్నింటి దృష్ట్యా రూ.44,777 ఎగువన కాంట్రాక్టును షార్ట్‌సెల్‌ చేయడం ఉత్తమం. 

ప్రాథమిక లోహాలు 

రాగి ఆగస్టు కాంట్రాక్టు ఈ రోజు రూ.448 కంటే పైన ముగిస్తే కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు. రూ.450.25 లక్ష్యంతో లాంగ్‌పొజిషన్లు తీసుకోవచ్చు. ఒకవేళ నేడు కాంట్రాక్టు నష్టాల్లో కదలాడి రూ.444 దిగువన ముగిస్తే, రూ.447.15 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.442 లక్ష్యానికి షార్ట్‌సెల్‌ పొజిషన్లు తీసుకోవచ్చు. సీసం ఆగస్టు కాంట్రాక్టు గత నెల రోజులుగా రూ.148- 159.80 శ్రేణిలో చలిస్తోంది. ఈవారం కూడా ఇదే శ్రేణికి పరిమితమయ్యే అవకాశం ఉంది. సాంకేతికంగా చూస్తే కాంట్రాక్టుకు కొంత అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చు. రూ.158.85 ఎగువన ట్రేడ్‌ కాకుంటే.. రూ.152.65; రూ.150.35 వరకు కాంట్రాక్టు దిగివచ్చే అవకాశం ఉంది. జింక్‌ ఆగస్టు కాంట్రాక్టును ఈవారం రూ.177.25- 178.65 మధ్య కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు. అల్యూమినియం ఆగస్టు కాంట్రాక్టు ఈవారం సానుకూలంగా కదలాడేందుకు అవకాశం ఉంది. ఈవారం రూ.142 కంటే పైన ముగిస్తే రూ.142.85; రూ.144 స్థాయి వరకు వెళ్లేందుకు అవకాశం ఉంది. ఒకవేళ ఈ రోజు రూ.139.75 దిగువన ముగిస్తే, స్వల్పకాలంలో మరింత కిందకు వస్తుందని భావించవచ్చు. 

ఇంధన రంగం 

ముడిచమురు సెప్టెంబరు కాంట్రాక్టుకు ఈవారం రూ.4,048 వద్ద నిరోధం కనిపిస్తోంది. ఈ స్థాయిని అధిగమిస్తే కనుక గణనీయ స్థాయిలో పెరిగేందుకు అవకాశం ఉంది. ఒకవేళ ఈ స్థాయిని అధిగించకుంటే గతవారం కనిష్ఠ స్థాయిని మరోమారు తాకొచ్చు. అయితే రూ.3,660 దిగువకు రానంత వరకు కొనుగోళ్లకు మొగ్గు చూపడం మంచి వ్యూహమే అవుతుంది. సాంకేతికంగా సహజవాయువు ఆగస్టు కాంట్రాక్టుకు ఈవారం రూ.164.15 వరకు లాంగ్‌ పొజిషన్లు కొనసాగించడం మంచిదే. ముడి పామోలిన్‌ నూనె (సీపీఓ) ఆగస్టు కాంట్రాక్టుకు సమీప కాల నిరోధమైన రూ.555.15 స్థాయిపై ట్రేడర్లు ఓ కన్నేసి ఉంచాలి. ఎందుకుంటే ఈ స్థాయి వద్ద కొంత షార్ట్‌ కవరింగ్‌ చోటుచేసుకోవచ్చు. అందువల్ల గత వారం పొజిషన్లు కొనసాగిస్తుంటే ఈ స్థాయి వద్ద బయటపడటం ఉత్తమం. 

వ్యవసాయ ఉత్పత్తులు 

గోరుచిక్కుడు అక్టోబరు కాంట్రాక్టు గత కొన్ని వారాలుగా రూ.4,215- రూ.4,523 శ్రేణిలో చలిస్తోంది. ఈవారం కూడా ఈ శ్రేణికి పరిమితం కావచ్చు. సోయాబీన్‌ సెప్టెంబరు కాంట్రాక్టుకు సమీపకాలంలో రూ.3,697 వద్ద నిరోధం కనిపిస్తోంది. ఈ స్థాయిని అధిగమిస్తే రాణించేందుకు ఆస్కారం ఉంటుంది. గతవారం సానుకూల ధోరణి కొనసాగేందుకూ అవకాశం ఉంది. అందువల్ల లాంగ్‌ పొజిషన్లు అట్టేపెట్టుకోవచ్చు. జీలకర్ర సెప్టెంబరు కాంట్రాక్టుకు కొంత అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చు. అయితే రూ.16,643 దిగువకు రాకుంటే కొనుగోళ్ల మద్దతు కూడా లభించొచ్చు. అందువల్ల ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుని ధర తగ్గినప్పుడల్లా కొనుగోలు చేసే వ్యూహంతో ముందుకెళ్లొచ్చు. 
 
 
- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.