Eenadu Online Edition Business News - EENADU
close
16 రకాల కియా సెల్టోస్‌ 

ధరల శ్రేణి: రూ.9.69-15.99 లక్షలు 
ముంబయిలో తొలికారు విడుదల చేసిన సంస్థ 
ముంబయి / హైదరాబాద్‌

క్షిణకొరియా సంస్థ కియా మోటార్స్‌, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంటులో తయారు చేసిన మధ్యశ్రేణి స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) సెల్టోస్‌ను గురువారం ఇక్కడ విపణిలోకి విడుదల చేసింది. పొరుగు దేశాలతో పాటు దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాలకు కూడా ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తామని సంస్థ ప్రకటించింది. పెట్రోల్‌, డీజిల్‌లో కలిపి 16 వేరియెంట్లలో లభించే ఈ ఎస్‌యూవీ ధరలు రూ.9.69-15.99 లక్షలు (ఎక్స్‌షోరూం హైదరాబాద్‌)గా సంస్థ ప్రకటించింది. అధునాతన బీఎస్‌ 6 ఇంజిన్లతోనే ఈ వాహనాన్ని విడుదల చేసినట్లు తెలిపింది. 2020 ఏప్రిల్‌ నుంచి నూతన కాలుష్య ఉద్గారాలు అమల్లోకి రానుండగా, దానికి అనుగుణంగా ఈ ఎస్‌యూవీని రూపొందించినట్లు సంస్థ వెల్లడించింది. ప్రతి 6 నెలలకు ఒక మోడల్‌ ఆవిష్కరిస్తామని సంస్థ గతంలోనే ప్రకటించిన సంగతి విదితమే. 

‘మాకు అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో సెల్టోస్‌ ఒకటి. భారత్‌లో కియా అడుగు దీంతోనే ప్రారంభమవుతోంది. మా శక్తియుక్తులు, నైపుణ్యాలన్నీ కలబోసి ఈ కారును ఆవిష్కరించాం’ అని కియా మోటార్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, ముఖ్య కార్యనిర్వహణాధికారి కూహున్‌ షిమ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం లభిస్తున్న బీస్‌ 4 ఇంధనంతోనే, బీఎస్‌ 6 ఉద్గార ప్రమాణాలు అందుకునేలా, తయారు చేసిన ఈ కారును అనేక రకాల పరీక్షల అనంతరమే విడుదల చేసినట్లు తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా తీర్చిదిద్దామని వివరించారు. ఈ విభాగ వినియోగదారుల అవసరాలన్నీ తీర్చేలా రూపొందించినట్లు స్పష్టం చేశారు.

దీర్ఘకాల దృక్పథం మాది 
దేశంలో వాహన రంగం 2 దశాబ్దాల్లోనే అత్యంత క్లిష్టపరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో, ఈ వాహనాన్ని విడుదల చేయడాన్ని ప్రస్తావిస్తూ, ‘స్వల్పకాలం పాటు అవరోధాలు ఎదురవుతూనే ఉంటాయని, దీర్ఘకాల దృక్పథంతోనే దేశంలో కియా 2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెడుతోంద’ని కియా మార్కెటింగ్‌ విభాగాధిపతి మనోహర్‌ భట్‌ పేర్కొన్నారు. ‘వ్యాపారం ప్రారంభించాం, విజయవంతం అయితే కొనసాగుదాం అనే ధోరణి మాది కాదు. ప్రయోగాల కోసం ఇక్కడకు రాలేదు. విస్తృతమైన మార్కెట్‌పై అవగాహనతోనే వచ్చాం. ప్లాంటుపైనే 1.1 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 7700 కోట్లు) పెట్టుబడి పెట్టాం. నూతన ఉత్పత్తులపై మాకు స్పష్టమైన ప్రణాళిక ఉంది. పెట్టుబడులు తరలించుకుపోవాలనే దృక్పథం మాకు లేదు’ భట్‌ వివరించారు. అధునాతనంగా రూపొందించిన ఈ వాహనానికి ఆకర్షణీయ ధరలు నిర్ణయించామని తెలిపారు. ‘అమ్మకాలు తగ్గినందున, చౌకధరల్లో ఇవ్వడం సాధ్యం కాదు. అందుకే ప్రస్తుత స్థితిలోనూ ఏ వాహనం ధరా తగ్గలేదు’ అని విశ్లేషించారు. డిమాండ్‌కు అనుగుణంగా కార్ల తయారీని వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, పొరుగు దేశాలతో పాటు దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తామని తెలిపారు. 

32,035 
సెల్టోస్‌కు ఇప్పటివరకు వచ్చిన బుకింగ్‌లు
5000 
అనంతపురం ప్లాంటులో తయారైన వాహనాలు. డెలివరీకి ఇవి సిద్ధం
45 - 60 రోజులు 
మిగిలిన వినియోగదార్లకు వాహనాలు అందించేందుకు పట్టే కాలం

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.