Eenadu Online Edition Business News - EENADU
close
లాభాల సరాగాలే..!

స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం
ఆర్థిక వృద్ధికి ప్రభుత్వ చర్యల నేపథ్యం 
ఈ వారం మరిన్ని నిర్ణయాలకు అవకాశం
విదేశీ పెట్టుబడులు తరలి రావొచ్చు 
మార్కెట్‌ అంతటా సానుకూలతలే 
విశ్లేషకుల అభిప్రాయాలు

విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల(ఎఫ్‌పీఐ)పై విధించిన అదనపు సర్‌ఛార్జీని తొలగించడం మార్కెట్లలో సానుకూలతలు నింపొచ్చని మదుపర్లు అంచనా వేస్తున్నారు. ద్రవ్యలభ్యత చర్యల వల్ల వాహన, ఆర్థిక సేవల రంగాల షేర్ల వైపు మదుపర్లు దృష్టి సారించొచ్చని చెబుతున్నారు. బడ్జెట్‌లో సర్‌ఛార్జీ ప్రతిపాదన చేసినప్పటి నుంచి, ఇటీవలి వరకు (రెండు నెలల్లో) ఎఫ్‌పీఐలు 3.4 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.24,500 కోట్ల) వరకు పెట్టుబడులను ఉపసంహరించారు. తిరిగి వారు మన మార్కెట్లపై ఆసక్తి కనబరచవచ్చు. వాహన, మౌలిక, స్థిరాస్తి రంగాలకు ఉపకరించే చర్యలు ప్రకటించడంతో, ఆయా రంగాల షేర్లు రాణించవచ్చని డీలర్లు అంటున్నారు. నిప్టీ ఈ వారం 11200 స్థాయిని పరీక్షించవచ్చని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యం, బ్రెగ్జిట్‌లకు సంకేతాలనిచ్చే జి-7 సదస్సు నిర్ణయాలు కీలకం కావొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఆగస్టు 30న వెలువడే ఏప్రిల్‌-జూన్‌ జీడీపీ గణాంకాలు, వచ్చే వారంలో వెలువడే అంతర్జాతీయ ఆర్థిక గణాంకాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపొచ్చని అంటున్నారు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..
* రిలయన్స్‌ జియో తన కార్యకలాపాలను బలోపేతం చేసుకుంటున్న నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లాభాలు స్థిరీకరణకు గురి కావొచ్చు. మరో వైపు జియో నుంచి గట్టి పోటీ కారణంగా భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు ఒత్తిడికి గురికావొచ్చు.

* బలమైన త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో సంస్థాగత మదుపర్ల నుంచి వచ్చే గిరాకీతో యంత్ర పరికరాల షేర్లు లాభాల బాట పట్టొచ్చు.
* వినియోగదారు సెంటిమెంటు మెరుగుపడడానికి ప్రభుత్వం పలు చర్యలు ప్రకటించిన నేపథ్యంలో వాహన కంపెనీల షేర్లు రాణించే అవకాశం ఉంది.
* ఎఫ్‌ఎమ్‌సీజీ వంటి రంగాలకు ఉపకరించే చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించడం సానుకూలతలు తీసుకురావొచ్చు. ఈ వారం ప్రకటించబోయే మరిన్ని చర్యల కోసం మార్కెట్‌ ఎదురుచూస్తుంది. 
* అప్‌స్ట్రీమ్‌, డౌన్‌స్ట్రీమ్‌ కంపెనీలు మార్కెట్‌తో పాటే లాభాలు అందుకోవచ్చు. ఎటువంటి సంకేతాలు లేనందున అంతర్జాతీయ ముడి చమురు ధరలు, రూపాయి మారకపు విలువల ప్రభావం కనిపించొచ్చు. 
* బ్యాంకుల షేర్లు లాభాల బాట పట్టొచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందుండి నడిపించొచ్చు. వీటికి రూ.70,000 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుండడం ఇందుకు నేపథ్యం. 
* ఆర్థిక వ్యవస్థలో గిరాకీ పెరగడానికి తీసుకున్న చర్యలు సిమెంటు షేర్లకు సానుకూలతలు పంచొచ్చు.
* ఐటీ షేర్లూ లాభాలందుకునే అవకాశం ఉన్నా.. మార్కెట్‌తో పోలిస్తే కాస్త తక్కువ సానుకూలతలు కనిపిస్తున్నాయి. 
* సంస్థాగత మదుపర్ల పెట్టుబడులు పెరిగే అవకాశం ఉన్నందున ఫార్మా షేర్లు రాణించొచ్చు. మొత్తం మీద మార్కెట్‌ లాభాలందుకోనుండటం ఈ షేర్లకూ కలిసిరానుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.