close
నిమిషానికి 6 పైసలు

ఛార్జీల బాటపట్టిన రిలయన్స్‌ జియో
 సొంత నెట్‌వర్క్‌లో ఉచితమే
 ఐయూసీ భారం వల్లే: సంస్థ
 ప్రస్తుత పథకాల కాలపరిమితి వరకు ఉచితం
 కొత్తగా చేసుకునే రీఛార్జులపై వర్తింపు

డేటాకు మాత్రమే ఛార్జీ.. జీవితకాలం ఉచితకాల్స్‌ నినాదంతో సేవలు ఆరంభించిన రిలయన్స్‌ జియో, అందుకు విరామం పలుకుతోంది. ఇకపై సొంత నెట్‌వర్క్‌ పరిధిలో చేసుకునే కాల్స్‌కు ఛార్జీలు ఉండవని, ఇతర నెట్‌వర్క్‌లకు చేసుకునే మొబైల్‌ వాయిస్‌కాల్స్‌కు నిమిషానికి 6 పైసల చొప్పున ఛార్జ్‌ చేస్తామని ప్రకటించింది. కాల్స్‌ కోసం రూ.10 నుంచి టాపప్‌ ఓచర్లతో రీఛార్జి చేసుకోవచ్చని, ప్రతి రూ.10కి 1 జీబీ చొప్పున డేటాను అదనంగా కేటాయిస్తామని తెలిపింది. ఒక నెట్‌వర్క్‌ చందాదార్లు వేరొక నెట్‌వర్క్‌ పరిధిలోని ఫోన్లకు కాల్స్‌ చేస్తే, కాల్‌ అందుకున్న నెట్‌వర్క్‌కు తొలి సంస్థ ఛార్జీ చెల్లించాలన్న (ఐయూసీ) ఆదేశాలు అమల్లో ఉన్నంత వరకు కాల్‌ ఛార్జీలు కొనసాగుతాయని జియో స్పష్టం చేసింది.

ఏమిటీ ఐయూసీ వ్యవహారం?

  ఒక టెలికాం నెట్‌వర్క్‌ నుంచి మరో సంస్థకు కాల్స్‌ వెళ్తే, అనుసంధాన ఛార్జీ (ఐయూసీ) కింద మొదటి సంస్థ నిమిషానికి 14 పైసలు చెల్లించాల్సి వచ్చేది. 2017 అక్టోబరు 1 నుంచి 2019 డిసెంబరు 31 వరకు ఐయూసీ కింద నిమిషానికి 6 పైసలే వసూలు చేయాలని ట్రాయ్‌ నిర్ణయించింది. అంటే 2020 జనవరి 1 నుంచి ఐయూసీ ఛార్జీల వ్యవస్థే ఉండకూడదు. అప్పటినుంచి నెట్‌వర్క్‌ల మధ్య వెళ్లే కాల్స్‌కు ఐయూసీ ఛార్జీల విధింపు ఏమీ ఉండకూడదు. కానీ ‘ఐయూసీ ఛార్జీల వ్యవస్థ గడువు పొడిగించాలా, వద్దా’ అనే విషయమై ఒక చర్చాపత్రాన్ని ఇప్పుడు ట్రాయ్‌ విడుదల చేసింది. ఈ అనిశ్చితి నేపథ్యంలోనే ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లే మొబైల్‌ కాల్స్‌కు, ఐయూసీ ఛార్జీలకు సమానంగా వినియోగదారుల నుంచి వసూలు చేయాలని జియో నిర్ణయించింది

రూ.13,500 కోట్ల భారం

జియో నెట్‌వర్క్‌ నుంచి కాల్స్‌ అన్నీ ఉచితమని ప్రకటించినందున, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా వంటి సంస్థలకు వెళ్లిన కాల్స్‌ కోసం గత మూడేళ్లలో జియో రూ.13,500 కోట్లు చెల్లించింది. ఈ నష్టాల నుంచి బయట పడేందుకు, ఇతర నెట్‌వర్క్‌లకు చేసుకునే కాల్స్‌కు ఛార్జీ విధించాలని జియో నిర్ణయించింది.

జియో ఎందుకు ఆగలేదంటే.. 

ఐయూసీ ఛార్జీలను కొనసాగించాలా, వద్దా అనే విషయమై ట్రాయ్‌ చర్చాపత్రం విడుదల చేసిందే కానీ, నిర్ణయం తీసుకోలేదు. గత నిర్ణయం ప్రకారమైతే ఈ ఛార్జీలు డిసెంబరు 31తో ముగియాలి. అంటే మరో రెండు నెలల 20 రోజులే గడువుంది. మూడేళ్ల పాటు భారం మోసిన సంస్థ ఈ కొద్దికాలం ఆగలేదా.. అంటే దానికి కారణాన్ని జియో వెల్లడించింది. ఇప్పటికీ ఇతర నెట్‌వర్క్‌ల పరిధిలో 2జీ సేవల్లో 35-40 కోట్ల మంది చందాదార్లున్నారు. వీరికి కాల్‌ఛార్జీలు కూడా నిమిషానికి రూ.1.50 దాకా ఉన్నాయి. అందువల్ల వీరు జియో చందాదార్లతో మాట్లాడేందుకు మిస్డ్‌కాల్‌ ఇచ్చి ఊరుకుంటున్నారు. తమకు కాల్‌ ఛార్జీలు లేనందున, జియో చందాదార్లు వారికి కాల్‌ చేసి మాట్లాడుతున్నారు. ఇలా రోజుకు 25-30 కోట్ల మిస్డ్‌కాల్స్‌ జియో నెట్‌వర్క్‌ ఫోన్లకు వస్తున్నాయి. ఇందువల్ల జియో నుంచి రోజుకు 65-75 కోట్ల నిమిషాల అవుట్‌గోయింగ్‌ కాల్స్‌ వెల్తున్నాయి.ఈ భారం అంతకంతకూ పెరుగుతున్నందునే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు జియో తెలిపింది.

ఈ కాల్స్‌కు ఛార్జీలుండవ్‌

* జియో నెట్‌వర్క్‌ ఫోన్ల మధ్య చేసుకునే కాల్స్‌ ఉచితమే.
* జియో నెట్‌వర్క్‌ నుంచి ల్యాండ్‌లైన్లకు చేసుకునే కాల్స్‌ ఉచితమే.
* వాట్సాప్‌, ఫేస్‌టైమ్‌ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చేసుకునే కాల్స్‌కు ఛార్జీలు ఉండవు
* ఇతర నెట్‌వర్క్‌ల నుంచి ఇన్‌కమింగ్‌ కాల్స్‌  ఉచితం 

కొత్త రీఛార్జులపై అమల్లోకి వచ్చేసింది

ఈనెల 9 (బుధవారం) నుంచి చేసుకునే కొత్త రీఛార్జులపై ఐయూసీ భారం పడుతుందని జియో స్పష్టం చేసింది. ఇప్పటికే నెల, 3 నెలలు, ఏడాది కాలావధి రీఛార్జులు చేయించుకుని, మరికొంత కాలం గడువున్న వారు, అప్పటి వరకు ఉచితంగానే ఇతర నెట్‌వర్క్‌లకూ మాట్లాడుకోవచ్చు. ఐయూసీ ఛార్జీలను ట్రాయ్‌ రద్దు చేసే వరకు ఈ ఛార్జీలు వసూలు చేయక తప్పదని జియో తెలిపింది.
జియో పోస్ట్‌పెయిడ్‌ చందాదార్లు కూడా ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసల చొప్పున అదనంగా చెల్లించాలి. అదనపు చెల్లింపునకు సమానమైన డేటా వీరికి అదనంగా లభిస్తుంది.

జియో వాదన సరికాదు: ట్రాయ్‌ అధికారి

ట్రాయ్‌ విధానాలు మార్చుకోవడం వల్లే ఐయూసీ ఛార్జీ విధిస్తున్నామన్న జియో వాదన సరికాదని, తాము ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు. ఐయూసీ నిమిషానికి 14 పైసలు ఉన్నపుడు కూడా ఉచిత కాల్స్‌ ఇచ్చిన జియోనే, చందాదార్లకు ఇచ్చిన హామీకి భిన్నంగా ఇప్పుడు వాయిస్‌కాల్స్‌కు ఛార్జీ అంటోందని పేర్కొన్నారు.

ఎయిర్‌టెల్‌ ఏమంటోంది?

మొబైల్‌ సేవల్లో 4జీ (వోల్టె) సాంకేతికతను, చిన్న నెట్‌వర్క్‌ సంస్థల వృద్ధిని దృష్టిలో పెట్టుకుని 2020 జనవరి 1 నుంచి ఐయూసీ రద్దు చేయాలని ట్రాయ్‌ గతంలో భావించిందని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. అవి రెండూ జరగలేదని, అనేక సంస్థలు మూతబడ్డాయని గుర్తు చేసింది. ఇప్పటికీ 2జీ చందాదార్లు 40 కోట్ల మంది ఉన్నారని తెలిపింది.

 

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.