close
మందగమనానికి కారణం ఎవరు

పేరుకే ప్రపంచం.. కానీ అది కుగ్రామమే.  గ్రామంలో ఎక్కడో ఏదో జరిగితే ఊరంతా ఉలిక్కిపడినట్లు..  ప్రపంచంలో ఏ మూలనో ఏదో అయితే.. ప్రతీ దేశమూ వణకాల్సి వస్తోంది. ఇపుడు అమెరికా మందగమనంలో ఉన్నా.. మిగతా ప్రపంచమంతా ఆ ప్రభావాన్ని కాచుకోవాల్సిందే.  దేశంలోనూ అంతే. ఏదో ఒక రంగం డీలా పడితే.. దాని ప్రభావం అన్నిటిపైనా పడి.. చివరకు వృద్ధి చక్రాలకు అడ్డుపడుతున్నాయి. ఒకప్పుడు వృద్ధికి దోహదం చేసిన రంగాలే.. ఇపుడు మందగమన భారానికి కారణమవుతున్నాయి.

అమెరికా- చైనాల వాణిజ్య పోరు ప్రపంచాన్ని మందగమనం దారిలో నడిపింది. ఇలాగే కొనసాగితే 2020 కల్లా అర లక్ష కోట్ల డాలర్ల వరకు ప్రపంచం కోల్పోవచ్చు. భారత్‌ విషయానికొస్తే కొన్నేళ్ల కిందట మన వృద్ధి 8 శాతం పైగా దూసుకెళ్లింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగులు తీస్తున్న ఆర్థిక వ్యవస్థగా పేరుతెచ్చుకుంది. ఇప్పటికీ ఆ పేరు ఉన్నా..  వృద్ధి నెమ్మదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.1 శాతానికి తగ్గవచ్చని స్వయానా రిజర్వ్‌ బ్యాంకే ఇటీవలి సమీక్షలో స్పష్టం చేసింది.  తాజాగా ఎస్‌బీఐ, సీఎల్‌ఎస్‌ఈలు కూడా వృద్ధి అంచనాలను 5 శాతానికి పరిమితం చేశాయి. ముఖ్యంగా కొన్ని రంగాల పనితీరు బాగోలేక పోవడం వృద్ధిపై ప్రభావం చూపుతోంది.

ఈ రంగాలకేమైంది..?

ఎఫ్‌ఎమ్‌సీజీ వెనకడుగు: వృద్ధికి అండగా నిలిచే ప్రధాన రంగాల్లో ఒకటైన ఎఫ్‌ఎమ్‌సీజీ రంగం నెమ్మదించింది. గతేడాది 13.8 శాతం వృద్ధి చూపిన ఈ రంగం ఈ సారి 11 శాతానికే పరిమితం కావొచ్చని నీల్సన్‌ వంటి మార్కెట్‌ పరిశోధక సంస్థలు చెబుతున్నాయి. గిరాకీ తగ్గడమే అందుకు కారణం. ఎఫ్‌ఎమ్‌సీజీ రంగంలో బిస్కట్ల వ్యాపారం ప్రధానమైనది. ఇటీవల గిరాకీ తగ్గడంతో పార్లే ప్రోడక్ట్స్‌ ప్రమాద ఘంటికలు మోగించింది. ఈ మందగమనం, గిరాకీ ఇలాగే స్తబ్దుగా కొనసాగితే.. లక్ష మంది ఉద్యోగుల్లో 10% అంటే 8,000-10,000 మందిని ఇంటికి పంపకతప్పదని అంటోంది. పార్లే-జి, మొనాకో, మారీ బిస్కట్లను నెలకు 90,000 టన్నుల వరకు తయారు చేసే ఈ కంపెనీ 7-8% మేర ఉత్పత్తిలో కోత వేసింది కూడా. 

ఆల్కహాల్‌ విక్రయాలు: సాధారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆల్కహాల్‌ అమ్మకాలు తగ్గవు. కానీ ఏప్రిల్‌-జూన్‌ 2019లో బీర్లు, ఆల్కహాల్‌ వినియోగం, విక్రయాలు తగ్గాయి. జీఎస్‌టీ అమలు తర్వాత ఆల్కహాల్‌ వినియోగం పెరిగింది. అయితే జూన్‌ త్రైమాసికానికొచ్చేసరికి తగ్గాయి. సిగరెట్ల అమ్మకాలు పెరిగినా.. మొత్తం మీద గణాంకాలు మాత్రం మెరుగుపడలేదు. 

టైర్లు కదలడం లేదు: వాహన పరిశ్రమ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గిరాకీ ప్రభావంతో అమ్మకాలు కుదేలయ్యాయి. ఉదాహరణకు సెప్టెంబరులో ద్విచక్ర వాహన విక్రయాలు 14.43 శాతం మేర తగ్గాయి. వాణిజ్య వాహన అమ్మకాలైతే ఏకంగా 23.31 శాతం క్షీణించాయి. పండగ సీజను కావడంతో అక్టోబరులో అమ్మకాలు పుంజుకున్నాయి.. లేదంటే ఆ నెల కూడా నిరాశాజనకంగా ఉండేదేమో. 3.7 కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఈ రంగం ఇలా డీలా పడడం ఆలోచించాల్సిన విషయమే. ఇప్పటికే గిరాకీ తగ్గిందని కొన్ని కంపెనీలు ఉత్పత్తిలో కోతలు విధించాయి. దీంతో ఇప్పటికే వాహన తయారీదార్లు, వాహన విడిభాగాల కంపెనీలు, డీలర్లు మొత్తం మీద 3,50,000 ఉద్యోగాల్లో కోత వేసినట్లు తెలుస్తోంది.

గిరాకీ ఎందుకు తగ్గిందంటే..

ప్రజలు ఖర్చు చేసే ఆదాయం తగ్గడంతో గిరాకీ సెంటిమెంటు డీలా పడింది. భారత్‌లో ఈ ఆదాయం 2015-2018 మధ్య 9.5 శాతం మేర తగ్గింది. 2010-2014 మధ్య ఇది 13.3 శాతంగా ఉంది. ఇందుకు కారణం చెప్పడం అంత సులువు కాదు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో చక్రీయ ప్రభావం ఉంటుంది. ఒక దగ్గర సమస్య మొదలైతే.. అది అలా తిరిగి తిరిగి అన్నిటిపై పడుతుంది. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ కుంభకోణమైతేనేమి, మొండి బకాయిల సమస్యలైతేనేమి.. వ్యవస్థలో ద్రవ్యలభ్యతను తగ్గించాయి. వ్యవస్థలో డబ్బులు ఆడకపోవడంతో రుణాలు పుట్టలేదు. రుణాల్లేకుంటే కంపెనీలకే కాదు.. వ్యక్తులకూ చేతిలో ఖర్చు చేసే డబ్బులు ఉండవు. ఇది కాస్తా గిరాకీకి గొడ్డలిపెట్టుగా మారింది.

ప్రభుత్వం ఏం చేయాలి.. 

* రెపో రేట్ల కోతను బ్యాంకులు పూర్తి స్థాయిలో బదిలీ చేయాలి.
* జీఎస్‌టీ రేట్లను తగ్గించాలి.
* ప్రత్యక్ష పన్ను స్మృతిని అమలు చేయాలి.
* పెట్టుబడులకు ప్రోత్సాహకాలు(పన్ను తగ్గింపుల రూపంలో) ఇవ్వాలి. 
* మౌలిక రంగంలో ప్రభుత్వ పెట్టుబడులను వేగవంతం చేయాలి. ఉక్కు, సిమెంటు రంగాల్లో ఇవి ఎక్కువగా ఉండాలి.
* గిరాకీని పెంచడంతో పాటు.. వ్యూహాత్మక సంస్కరణలను అమలు చేస్తే వృద్ధికి ఊతం లభిస్తుంది. కోర్టుల్లో ఉన్న కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడం; భూ, కార్మిక సంస్కరణలను తీసుకురావడం; సులువుగా వ్యాపారాన్ని చేసుకోవడం మరింత సులభతరం చేయడం వంటివి కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది.

 

వృద్ధి మాత్రమే కాదు.. మరికొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 
* సెప్టెంబరులో పారిశ్రామికోత్పత్తి ఎనిమిదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. 
* అక్టోబరులో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నియంత్రిత లక్ష్యమైన 4 శాతాన్ని మించిపోయి 4.62 శాతానికి పెరిగింది. 
* కార్పొరేట్‌ పన్ను కోత ప్రభావంతో ద్రవ్యలోటు నిర్దేశిత లక్ష్యాన్ని (3.3%) మించే అవకాశం ఉంది. 2019-20లో ద్రవ్యలోటు 4.3 శాతానికి చేరొచ్చని సీఎల్‌ఎస్‌ఏ అంచనా వేస్తోంది.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.