close
ఫ్లిప్‌కార్ట్‌పైనే ఫిర్యాదులెక్కువ

తర్వాతి స్థానాల్లో జియో,అమెజాన్‌
ఐదింటిలో ఒకటి ఇ-కామర్స్‌ సంస్థలపైనే

దిల్లీ: ఆన్‌లైన్‌లో ఫోను కోసం బుక్‌ చేస్తే ఇటుకలు, రాళ్లు రావడం.. చొక్కానో ప్యాంటు కోసమో ఆర్డరిస్తే చీర పంపించడం.. ఇదిగో ఇలాంటి వార్తలు మనం అప్పుడప్పుడు వింటున్నాం కదా. అందుకేనేమో ప్రభుత్వానికి అందుతున్న వినియోగదారు ఫిర్యాదుల్లో ఇ-కామర్స్‌ సంస్థలపైనే అధికంగా ఉంటున్నాయట. ప్రతి 5 ఫిర్యాదుల్లో ఒకటి వీటిపైనేనట. అత్యధిక ఫిర్యాదులు ఫ్లిప్‌కార్ట్‌పై వస్తుండగా.. రిలయన్స్‌ జియో, అమెజాన్‌, ఓ ప్రభుత్వ రంగ బ్యాంకు తర్వాతి స్థానాల్లో ఉన్నాయట. కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలను ఉటంకిస్తూ ఎకనమిక్స్‌ టైమ్స్‌ కథనం ఈ విషయం వెల్లడించింది. ప్రభుత్వ నేషనల్‌ హెల్స్‌లైన్‌కు ఇ-కామర్స్‌ సంస్థలపైనే కాకుండా టెలికాం, బ్యాంకింగ్‌ రంగ సంస్థలపై కూడా అత్యధికంగానే ఫిర్యాదులు వస్తున్నాయని ఓ అధికారి తెలిపారు. ఇ-కామర్స్‌ రంగానికి వినియోగదార్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో అదే స్థాయిలో ఫిర్యాదులూ పెరుగుతున్నాయని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఫిర్యాదుల సంఖ్య 40-50 శాతం మేర పెరిగే అవకాశం ఉందని ఆ అధికారి వెల్లడించారు.

లెక్క ఎంతెంత..
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 5 లక్షలకు పైగా వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రాగా.. లక్షకు పైగా ఫిర్యాదులు ఇ-కామర్స్‌ సంస్థలకు సంబంధించినవే. బ్యాంకులపై 41,600, టెలికాం సంస్థలపై 29,400 ఫిర్యాదులు వచ్చాయి.
* కిందటి ఆర్థిక సంవత్సరంలోనూ 5,65,000 ఫిర్యాదుల్లో లక్ష వరకు ఇ-కామర్స్‌ సంస్థలపై చేసినవే.

ఏయే ఫిర్యాదులు.
* అధికారి వెల్లడించిన దాని ప్రకారం పాడైన వస్తువులను పంపించారని, ఎక్స్ఛేంజీ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయని, ఆర్డరు చేసిన వస్తువును ఆలస్యంగా పంపించారని లాంటి కారణాలు చూపుతూ ఇ-కామర్స్‌ సంస్థలపై ఎక్కువ మంది ఫిర్యాదులు చేశారు.
* అధికంగా బిల్లు వేశారని, డేటా తగ్గించారని, కనెక్టివిటీ సమస్యలు ఎదురయ్యాయంటూ టెలికాం కంపెనీలపై ఫిర్యాదులు వచ్చాయి.
‘వినియోగదారుల సహకారానికి, వారికి ఎదురయ్యే సమస్యల సత్వర పరిష్కారానికి ఎప్పటికప్పుడు మా విధానాలను మెరుగుపర్చుకుంటూ వస్తున్నాం. ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌ వినియోగం, విధానాలు, షరతులపై వినియోగదార్లకు మార్గదర్శనం చేస్తున్నాం. ఇ-కామర్స్‌ లావాదేవీలపై అవగాహన నిమిత్తం ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. ఉత్పత్తుల నాణ్యత విషయంలో వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఉండేందుకు ఆ విక్రయదార్లకు శిక్షణ ఇవ్వడంపైనా దృష్టి పెడుతున్నాం’

- ఫ్లిప్‌కార్ట్‌ అధికార ప్రతినిధి

‘వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం నిమిత్తం ప్రభుత్వ వినియోగ హెల్ప్‌లైన్‌తో కలిపి కంపెనీ పనిచేస్తోంది. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా వస్తున్న ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు మేం కట్టుబడి ఉన్నాం’

  - అమెజాన్‌ అధికార ప్రతినిధి
కాగా.. అధిక ఫిర్యాదులపై రిలయన్స్‌ జియో అధికార ప్రతినిధి నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.