close
అంబులెన్స్‌ కావాలా...యాంబస్‌ ఉందిగా!

ఏదైనా అత్యవసరమైతే 108కు ఫోన్‌ చేస్తే మన ఇంటి వద్దకు లేదా సంఘటనా స్థలికి అంబులెన్స్‌ వస్తుంది. మరి సాధారణ వైద్య(అత్యవసరం లేని) సేవల మాటేమిటి..? ఒక రోగిని ఆసుపత్రిని ఇంటికి తీసుకెళ్లడం, ఆసుపత్రికి తీసుకెళ్లడం, మృతదేహాలను తరలించడం.. ఇలా ఎన్నో అవసరాలకు అంబులెన్సులు అవసరం పడతాయి. ప్రైవేటు సర్వీసులకు ఫోన్‌ చేస్తే ఒక్కొక్కరు ఒక్కో ధర చెబుతారు. అందులోనూ అవసరమైన సౌకర్యాలు ఉంటాయో.. లేదో వాహనం వచ్చే వరకు తెలియదు. క్యాబ్‌ల కోసం ప్రత్యేకంగా యాప్‌ ఉన్నప్పుడు.. అంబులెన్స్‌ సర్వీసులకు ఓ యాప్‌ ఉండాలన్న ఉద్దేశంతో ప్రారంభమైందే ‘యాంబస్‌’. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ అంకురాన్ని ప్రారంభించింది.. ఎన్‌వీజీ రాజా. ఏడాది కాలంలో 3,500కుపైగా రోగులకు సేవలు అందించిన ఈ సంస్థ గురించి ఆయన ఇలా వివరిస్తున్నారు.
కడప నుంచి హైదరాబాద్‌కు వచ్చాక.. ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో బిల్లింగ్‌ మేనేజర్‌గా చేరాను. ఆ సమయంలో సాధారణ వైద్య సేవల కోసం అంబులెన్సు సేవలు పొందేందుకు రోగులు ఎన్నో ఇబ్బందులు పడటం గమనించా. ముఖ్యంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక ఇంటికి వెళ్లాలంటే ప్రైవేటు అంబులెన్సులను ఆశ్రయిస్తే వేలకు వేలు రోగుల నుంచి వసూలు చేస్తుంటారు. అప్పటికే ఆసుపత్రిలో బిల్లులతో ఆర్థికంగా చితికిపోయిన రోగులకు.. ఇది మరింత భారంగా ఉండేది. ఒకసారి రాంచీ నుంచి వచ్చిన రోగి చనిపోయారు. మృతదేహాన్ని సొంతూరుకు తీసుకెళ్లేందుకు కుటుంబీకులు అంబులెన్సులను ఆశ్రయిస్తే రూ.లక్షల్లో చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కో ఛార్జీ చెప్పారని తెలిసింది. వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతూనే వెళ్లాల్సి వచ్చింది. ఈ సంఘటన నన్ను కదిలించింది. క్యాబ్‌ల కోసం ప్రత్యేకంగా యాప్‌లు ఉన్నప్పుడు అంబులెన్సులకు ఎందుకు ఉండదకూడదని అనుకుని యాంబస్‌ను అంకుర సంస్థను ఏర్పాటు చేశా.

ధరల వివరాలు.. వేర్వేరు సేవలు
అంబులెన్స్‌ సేవలు అందించాలనుకునేవారు యాప్‌లో నమోదు చేసుకుంటారు. ఒకే ప్రాంతంలో ఎక్కువ మంది నమోదై ఉంటారు కాబట్టి, సహజంగానే రేట్లు తక్కువలో ఉంటాయి. అలాగే రోగి కుటుంబీకులు అంబులెన్స్‌ను బుక్‌ చేసుకున్నప్పుడు ఎవరు తక్కువ రేటుకు సేవలు అందిస్తున్నారో తెలుసుకునే వీలుంటుంది. అలాగే అంబులెన్సులో ఉండే సౌకర్యాలు తెలుసుకునే వీలుంటుంది. సాధారణ అంబులెన్సు, ఆక్సిజన్‌ సౌకర్యం, ఫ్రీజర్‌ సౌకర్యం.. ఇలా వేర్వేరుగా అవసరానికి అనుగుణంగా బుక్‌ చేసుకునే వీలుంది. దీనికితోడు అంబులెన్సుకు సంబంధించిన చిత్రాలు యాప్‌లో నమోదై ఉంటాయి. దాని ఆధారంగా ఉత్తమంగా ఉన్నవాటిని బుక్‌ చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో అంబులెన్స్‌ సేవలు అందిస్తుండగా వచ్చే జనవరి నుంచి విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాలకు సేవలు విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆ మాటలే ధైర్యాన్నిచ్చాయి
ఒకానొకదశలో యాప్‌ నిర్వహణ భారంగా మారింది. ఆర్థికంగా వెసులుబాటు లేకపోవడంతో విరమించుకుందామనే ఆలోచన వచ్చింది. అదే సమయంలో జంషెడ్‌పూర్‌కు చెందిన ఒక రోగి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. తాము హైదరాబాద్‌ నుంచి జంషెడ్‌పూర్‌ వచ్చేందుకు బయట అంబులెన్సులను సంప్రదిస్తే రూ.1.65లక్షలు చెప్పారని, యాంబస్‌ ద్వారా బుక్‌ చేసుకుంటే రూ.90వేలకే వచ్చిందన్నారు. యాప్‌ నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పడంతోపాటు మరింత విస్తరించాలని కోరారు. అలా వారు ఇచ్చిన ధైర్యంతో ముందడుగు వేయాలని నిర్ణయించి కొనసాగిస్తున్నా.

రూ.10లక్షలతో..
ఈ సంస్థ ప్రారంభించేందుకు రూ.10లక్షల వరకూ పెట్టాను. భారతదేశం అంతా విస్తరించేందుకు రూ. కోటి వరకూ అవసరం. ప్రస్తుతం రూ.20లక్షల వరకూ సమకూర్చేందుకు నా స్నేహితుడు ముందుకొచ్చారు. ఇప్పుడు నేను ఒక్కడినే దీన్ని నిర్వహిస్తున్నా. భవిష్యత్తులో కొంతమంది ఉద్యోగులను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా. హైదరాబాద్‌లో 40 మంది అంబులెన్సు సేవలను అందించే వెండర్లతో ఒప్పందం ఉంది. ఇందులో 250 వరకూ అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే రెండు ఎయిర్‌ అంబులెన్సులతోనూ ఒప్పందం కుదుర్చుకున్నాం. వీటితోపాటు బాడీ ఫ్రీజర్లూ మా యాప్‌ ద్వారా బుకింగ్‌ చేసుకునే వీలు తీసుకొచ్చాం. అంబులెన్స్‌కు అయ్యే ఖర్చులో 10శాతం కమీషన్‌ తీసుకుంటాం. ఇదే సంస్థ ఆదాయం. షూటింగ్‌లకూ అంబులెన్స్‌లను అద్దెకు ఇస్తుంటాం. నెలకు సగటున రూ.50వేల వరకూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం. హైదరాబాద్‌లో 500కు పైగా ఆసుపత్రులున్నాయి. మొత్తం 3,000 వరకూ అంబులెన్సులు ఉన్నాయి. ఇందులో 5వేల వరకూ బుకింగ్‌లు ఉంటాయి. ఇందులో కనీసం 30-40శాతం మా ద్వారా జరగాలనేది లక్ష్యం.

- ఈనాడు, హైదరాబాద్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.