
యూఎస్ఎఫ్డీఏ ‘హెచ్చరిక’లతో నష్టం
డాక్టర్ రెడ్డీస్ సహ ఛైర్మన్ జీవీ ప్రసాద్
ఈనాడు, హైదరాబాద్: దేశీయ ఫార్మాసూటికల్ సంస్థల తయారీ యూనిట్లపై తరచుగా అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) తనిఖీలు చేయటం, తదుపరి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయటం వంటి చర్యల వల్ల మనదేశం నుంచి ఔషధ ఎగుమతులు మందగించే పరిస్థితి ఏర్పడుతోందని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ సహ-ఛైర్మన్ జీవీ ప్రసాద్ అన్నారు. సోమవారం ఇక్కడ ఐఎంటీ- హైదరాబాద్‌తో కలిసి సీఐఐ- తెలంగాణ ఇక్కడ నిర్వహించిన ఫార్మా సదస్సులో ఆయన మాట్లాడారు. అమెరికా- చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మనకు కొన్ని అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ ఔషధ ఎగుమతులు పెంచుకోలేకపోవటానికి ఈ పరిస్థితులే కారణమని ఆయన అన్నారు. దేశీయ ఔషధ రంగం మందగమనానికి కూడా ఇదే కారణమని పేర్కొన్నారు. యూఎస్ఎఫ్డీఏ జారీ చేస్తున్న ‘హెచ్చరిక లేఖ’ ల వల్ల ఎన్నో కంపెనీలకు చెందిన ఔషధాలకు అమెరికాలో అనుమతుల ప్రక్రియ నిలిచిపోయిందని వివరించారు. ఇక్కడి ఔషధ కంపెనీలు అన్ని విభాగాల్లో తమ ప్రమాణాలను గణనీయంగా పెంచుకోవటమే దీనికి తగిన పరిష్కారమని విశ్లేషించారు. యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇన్‌గ్రేడియంట్స్ (ఏపీఐ), ఇంటర్మీడియేట్స్ సరఫరాకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఔషధ పరిశ్రమ చైనా మీద ఆధారపడుతోందని, యూఎస్-చైనా వాణిజ్య యుద్ధంతో చైనా కాకుండా ఇతర దేశాల వైపు ప్రపంచ ఔషధ సంస్థలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అదే సమయంలో చైనా కూడా చౌక వస్తువుల తయారీని వీడి పరిశోధన-అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ అధిక విలువ కల ఔషధాల తయారీ వైపు మొగ్గుచూపుతోందని చెప్పారు. ఇదొక రకంగా మనదేశానికి మంచి అవకాశమని పేర్కొన్నారు.
ప్రాథమిక వైద్య సేవలకు ప్రాధాన్యం..
మనదేశంలో వైద్య సేవల స్థితిగతులపై మాట్లాడుతూ జబ్బు చేసిన తర్వాత చికిత్స చేయటం కంటే జబ్బులు రాకుండా జాగ్రత్త తీసుకోవటమే లక్ష్యం కావాలని జీవీ ప్రసాద్ అన్నారు. ఇందులో భాగంగా మనదేశం ప్రాథమిక వైద్య సేవల మీద ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వైద్య సేవలు అందుబాటులో ఉండటం అనేది మనదేశంలో పెద్ద సమస్య కాదని, తగినంత ఆరోగ్య బీమా లేకపోవటం అనేదే తీవ్రమైన అంశమని వివరించారు. ఫార్మాసూటికల్స్ పరిశ్రమ బహుముఖంగా విస్తరించిన ఫలితంగా మనదేశంలో మందుల లభ్యత పెరగటమే కాకుండా అందుబాటు ధరల్లో దొరికే సానుకూలత ఏర్పడిందన్నారు. ఎన్నో తీవ్రమైన జబ్బులకు ఔషధాలను దేశీయ కంపెనీలు తయారు చేయగలుగుతున్నాయని వివరించారు.
విద్య, వైద్యానికి పెద్ద పీట
విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలను సామాన్య ప్రజలకు సైతం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు. మెరుగైన వైద్య సేవలను ఆవిష్కరించిన దేశాలు ప్రగతిపథంలో ముందుకు సాగిన విషయాన్ని ప్రస్తావించారు. అందరికీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే విషయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున వినియోగించుకోవలసి ఉందని వివరించారు. ఈ సదస్సులో పాల్గొన్న టీఎస్ఐఐసీ వైస్‌ఛైర్మన్ అండ్ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఫార్మా సిటీ మొదటి దశ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బల్క్ ఔషధాలు, ఏపీఐ (యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇన్‌గ్రేడియంట్స్), ఫార్ములేషన్లు తయారు చేసే సంస్థలతో పాటు ఫార్మా విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, వైద్య ఉపకరణాల తయారీ సంస్థలు ఏర్పాటు చేసేందుకు ఇక్కడ సదుపాయాలు ఉన్నట్లు వివరించారు. ఐఎంటీ-హైదరాబాద్ సారథ్యంలో రూపొందించిన వైద్య, ఔషధ నివేదికను ఈ సదస్సులో ఆవిష్కరించారు. ఐఎంటీ- హైదరాబాద్ డైరెక్టర్ ఫ్రొఫెసర్ ఎం.వెంకటేశ్వర్లు, సీఐఐ- తెలంగాణ ఛైర్మన్ డి.రాజు తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..