
డిసెంబరు మార్కెట్‌పై బ్రోకరేజీ సంస్థల అంచనాలు
ముంబయి: అమెరికా-చైనా త్వరలోనే మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదర్చుకోగలవనే ఆశావాదం, ప్రధాన అంతర్జాతీయ కేంద్ర బ్యాంకుల కఠిన వైఖరి, కేంద్ర ప్రభుత్వ వ్యయాలు, సంస్కరణలు, పెట్టుబడుల ఉపసంహరణ వంటి అంశాలు డిసెంబరులో నిఫీ-50ని జీవన కాల గరిష్ఠాల దిశగా నడిపిస్తాయని పలు బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కోజెన్సిస్ నిర్వహించిన 26 బ్రోకరేజీ సంస్థల సర్వేలో నిఫ్టీ 50 సూచీ సరాసరిన 11,800-12,500 పాయింట్ల మధ్య చలించొచ్చని అంచనాలు వెలవడ్డాయి. ఆయా బ్రోకరేజీ సంస్థలు వెల్లడించిన వివరాలు ప్రకారం..
* డిసెంబరు సిరీస్‌లో నిఫ్టీ 12,200 స్థాయిని దాటే అవకాశం ఉండటంతో పాటు కొత్త జీవన కాల గరిష్ఠాలను తాకే అవకాశం ఉంది. 11,800-11,900 వద్ద బలమైన మద్దతు లభించొచ్చు. అన్ని అనుకూలంగా ఉంటే, నిఫ్టీ ప్రస్తుత స్థాయి నుంచి 4 శాతం లాభపడి 12,500 పాయింట్లకు చేరొచ్చు.
* రిటైల్ రుణ వృద్ధి బలంగా ఉన్నందున.. బ్యాంకులు, వినియోగదారు రంగాలు రాణించే అవకాశం ఉంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, వినియోగదారుల వద్ద నగదు ప్రవాహం పెరగడమే దీనికి కారణం.
* బ్యాంకులతో పాటు టెలికాం, వినియోగదారు ఆధారిత సంస్థలు నిఫ్టీ 50ని ప్రధానంగా ముందుకు నడిపిస్తాయి.
* బలమైన మూలాలు, సమర్థమైన మూలధన నిర్వహణ ఉన్న సంస్థల షేర్లు కొనుగోలు చేసేందుకు సంస్థాగత మదుపర్లు ఆసక్తి చూపిస్తున్నారు. మన దేశంలో తక్కువ వడ్డీ రేట్లు, చిన్న, మధ్య స్థాయి సంస్థల వద్ద అధిక ద్రవ్య లభ్యత ఉండటం కూడా మార్కెట్ సెంటిమెంటును మెరుగుపరిచేదే.
* దేశ జీడీపీ వృద్ధి 26 త్రైమాసికాల కనిష్ఠ స్థాయికి (4.5%) చేరడంతో దాన్ని గాడిలో పెట్టేందుకు ఆర్బీఐ తాజా ద్వైమాసిక పరపతి సమీక్షలో కీలక రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి.
* యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉన్నందున, వర్థమాన దేశాల మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ మదుపర్లు ఆసక్తి చూపించొచ్చు. గత 5 వారాల పెట్టుబడులను పరిశీలిస్తే, విదేశీ సంస్థాగత మదుపర్లు 12 బిలియన్ డాలర్లు (సుమారు రూ.85,000 కోట్లు) వర్థమాన దేశాల ఈక్విటీ మార్కెట్లలోకి చొప్పించారు. ఇందులో భారత్‌లోకి 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.
* 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించబోయే పన్ను రాయితీలు, సంస్కరణల తాలూకూ వార్తలు కూడా మదుపర్లను ప్రభావితం చేస్తాయి.
* నవంబరులో బ్యాంకులు, లోహ కంపెనీలతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు రాణించడంతో నిఫ్టీ 50 సూచీ 1.5 శాతం మేర పెరిగింది. సోమవారం నిఫ్టీ 50 సూచీ 12,048.20 పాయింట్ల వద్ద ముగిసింది. జీవన కాల గరిష్ఠానికి 110 పాయింట్ల దూరంలో ఉంది.