close
పెట్రోలు, డీజిల్‌పై పన్ను కోతలుండవ్‌

కొత్త గనుల కంపెనీలకు 15% కార్పొరేట్‌ పన్ను వర్తించదు
అవి ‘తయారీ’ పరిధిలోకి రావు
పన్ను కోతలతో పెట్టుబడులు, ఉద్యోగాలు
ఆర్థిక మంత్రి సీతారామన్‌
దిల్లీ

పెట్రోలు, డీజిల్‌లపై పన్ను రేట్లను తగ్గించే ఆలోచనమీ లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర పన్నులు పెట్రోలు విక్రయ ధరలో సగం వరకూ ఉండగా.. డీజిల్‌ విషయంలో ఇవి 40% వరకూ ఉన్న సంగతి తెలిసిందే.
మరో వైపు, తక్కువ కార్పొరేట్‌ పన్ను ప్రయోజనాన్ని అందించే కొత్త తయారీ కంపెనీల నిర్వచనం నుంచి ప్రభుత్వం గనులను తొలగించింది. లోక్‌సభలో పన్నుల చట్టాలు(సవరణ) బిల్లు-2019కు ఆమోదం లభించిన నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ ‘భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా కొన్ని కార్యకలాపాలను ‘తయారీ’ కిందకు తీసుకురావడం లేదు. అందులో కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి, పుస్తకాల ప్రింటింగ్‌, గనులు తదితరాలు ఉన్నాయి. వీటికి కొత్త తయారీ కంపెనీలకు అనుమతినిచ్చే తక్కువ పన్ను విధానాన్ని అమలు చేయమ’ని మంత్రి వివరించారు. అదే సమయంలో మార్బుల్‌ బ్లాకులను శ్లాబులుగా మార్చినా; బాటిళ్లలోని గ్యాస్‌ను సిలిండర్‌గా మార్చినా; సినిమాటోగ్రాఫ్‌ ఫిల్మ్‌ను ఉత్పత్తి చేసినా.. కూడా తక్కువ పన్ను రేటు వర్తించదన్నారు.

తాజా పరిణామం నేపథ్యంలో దేశీయ కంపెనీలు ఆదాయ పన్ను చట్టం కింద కొన్ని మినహాయింపులను క్లెయిము చేసుకోని పక్షంలో 22 శాతం పన్నును కట్టేలా కొత్త అవకాశాన్ని ఇస్తున్నారు. అదే సమయంలో అక్టోబరు 1న లేదా ఆ తర్వాత ఏర్పడ్డ కొత్త దేశీయ తయారీ కంపెనీలకు 15 శాతం పన్ను రేటు వర్తిస్తుంది. ఇవి కూడా కొన్ని మినహాయింపులకు క్లెయిము చేసుకోకపోతేనే ఆ పన్ను వర్తిస్తుంది. ఈ ఆర్డినెన్స్‌కు ముందు రూ.400 కోట్ల వరకు వార్షిక టర్నోవరు ఉండే దేశీయ కంపెనీలు 25 శాతం పన్ను రేటు; ఇతర దేశీయ కంపెనీలకు 30 శాతం పన్ను రేటు వర్తించేది. సెప్టెంబరులో కార్పొరేట్‌ పన్నును తగ్గించడానికి ప్రభుత్వం సెప్టెంబరులో ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. దానికి కొన్ని సవరణలతో ఈ బిల్లును ప్రభుత్వం తీసుకొస్తోంది.

కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయ్‌..
కార్పొరేట్‌ పన్ను రేటును తగ్గించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు.. ఉద్యోగాల సృష్టిని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీతారామన్‌ పేర్కొన్నారు. ఇప్పటికే పలు విదేశీ, దేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు ఈ సందర్భంగా అన్నారు. వీటి వల్ల భవిష్యత్‌లో భారత్‌ ఒక తయారీ కేంద్రంగా మారి మరిన్ని ఉద్యోగాలను తీసుకొస్తుందన్నారు. కార్పొరేట్‌ పన్నులో కోత వేయడం వల్ల ఆదాయ వసూళ్లలో రూ.1.45 లక్షల కోట్ల కోత పడుతోంది. అయితే ఏడాది వ్యవధిలోనే అంతకంటే ఎక్కువ నిధులు వచ్చేలా చేస్తుంది.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.