close
కార్వీ కథ కంచికి!

స్టాక్‌ బ్రోకింగ్‌ లైసెన్స్‌ రద్దు
బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ నిర్ణయం

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లైసెన్సును దేశంలోని రెండు ప్రధాన స్టాక్‌ఎక్స్ఛేంజీలు రద్దు చేశాయి. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌ఈ), బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ) ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఎక్స్ఛేంజి నిబంధనలను ఉల్లంఘించినందున కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లైసెన్సు రద్దు చేస్తున్నట్లు సోమవారం ఉదయం ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. ఆ వెంటనే బీఎస్‌ఈ కూడా స్పందించింది. ఎన్‌ఎస్‌ఈ బాటలోనే కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లైసెన్సు రద్దు చేసింది. ఇది వెంటనే అమల్లోకి వచ్చింది. ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ లు తమ ట్రేడింగ్‌ టెర్మినళ్లు కార్వీకి అందుబాటులోకి లేకుండా చర్యలు తీసుకున్నాయి. దీనివల్ల ఈక్విటీ, డెట్‌, కరెన్సీ డెరవేటివ్స్‌, కమాడిటీ విభాగాల్లో కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ ఖాతాదార్లు ఎటువంటి క్రయవిక్రయాలు సాగించలేరు. అయితే డెరివేటివ్‌ విభాగంలో మాత్రం ఇప్పటికే ఉన్న పొజిషన్లును ‘స్క్వేర్‌ ఆఫ్‌’ చేసేందుకు అవకాశం ఉంది. కానీ కొత్త పొజిషన్లు తీసుకోవటం సాధ్యం కాదు.

తొలుత ఈ వ్యవహారంలో సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజీ బోర్డు ఆఫ్‌ ఇండియా) కార్వీపై చర్యలు తీసుకున్న విషయం విదితమే. కొత్త క్లయింట్లను చేర్చుకోరాదని, క్లయింట్ల పీఓఏ (పవర్‌ ఆఫ్‌ అటార్నీ) వినియోగించి డీ-మ్యాట్‌ ఖాతాల నుంచి షేర్ల మార్పిడి కోరరాదని సెబీ నిషేధం విధించిందిన విషయం విదితమే. తదుపరి ఈ సంస్థ వ్యవహారాలపై ఎన్‌ఎస్‌ఈ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేపట్టింది. ఈ బాధ్యతను ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ఇండియాకు అప్పగించింది. ఈ ఆడిట్‌ సంస్థ నుంచి లభించిన ప్రాధమిక సమాచారం ఆధారంగా కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ లైసెన్సు రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ తన 90,000 మంది ఖాతాదార్లకు చెందిన రూ.2,300 కోట్ల విలువైన షేర్లను తనఖా పెట్టి అప్పు చేసినట్లు ఎన్‌ఎస్‌ఈ పరిశీలనలో వెల్లడైనట్లు సమాచారం.

ప్రస్తుత పరిస్థితుల్లో కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ ఖాతాదార్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనక తప్పటం లేదు. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది ఖాతాదార్లు ఉన్నారు. అందులో క్రియాశీలకమైన ఖాతాలు మూడు లక్షలకు పైగా ఉంటాయని అంచనా. ప్రతిరోజూ పాతికవేల మంది కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ నగదు, డెరివేటివ్స్‌, కరెన్సీ, కమొడిటీ విభాగాల్లో క్రయవిక్రయాలు సాగిస్తుంటారు. ఈ కార్యకలాపాలన్నీ నిలిచిపోయినట్లే. ఈ ఖాతాదార్లు ఇతర మార్గాలు చూసుకోవలసిందే. ఇక కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ ముందున్న ప్రత్యామ్నాయం న్యాయపోరాటం సాగించటమే. దానికి ఎంత సమయం పడుతుందనేది చెప్పలేని పరిస్థితి.

పీఓఏ కుదరదు: సెబీ స్పష్టీకరణ
అంతకు ముందు ఖాతాదార్ల తరఫున  పీఓఏ (పవర్‌ ఆఫ్‌ అటార్నీ) వినియోగానికి వీలుకల్పించాలంటూ కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ చేసిన విన్నపాన్ని సెబీ తిరస్కరించింది. పీఓఏ  వినియోగించుకునే అవకాశం లేనందున  ఈక్విటీ షేర్ల డెలివరీలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు, కాబట్టి ఆమేరకు నిషేధాన్ని సడలించాలని కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ శాట్‌ (సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌) ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని శాట్‌, సెబీకి సూచించింది. కానీ పీఓఏ విషయంలో గతంలో తాను ఇచ్చిన ఆదేశాల్లో మార్పు చేసేందుకు సెబీ అంగీకరించలేదు. అదే విషయాన్ని స్పష్టం చేస్తూ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. ‘ పీఓఏ సదుపాయాన్ని వినియోగించుకునే అవకాశం కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌కు ఇవ్వటం సరికాదు, అందువల్ల కార్వీ డీ-మ్యాట్‌ ఖాతాల్లో ఉన్న షేర్లను విక్రయించాలనుకునే వినియోగదార్లు  ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో కానీ, స్వయంగా కానీ డిపాజిటరీ స్లిప్‌ ఇవ్వాలి’ అని సెబీ స్పష్టం చేసింది.

రూ.2,300 కోట్ల షేర్ల తనఖా
ఆ షేర్లన్నీ క్లయింట్ల ఖాతాలకు జమ చేసిన ఎన్‌ఎస్‌డీఎల్‌

కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ వ్యవహారంలో సెబీ చకచకా నిర్ణయాలు తీసుకుంటోంది. ఖాతాదార్లకు సంబంధించిన షేర్లను తనఖా పెట్టి బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ కార్యకలాపాలను నిషేధించటమే కాకుండా ఆ సంస్థ తనఖా పెట్టిన షేర్లను వెనక్కి తీసుకొని ఖాతాదార్ల ఖాతాలకు జమ చేయించింది. సెబీ సూచనల మేరకు ఎన్‌ఎస్‌డీఎల్‌ ఆ షేర్లను ఎవరెవరివో గుర్తించి ఆయా ఖాతాలకు జమ చేసింది. దీనివల్ల 83,000 మంది కార్వీ ఖాతాదార్లకు మేలు జరిగినట్లు అవుతోంది. తద్వారా 90 శాతం మంది ఖాతాదార్లకు నష్టభయం తొలగిపోయింది- అని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ దాదాపు 95,000 మంది ఖాతాదార్లకు చెందిన రూ.2,300 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తనఖా పెట్టి రూ.600 కోట్లు అప్పు చేసినట్లు సెబీ, స్టాక్‌ఎక్స్ఛేంజీల పరిశీలనలో వెల్లడైంది. తన ఖాతాదార్లకు చెందిన  షేర్లను తనఖా పెట్టి అప్పు తీసుకోవటమే కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ ఉన్న ప్రధానమైన ఆరోపణ. ఈ క్రమంలో ఎన్నో నిబంధనలను ఉల్లంఘించినట్లు సెబీ ఆరోపించింది. అందువల్ల తనఖాలో ఉన్న ఖాతాదార్ల షేర్లను మళ్లీ వాళ్లకే అప్పగించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘‘సెబీ సూచనల మేరకు ఎన్‌ఎస్‌ఈ (నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజి ఆఫ్‌ ఇండియా) పర్యవేక్షణలో కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ డీమ్యాట్‌ ఖాతాలో ఉన్న షేర్లను, ఎటువంటి బకాయి లేని  సంబంధిత ఖాతాదార్ల డీమ్యాట్‌ ఖాతాలకు బదిలీ చేశాం. ఇటువంటి ఖాతాదార్లు 82,599 మంది ఉన్నారు’ అని ఎన్‌ఎస్‌డీఎల్‌ ఒక సర్క్యులర్‌లో వివరించింది. ఈ చర్య వల్ల కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ తమ అప్పు తీర్చలేదనే కారణంలో రుణదాతలు ఈ షేర్లను విక్రయించే అవకాశం లేకుండా పోయింది. తద్వారా ఖాతాదార్లకు ఇబ్బంది తప్పిపోయింది. వాటి స్థానంలో కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ ఇప్పుడు ఇతర ‘సెక్యూరిటీ’ని రుణదాతలకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఖాతాదార్లు ఇప్పుడేం చేయాలి!

దేశంలోని అతిపెద్ద స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థల్లో ఒకటైన కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ ఖాతాదార్లకు ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది. తమ ఖాతాల్లో ఉన్న షేర్లను విక్రయించటానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ లైసెన్సును ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ రద్దు చేసిన ఫలితంగా ఆ సంస్థలోని ట్రేడింగ్‌ ఖాతాల ద్వారా షేర్ల విక్రయం సాధ్యం కాదు. ఈ నేపధ్యంలో అక్కడే డీ-మ్యాట్‌ ఖాతాల్లో ఉన్న  షేర్లను ఏం చేయాలి, వాటిని ఎలా విక్రయించాలి, ఎలా సొమ్ము చేసుకోవాలి? అనే సమస్య ఉత్పన్నం అవుతోంది. ఈ పరిస్థితుల్లో కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ ఖాతాదార్ల ముందు ఉన్న మార్గం ఒక్కటే. అది ‘ఆఫ్‌ మార్కెట్‌’ పద్ధతిలో షేర్లను మార్చుకోవటమే. లేదా ఇతర బ్రోకరేజీ సంస్థల వద్ద ఉన్న తమ ట్రేడింగ్‌ ఖాతాల్లో షేర్లు విక్రయంచి ఆ మేరకు కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ డీ-మ్యాట్‌ ఖాతా స్లిప్‌ ద్వారా డెలివరీ ఇచ్చేందుకు కూడా అవకాశం ఉంది. తద్వారా కార్వీ నుంచి షేర్లను బయటకు తెచ్చుకోవచ్చు. అందుకు ఖాతాదార్లు ముందుగా ఏదైనా ఇతర బ్రోకరేజీ సంస్థలో ట్రేడింగ్‌ ఖాతా, డీ-మ్యాట్‌ ఖాతా  తీసుకోవాలి. అదొక్కటే పరిష్కార మార్గంగా ఉంది. ఇదెలా అంటే-
* కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ ఖాతాదార్లు ముందుగా తమకు నచ్చిన ఏదైనా ఇతర స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థలో ఖాతా తెరవాలి. ట్రేడింగ్‌, డీ-మ్యాట్‌ ఖాతాలు తీసుకోవాలి.
* ఆ తర్వాత కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ వద్ద ఉన్న డీ-మ్యాట్‌ ఖాతాలోని షేర్లను ‘ఆఫ్‌-మార్కెట్‌’ పద్ధతిలో కొత్తగా తెరిచిన డీ-మ్యాట్‌ ఖాతాకు బదిలీ చేసుకోవాలి. దీని కోసం ‘డెలివరీ ఇన్‌స్ట్రక్షన్‌’ స్లిప్‌ కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌కు ఇవ్వాలి. దాని మీద ఖాతాదార్లు తమ కొత్త ఖాతా నెంబరు, ఇతర వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలి.
* మూడో రోజుకు కొత్త ఖాతాకు షేర్లు బదిలీ అవుతాయి.
* ఆ తర్వాత  ఆ షేర్లను విక్రయించాలనుకుంటే ఇతర స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థ వద్ద కొత్తగా తెరిచిన ట్రేడింగ్‌ ఖాతాలో విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు.
* ఇప్పటికే వేరే సంస్థలో ట్రేడింగ్‌ ఖాతా ఉన్న వినియోగదార్లు ఆఖాతాకు  కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ వద్ద షేర్లకు సంబంధించిన డీపీ ‘డెలివరీ స్లిప్‌’ ఇచ్చి అక్కడ షేర్లు విక్రయించే వీలు కూడా ఉంది.
* ఏదేమైనా వేరే ఖాతాకు షేర్లను మార్చుకొని అక్కడ లావాదేవీలు నిర్వహించటమే ప్రస్తుతానికి కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ ఖాతాదార్ల ముందు ఇప్పుడు ఉన్న మార్గంగా కనిపిస్తోంది.

బ్యాంకుల అలక్ష్యం ఏమైనా ఉందా?
కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ వ్యవహారంలో సెబీ పరిశీలించే అవకాశం

క్లయింట్ల షేర్లు తనఖా పెట్టి ఇష్టానుసారం అప్పులు చేశారనేది కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌పై వచ్చిన ప్రధానమైన ఆరోపణ. ఇటువంటి షేర్లు తనఖా పెట్టుకొని బ్యాంకులు ఎలా అప్పులు ఇచ్చాయనే అనుమానం సెబీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నట్లు, అందువల్ల ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంకులు నిర్లక్ష్యంగా ఏమైనా వ్యవహరించాయా? అనే కోణంలో పరిశీలన చేపట్టే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ వర్గాల్లో ప్రచారం అవుతోంది. రూ.2,300 కోట్ల విలువైన క్లయింట్ల షేర్లను ఈ సంస్థ తనఖా పెట్టి రూ.600 కోట్లు అప్పు చేసినట్లు ప్రాధమికంగా సెబీ నిర్ణారించిన విషయం విదితమే. ఈ సొమ్ము ఏఏ బ్యాంకులు అందించాయి, ఆ క్రమంలో అవి తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి, ఏమైనా నిబంధనల ఉల్లంఘన జరిగిందా? అనే అంశాలపై ఇప్పుడు దృష్టి సారిస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.