close

ప్రధానాంశాలు

ఇక బాండ్‌ బాజా

బాండ్ల ఈటీఎఫ్‌లకు కేబినెట్‌ ఆమోదం
 ‘భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌’ పేరుతో ఈ నెల్లోనే తొలి ఇష్యూ!

విషయం.. బాండ్ల ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌
ఏమిటిది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసే బాండ్లతో  ఒక సూచీ రూపొందించి ఎక్స్ఛేంజీలో ట్రేడింగ్‌కు వీలు కల్పిస్తారు
ప్రారంభం ఎప్పుడు.. ‘భారత్‌ బాండ్‌’ ఈటీఎఫ్‌ తొలి విడత ఇష్యూ ఈ నెలలో ఉండొచ్చు
కనీస పెట్టుబడి.. రూ.1000
బాండ్ల రేటింగ్‌.. కాలపరిమితి  ‘ఏఏఏ’ రేటింగ్‌తో 3 ఏళ్లు, 10 ఏళ్ల కాలపరిమితి ఉన్న బాండ్లు మాత్రమే ఈటీఎఫ్‌ల్లో ఉండనున్నాయి.
ఇప్పటివరకు ఈక్విటీ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌లు (ఈటీఎఫ్‌) మాత్రమే మనకు సుపరిచితం. ఇక నుంచి డెట్‌ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌లూ అందుబాటులోకి రానున్నాయి. బాండ్ల ఈటీఎఫ్‌ రూపకల్పన, జారీకి బుధవారం కేంద్ర మంత్రి వర్గం (కేబినెట్‌) ఆమోదం తెలిపింది. ‘భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌’ పేరుతో మొదటి విడత ఇష్యూ ఈ నెలల్లోనే ఉండే అవకాశం ఉంది. బాండ్ల మార్కెట్‌ను మరింత విస్తృతం చేసేందుకు, ప్రభుత్వ రంగ సంస్థలకు అదనపు నిధుల వనరును సృష్టించేందుకు బాండ్ల ఈటీఎఫ్‌లు దోహదం చేస్తాయని ప్రధాన నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ సమావేశానంతరం విలేకర్లతో మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు.

చిన్న మదుపర్లకు చేరువగా..
బాండ్లలో పెట్టుబడులకు ఇప్పటికీ చిన్న మదుపర్లు దూరంగా ఉన్నారు. వారిని కూడా బాండ్ల విపణికి చేరువ చేసేందుకు ఈ బాండ్ల ఈటీఎఫ్‌ తోడ్పడనుంది. కనీస పెట్టుబడి రూ.1000 కావడంతో బాండ్లలో రిటైల్‌ మదుపర్ల భాగస్వామ్యం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ పీఎస్‌యూలవి ఉండొచ్చు
జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ), ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ఎన్‌టీపీసీ, ఎగ్జిమ్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ లాంటి కొన్ని పీఎస్‌యూలు జారీ చేసిన బాండ్లు ప్రతిపాదిత ఈటీఎఫ్‌ల్లో ఉండొచ్చు.
ఇదే మొదటిది : భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ దేశంలో మొట్టమొదటి కార్పొరేట్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ కానుంది. ప్రస్తుతమున్న ఈక్విటీ ఈటీఎఫ్‌లకు తోడు బాండ్ల మార్కెట్‌ను విసృత్తం చేసేందుకు బాండ్ల ఈటీఎఫ్‌ను అందుబాటులోకి తేనున్నట్లు బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగానే ఈ బాండ్ల ఈటీఎఫ్‌ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపిందని సీతారామన్‌ చెప్పారు.

ప్రతి ఆరు నెలలకు ఒకటి..
‘భారత్‌ బాండ్‌’ ఈటీఎఫ్‌ కొత్త ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌పీఓ) ఇదే నెలలో ఉండే అవకాశం ఉందని పెట్టుబడుల విభాగం, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ (దీపమ్‌) సెక్రటరీ తుహిన్‌ కాంతా పాండే తెలిపారు. ప్రతి ఆరు నెలలకోసారి ఈటీఎఫ్‌ల ఇష్యూ ఉంటుందని పేర్కొన్నారు.

పీఎస్‌యూలకు నిధుల వనరు
ప్రతిపాదిత బాండ్ల ఈటీఎఫ్‌ను ఎడెల్‌వీజ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహించనుంది. ‘రిటైల్‌ మదుపర్లు సులువుగా బాండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిపాదిత ఈటీఎఫ్‌లు వీలు కల్పిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థలకు అదనపు నిధుల వనరుగా ఉపయోగపడటంతో పాటు రుణ వ్యయాలు తగ్గించేందుకు ఉపయోగపడతాయి. కార్పొరేట్‌ బాండ్ల మార్కెట్లలో నిధుల లభ్యతను పెంచుతుంద’ని ఎడెల్‌వీజ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ సీఈఓ రాధికా గుప్తా తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.