close

ప్రధానాంశాలు

ఈ ఏడాది 5 శాతమే!

అంచనాలను తగ్గించిన ఆర్‌బీఐ
ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష
కీలక రేట్లు యథాతథం
కేంద్ర బ్యాంకు అనూహ్య నిర్ణయం
భవిష్యత్‌లో కోతలుంటాయని సంకేతాలు


కీలక రేట్లలో ప్రతి సారీ ‘యాంత్రికంగా’ కోత విధించలేం. అయితే ఈ రేట్ల కోతను భవిష్యత్‌లో కొనసాగిస్తాం. ముఖ్యంగా బడ్జెట్‌ అనంతరం పరిశీలిస్తాం. అంతక్రితం కోత విధించిన 135 బేసిస్‌ పాయింట్ల ప్రభావాన్ని లెక్కవేసిన అనంతరం నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వం గత నాలుగైదు నెలల్లో తీసుకున్న నిర్ణయాలను(కార్పొరేట్‌ పన్ను కోత, వాహన రంగానికి ఉద్దీపనలు, స్థిరాస్తి రంగానికి నిధి ఏర్పాటు) పరిశీలించాకే ఎమ్‌పీసీ తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థలో కొన్ని సానుకూలతలు కనిపిస్తున్నాయి. అయితే అవి కొనసాగుతాయా లేదా అన్నది ఇపుడే చెప్పలేం. అందువల్లే జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించాం. అయితే ద్రవ్య గణాంకాలపై మేం ఆందోళన చెందడం లేదు.

- శక్తికాంత దాస్‌, ఆర్‌బీఐ గవర్నర్‌

 

 

 

ముంబయి

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. అటు విశ్లేషకులు.. ఇటు బ్యాంకర్లు.. కీలక రేట్లలో కోత ఉంటుందని భావించగా.. యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఓ వైపు ఆర్థిక వ్యవస్థ మందగమనం పాలవుతుండడం.. మరో వైపు ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల మధ్య ఈ అడుగు వేసింది. వృద్ధి రేటు అంచనాల్లో కోత విధించి.. ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని తెలిపింది. ఈ ఏడాది వరుసగా 5 సార్లు కీలక రేట్లలో కోత విధించిన ఆర్‌బీఐ.. ఈసారి ఎటువంటి కోతల జోలికి వెళ్లలేదు. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యులుండే పరపతి విధాన కమిటీ(ఎమ్‌పీసీ) ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 5.15% రివర్స్‌ రెపో రేటును 4.9% వద్ద కొనసాగించింది.

భవిష్యత్‌లో కోతలుంటాయ్‌!
ఆర్‌బీఐ తాజా సమీక్షలో కీలక రేట్లలో మార్పు చేయకున్నా.. భవిష్యత్‌లో మరిన్ని రేట్ల కోతలకు అవకాశం ఉందని శక్తికాంత దాస్‌ తెలిపారు. ఈ ఏడాదిలో ఆర్‌బీఐ కీలక రేట్లను 135 బేసిస్‌ పాయింట్లు తగ్గించగా.. బ్యాంకులు ఇప్పటిదాకా 44 బేసిస్‌ పాయింట్ల మేరే ప్రయోజనాలను రుణ స్వీకర్తలకు బదిలీ చేశాయని అన్నారు. విధాన చర్యల విషయంలో ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య మెరుగైన సహకారం ఉందని చెప్పారు.  అక్టోబరులో టోకు ధరల ద్రవ్యోల్బణం అంచనాల కంటే ఎక్కువగా 4.6 శాతంగా నమోదైంది. అందుకే ద్రవ్యోల్బణ అంచనాల(ద్వితీయార్థానికి)ను 3.5-3.7% నుంచి 4.7-5.1 శాతానికి ఆర్‌బీఐ పెంచింది. దాదాపు ఏడాది తర్వాత తొలిసారిగా ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ మధ్య కాల లక్ష్యమైన 4 శాతం కంటే ఎక్కువగా నమోదైంది. ఉల్లి, టమాటా వంటి కూరగాయల ధరలు పెరగడం ఇందుకు కారణమని ఆర్‌బీఐ వివరించింది. నాలుగో త్రైమాసికంలో ఆహార ద్రవ్యోల్బణం అధికంగానే కొనసాగొచ్చని, టెలికాం ఛార్జీలు కూడా భారమవుతాయని వివరించారు.

బలహీన గిరాకీ వల్లే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలను అంతక్రితం అంచనా అయిన 6.1% నుంచి 5 శాతానికి సవరించింది.  దేశీయంగా గిరాకీ పుంజుకోవడం ఆలస్యమవుతుండడం.. అంతర్జాతీయ ఆర్థిక కార్యకలాపాల్లో మరింత మందగమనం; పెరుగుతున్న అంతర్జాతీయ అనిశ్చితులు ఇందుకు నేపథ్యమని చెప్పాలి.  ‘అక్టోబరులో జరిగిన పరపతి విధాన సమీక్షలో 2019-20 సంవత్సర వృద్ధి రేటును 6.1 శాతంగా అంచనా వేశాం. దానిని 5 శాతానికి తగ్గిస్తున్నాం. అదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్వితీయార్థానికి 4.9-5.5 శాతంగా; 2020-21 ప్రథమార్థంలో 5.9-6.3 శాతానికి సవరిస్తున్నామ’ని ఆర్‌బీఐ తన అయిదో ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో వెల్లడించింది.

ఎన్‌బీఎఫ్‌సీలకు రుణ లభ్యత మెరుగైంది
సమస్యలతో సతమతమవుతున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) రంగాన్ని ఎప్పటికప్పుడు సునిశితంగా గమనిస్తున్నామని శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. ఏ ఒక్క దిగ్గజ ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభంలో చిక్కుకోకూడదన్నది తమ ఉద్దేశమని అన్నారు. నిర్వహణ మెరుగ్గా ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలకు ఇటీవలి నెలల్లో బ్యాంకుల నుంచి రుణ లభ్యత మెరుగైందని పేర్కొన్నారు. అయితే ఎంత మేర అవి రుణాలిచ్చాయో ఆయన వెల్లడించలేదు. 70% మార్కెట్‌ వాటా ఉన్న దిగ్గజ 50 ఎన్‌బీఎఫ్‌సీలపై సెంట్రల్‌ బ్యాంక్‌ పర్యవేక్షణ బృందం దృష్టి పెట్టిందని తెలిపారు. తద్వారా ఆయా సంస్థల్లో బలహీనతలను తెలుసుకోవడమే కాకుండా బలహీన సంస్థలను గుర్తిస్తున్నాయని పేర్కొన్నారు. ఏ ఒక్క సంస్థ సంక్షోభంలో కూరుకుపోతుంటే ఆర్‌బీఐ చూస్తూ ఊరుకోదని తెలిపారు. బ్యాంకుల నుంచి ఎన్‌బీఎఫ్‌సీలకు రుణ లభ్యత పెరిగేందుకు ఆర్‌బీఐ ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందని దాస్‌ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ చర్యలు సత్ఫలితాన్ని ఇచ్చాయని తెలిపారు.

రూ.10,000 లోపు లావాదేవీలకు కొత్త ప్రీపెయిడ్‌ కార్డు
రూ.10,000 లోపు వస్తు, సేవల లావాదేవీల నిమిత్తం కొత్త ప్రీపెయిడ్‌ కార్డును అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ‘దేశంలో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడంలో ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ (పీపీఐ) కీలకపాత్ర పోషిస్తున్నాయి. డిజిటల్‌ వినియోగం మరింత పెరిగేలా కొత్త పీపీఐ తీసుకు రానున్నామ’ని ఆర్‌బీఐ తెలిపింది. ఈ కొత్త పీపీఐను రూ.10,000 లోపు వస్తువులు, సేవల కొనుగోళ్లకు మాత్రమే ఉపయోగించే వీలుంటుందని పేర్కొంది. ఈ తరహా పీపీఐల్లోకి డబ్బులను బ్యాంకు ఖాతా లేదంటే డెబిట్‌/ క్రెడిట్‌ కార్డు ద్వారా నింపుకోవచ్చు. ఆ తర్వాత అందులో జమ అయిన డబ్బులను బిల్లులు కట్టేందుకు విక్రయ కేంద్రాల వస్తువుల కొనుగోళ్ల సమయంలో చెల్లింపులకు వినియోగించవచ్చు. ఈ కొత్త ప్రీపెయిడ్‌ కార్డుకు సంబంధించి మార్గదర్శకాలను, సూచనలను 2019 డిసెంబరు 31 కల్లా ప్రకటిస్తామని ఆర్‌బీఐ పేర్కొంది.

ప్రైవేట్‌ డిజిటల్‌ కరెన్సీలకు అనుమతినివ్వం
ప్రైవేట్‌ డిజిటల్‌ కరెన్సీలకు ఆర్‌బీఐ పూర్తి వ్యతిరేకమని శక్తికాంత దాస్‌ స్పష్టం చేశారు.   వాటిని అనుమతించబోమని తెలిపారు. బిట్‌కాయిన్‌లు, ఇతర క్రిప్టో కరెన్సీలు చట్టవిరుద్ధమని ఏడాదిక్రితం ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో వాటి ట్రేడింగ్‌పై నిషేధం కూడా విధించింది. ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత ఫేస్‌బుక్‌ తన డిజిటల్‌ కరెన్సీ లిబ్రాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే ఉద్దేశంలో ఉన్నట్లు ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నరు తాజాగా స్పష్టతను ఇవ్వడం గమనార్హం.  ‘లక్ష్మీ’ పేరుతో భారత ప్రభుత్వం సొంత డిజిటల్‌ కరెన్సీ తీసుకొస్తోందన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని దాస్‌ స్పష్టం చేశారు తెలిపారు. సాంకేతిక సవాళ్ల రీత్యా ఆర్‌బీఐ ఎప్పుడు డిజిటల్‌ కరెన్సీ తీసుకొని రానుందనే విషయంపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని అన్నారు.

రూపాయి రాణించింది..
భవిష్యత్‌లో రేట్ల కోతలుంటాయని చెబుతూ.. సర్దుబాటు ధోరణిని ఆర్‌బీఐ కొనసాగిస్తున్నట్లు ప్రకటించడంతో రూపాయి రాణించింది. రూపాయి మారకపు విలువ, ఆర్‌బీఐ ప్రకటన అనంతరం కొద్దిగా నష్టపోయింది. అయితే చివరి గంట ట్రేడింగ్‌లో అంతక్రితం రోజు ముగింపుతో పోలిస్తే 24 పైసలు పుంజుకుని డాలరుతో పోలిస్తే 71.29 వద్ద ముగిసింది.


ముఖ్యాంశాలు
* రెపో రేటు మార్పులేకుండా 5.15 శాతం వద్దే
* జీడీపీ వృద్ధి రేటు అంచనా 6.1 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు
* గిరాకీ పరిస్థితులు బలహీనం
* వృద్ధి పుంజుకునేలా చేయడం కోసం ‘సర్దుబాటు’ ధోరణి కొనసాగింపు.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం (అక్టోబరు-మార్చి)లో రిటైల్‌ ద్రవ్యోల్బణ అంచనాలు 5.1-4.7 శాతానికి పెంపు.
* డిసెంబరు 3 నాటికి విదేశీ మారక నిల్వలు 451.7 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. మార్చి 2019 చివరతో పోలిస్తే ఇవి 38.8 బిలియన్‌ డాలర్లు అధికం.
* పరపతి విధాన కమిటీ(ఎమ్‌పీసీ)లోని అందరు సభ్యుల ఓటు రేట్ల యథాతథానికే.
* తదుపరి పరపతి విధాన సమీక్షా సమావేశం ఫిబ్రవరి 4-6, 2020 తేదీల్లో.


ఊహించలేదు

‘పరపతి విధాన నిర్ణయాన్ని మేం ఊహించలేదు. రేట్ల కోత బదలాయింపు ఆలస్యం అవుతుండటాన్ని లెక్కలోకి తీసుకుంటే ప్రస్తుత నిర్ణయం సరైనదే. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాలకు వృద్ధి రేటు అంచనాలను గణనీయంగా తగ్గించడాన్ని చూస్తే ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగానే పుంజుకోవచ్చనే సంకేతాన్ని ఆర్‌బీఐ ఇచ్చింది’

  - రజనీశ్‌ కుమార్‌, ఛైర్మన్‌, ఎస్‌బీఐ

 

 

నిరాశ చెందాం

‘ఇంతకుముందు తగ్గించిన కీలక రేట్ల ప్రయోజనాల బదిలీ పూర్తి స్థాయిలో జరగలేదు. ఇప్పుడు రేట్లను యధాతథంగా ఉంచడంతో నిరాశ చెందాం. వృద్ధి రేట్లను అంచనాలను తగ్గించడం ప్రస్తుత తరుణంలో సరైన నిర్ణయమే. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అన్ని రకాల చర్యలు ప్రభుత్వం చేపట్టాలి’

- సందీప్‌ సోమని, ప్రెసిడెంట్‌, ఫిక్కీ

 

 

2019-20కి వృద్ధి రేటు అంచనాలను ఎమ్‌పీసీ 6.1 శాతం నుంచి 5 శాతానికి సవరించిర విషయాన్ని గమనించాం. భవిష్యత్‌లో కీలక రేట్ల కోతలుంటాయన్న ధోరణి కొనసాగిస్తుండడాన్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్యల ఫలితంగా 2019-20 ద్వితీయార్థంలో అధిక జీడీపీ గణాంకాలు నమోదవుతాయన్న విశ్వాసంతో ఉన్నాం.

- ఆర్థిక శాఖ ట్వీట్‌

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.