close

ప్రధానాంశాలు

ఉల్లి చేతిలో వడ్డీ రేట్లు!

బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ అంచనా
దిల్లీ

ఉల్లి ఘాటు మామూలుగా లేదు.
కోయకుండానే కళ్ల వెంట నీరు తెప్పిస్తోంది.
సామాన్యులేమో క్యూలో నిలబడలేక..
రాజకీయ నాయకులేమో ప్రజలకు సమాధానం చెప్పలేక..
అందరూ అవస్థలు పడుతున్నారు.
విచిత్రం ఏమిటంటే వడ్డీ రేట్లూ దీనిపైనే ఆధారపడి ఉన్నాయ్‌.
ఘాటు తగ్గితే తప్ప.. ఆర్‌బీఐ రేట్ల కోతకు వెళ్లకపోవచ్చు.
చూద్దాం.. ఉల్లి ధర ఎటువెళుతుందో.. రేట్ల కోత
జరుగుతుందో లేదో!!!

తదుపరి జరిగే ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్షలో రేట్ల కోత ఉంటుందా? ఉండదా? అన్న అంశం ఉల్లి ధరలపై ఆధారపడి ఉంటుందని అమెరికా బ్రోకరేజీ సంస్థ ఒకటి అంటోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లి ధరలపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల కిలో ఉల్లి పాయల ధర రూ.200 వరకు చేరి.. వినియోగదార్లను ఇబ్బంది పెడుతోంది. గత వారం జరిగిన పరపతి సమీక్షలో కీలక రేట్లలో ఆర్‌బీఐ కోత విధిస్తుందని అందరూ అంచనా వేశారు. వరుసగా ఆరో సారీ తగ్గించి.. ఆరేళ్ల కనిష్ఠానికి చేరిన వృద్ధికి ఊతమిస్తుందనుకున్నారు. అయితే అలా జరగలేదు. కానీ భవిష్యత్‌లో కోతలుంటాయన్న సంకేతాలను ఆర్‌బీఐ ఇచ్చింది.

ఫిబ్రవరి.. ఏప్రిల్‌.. అక్టోబరు.. ఎప్పుడు?
రేట్ల కోతకు సానుకూలంగానే ఉన్నప్పటికీ.. గణాంకాల కోసం వేచిచూస్తామని గత సమీక్ష సమయంలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. ఒక వేళ వాస్తవ రెపో రేటు(రెపో రేటు-ద్రవ్యోల్బణం) ప్రతికూలానికి వెళితే ఆర్‌బీఐ ఈ సారి రేట్ల కోతకు మొగ్గుచూపకపోవచ్చు. ఏప్రిల్‌ వరకూ ఆగాల్సి రావొచ్చు. ఒక వేళ ద్రవ్యోల్బణం 4 శాతానికి రావాలని పరపతి విధాన కమిటీ(ఎమ్‌పీసీ) భావిస్తే మాత్రం ఇక అక్టోబరు వరకు ఆగకతప్పదని ఆ బ్రోకరేజీ గట్టిగా చెబుతోంది.

ఎంత తగ్గితే.. ఎంతకు ద్రవ్యోల్బణం
ఇక ప్రస్తుత పరిస్థితుల విషయానికొస్తే.. వచ్చే సమీక్షలో రేట్ల కోత అంశం ఉల్లి ధరల చేతిలో ఉందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ మంగళవారం తన నివేదికలో అంచనా వేసింది. ‘గతేడాది డిసెంబరుతో పోలిస్తే ఉల్లి ధరలు 371 శాతం పెరిగాయి. నవంబరులో 177 శాతం మేర వృద్ధి చెందాయి. ఒక వేళ డిసెంబరులో కిలో ఉల్లి ధర రూ.60కు; ఆ తర్వాత జనవరిలో రూ.40కి చేరితే.. ద్రవ్యోల్బణం ఆయా నెలల్లో వరుసగా 5.9 శాతం; 5.4 శాతానికి చేరొచ్చు. ఒక వేళ ఉల్లి ధరలో జనవరిలో రూ.60గా పలికితే మాత్రం.. ఆ నెలలో ద్రవ్యోల్బణం 6.1 శాతంగా నమోదు కావొచ్చని ఆ నివేదిక అంచనా వేసింది.


ఎప్పుడు కోత విధిస్తే మేలు

ఫిబ్రవరిలో కోత విధిస్తే అది సీజను కాబట్టి ఉపయోగపడుతుందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ అంటోంది. ఏప్రిల్‌లో కోత విధిస్తే అది అంతగా ఉపయోగపడకపోవచ్చని అభిప్రాయపడుతోంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.