close

ప్రధానాంశాలు

పందెం కోడి రిలయన్స్‌

రికార్డు స్థాయి నికర లాభం
రూ.11,640 కోట్లుగా నమోదు
ప్రైవేటు కంపెనీల్లో ఘనత
రిటైల్‌, టెలికాం వృద్ధే కారణం
దిల్లీ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మళ్లీ గర్జించింది. రికార్డు లాభాలు నమోదు చేసింది. రిటైల్‌, టెలికాం విభాగాలు రాణించడంతో 2019 డిసెంబరు త్రైమాసికంలో రూ.11,640 కోట్ల రికార్డు నికర లాభాన్ని నమోదు చేసింది. ప్రైవేటు కంపెనీల్లో ఏ సంస్థా ఇప్పటిదాకా ఇంతటి లాభం ప్రకటించలేదు. వినియోగదారు వ్యాపారాలైన రిటైల్‌, టెలికాం విభాగాలు రాణించడానికి తోడు.. చమురు రిఫైనింగ్‌ వ్యాపారం పుంజుకోవడం ఇందుకు దోహదం చేసింది. పెట్రో రసాయనాల లాభదాయకత తగ్గినా.. ఈ విభాగాలు వృద్ధి చెందడంతో లాభాలకు ఢోకా లేకుండా పోయింది. 2018-19 ఇదే కాలంలో ఏకీకృత నికర లాభం రూ.10,251 కోట్లుగా నమోదైంది. ప్రస్తుతం నికర లాభం 13.5 శాతం పెరిగినట్లైయింది.


తన రికార్డులు తానే బద్దలు కొట్టి

దేశంలోనే ప్రైవేటు కంపెనీ నమోదు చేసిన అత్యధిక త్రైమాసిక నికర లాభం ఏదైనా ఉందంటే.. అది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 2019 జులై-సెప్టెంబరులో నమోదు చేసిన రూ.11,262 కోట్లే. ఇపుడు తన రికార్డును తానే బద్దలు కొట్టింది. ప్రభుత్వ రంగంలో అయితే ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ 2013 జనవరి-మార్చి త్రైమాసికంలో నమోదు చేసిన రూ.14,512.81 కోట్ల లాభమే ఇప్పటికీ దేశీయంగా రికార్డుగా ఉంది.
పెట్రో రసాయన వ్యాపారాల్లో సౌదీ ఆరామ్‌కోకు 20% వాటా విక్రయ ప్రక్రియ మార్చిలోపు పూర్తికాకపోవచ్చని  సీఎఫ్‌ఓ శ్రీకాంత్‌ తెలిపారు.


ఆదాయం కాస్త తగ్గి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం మాత్రం 1.4 శాతం మేర తగ్గి రూ.1,68,858 కోట్లుగా నమోదైంది. చమురు రిఫైనింగ్‌ మార్జిన్లు ఆరు త్రైమాసికాల క్షీణత తర్వాత తొలిసారిగా పెరగడం గమనార్హం.


చమురు పర్వాలేదు

చమురు రిఫైనింగ్‌ వ్యాపారం 12% పెరిగి రూ.5,657 కోట్లకు చేరింది. బ్యారెల్‌ చమురుపై సంస్థ 9.2 డాలర్లు సంపాదించింది. 2018 అక్టోబరు-డిసెంబరులో ఈ స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌(జీఆర్‌ఎమ్‌) 8.8 డాలర్లుగానే ఉంది.


రిటైల్‌, టెలికాం.. గణగణ

రిటైల్‌, టెలికాం వ్యాపారాలు పన్నుకు ముందు లాభం విషయంలో రికార్డు సృష్టించాయి. కంపెనీ ఎబిటాలో దాదాపు 40 శాతం దీనిదే. అంతక్రితం ఏడాది వీటి వాటా 25 శాతంగా ఉంది.
రిటైల్‌ స్టోర్లు రెండో త్రైమాసికం చివరికి 10,901గా ఉండగా.. డిసెంబరు ఆఖరుకు 11,316కు పెరిగాయి. 17.6 కోట్ల మంది ఈ విక్రయశాలను సందర్శించారు. 2018-19తో పోలిస్తే 42.6% ఎక్కువ ఇది. దీంతో రిటైల్‌ విభాగంలో 58% వృద్ధితో రూ.2,389 కోట్ల పన్నుకు ముందు లాభం; 27% వృద్ధితో రూ.45,327 కోట్ల ఆదాయం నమోదయ్యాయి.
టెలికాం విభాగమైన రిలయన్స్‌ జియో స్టాండలోన్‌ లాభం ఏకంగా  62.5 శాతం వృద్ధితో రూ.1,350 కోట్లకు; ఆదాయం 28.3% పెరిగి రూ.13,968 కోట్లకు చేరాయి. వినియోగదార్ల సంఖ్య 37 కోట్లకు పెరగడం ఇందుకు నేపథ్యం. వినియోగదారు వారీగా నెలకు సగటున  రూ.128.4 ఆదాయం లభించింది. అంతక్రితం త్రైమాసికంలో ఇది రూ.120గా ఉంది. 2018-19 తొలి త్రైమాసికంలో రూ.134.3గా నమోదైన తర్వాత, మళ్లీ ఇప్పుడే వృద్ధి నమోదైంది. అదే సమయంలో ఎబిటా కూడా తొలిసారిగా రూ.5,600 కోట్లను అధిగమించింది. డేటా ట్రాఫిక్‌ 40%; వాయిస్‌ వృద్ధి 30% నమోదు కావడం ఇందుకు కారణం.


పెట్రోరసాయనాలు డీలా

పెట్రో రసాయనాల వ్యాపారం మాత్రం కాస్త దిగాలు పడింది. 9.9 మిలియన్‌ టన్నుల రికార్డు ఉత్పత్తి నమోదైనా.. ధరలు తగ్గడంతో పన్నుకు ముందు లాభం 28.5 శాతం తగ్గి రూ.5,880 కోట్లకు పరిమితమైంది.


అప్పులు, నగదు.. పెరిగాయ్‌

డిసెంబరు 31, 2019 చివరి నాటికి రిలయన్స్‌ మొత్తం రుణాలు రూ.3,06,851 కోట్లకు చేరాయి. సెప్టెంబరు 30, 2019 చివరికి అవి రూ.2,91,982 కోట్లుగానే ఉన్నాయి. కాగా, నగదు నిల్వలు మాత్రం రూ.1,34,746 కోట్ల నుంచి రూ.1,53,719 కోట్లకు పెరిగాయి.

శుక్రవారం బీఎస్‌ఈలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ధర 2.79% లాభంతో రూ.1580.65 వద్ద స్థిరపడింది.
(ఫలితాలు మార్కెట్‌ ముగిసిన అనంతరం వెలువడ్డాయి)


అంతర్జాతీయ ఆర్థిక వాతావారణ బలహీనతలు మా ఇంధన వ్యాపారంపై పనిచేశాయి. వర్థమాన విపణుల్లో ఊగిసలాటలకు తోడు.. గిరాకీ స్తబ్దుగా ఉండడం వల్ల బలహీన మార్జిన్లు నమోదయ్యాయి. వినియోగదారు వ్యాపారాలు మాత్రం ప్రతి త్రైమాసికం కొత్త మైలురాళ్లను అందుకుంటున్నాయి. రిటైల్‌ విక్రయ వృద్ధి స్థిరంగా కనిపిస్తోంది. జియో తన వినియోగదార్లకు అందుబాటు ధరల్లో అద్భుత డిజిటల్‌ సేవలు అందిస్తోంది.

- ముకేశ్‌ అంబానీ, సీఎండీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.