close

ప్రధానాంశాలు

41,800 దగ్గర మద్దతు!

సమీక్ష : దేశీయ పరిణామాలు, అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో గత వారం మార్కెట్లు లాభాలతో ముగిశాయి. కంపెనీల ఫలితాలు అంచనాలకు మించి నమోదుకావడం సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. త్రైమాసిక ఫలితాలు, కార్పొరేట్‌ వార్తలతో షేరు, రంగాల ఆధారిత కొనుగోళ్లు చోటుచేసుకున్నాయి. దేశీయంగా చూస్తే.. నవంబరులో పారిశ్రామికోత్పత్తి 1.8 శాతానికి మెరుగుపడింది. డిసెంబరులో రిటైల్‌ ద్రవ్యోల్బణం అయిదున్నరేళ్ల గరిష్ఠానికి చేరింది. టోకు ద్రవ్యోల్బణం సైతం 2.59 శాతానికి ఎగబాకింది. దీంతో సమీపకాలంలో ఆర్‌బీఐ రేట్ల కోతకు అవకాశాలు సన్నగిల్లాయి. రూ.1.47 లక్షల కోట్ల బకాయిల చెల్లింపు ఆదేశాలను సమీక్షించాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో టెలికాం, బ్యాంకింగ్‌ షేర్లు కుదేలయ్యాయి. అంతర్జాతీయంగా చూస్తే.. 18 నెలల వాణిజ్య ఉద్రిక్తతలకు అడ్డుకట్ట వేస్తూ, అమెరికా- చైనా మొదటి దశ ఒప్పందంపై సంతకాలు చేశాయి. 2020లో ఇంధన గిరాకీ పెరుగుతుందన్న అంచనాలతో చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 0.8 శాతం లాభంతో 41,945 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 0.8 శాతం పెరిగి 12,352 పాయింట్ల దగ్గర స్థిరపడింది. స్థిరాస్తి, మన్నికైన వినిమయ వస్తువులు, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు రాణించగా, బ్యాంకింగ్‌, యంత్ర పరికరాలు, లోహ స్క్రిప్‌లు డీలాపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.11 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేయగా, డీఐఐలు, ఫండ్ల అమ్మకాలు రూ.1928 కోట్లుగా నమోదయ్యాయి. ఈ నెలలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు రూ.1,288 కోట్ల పెట్టుబడులు పెట్టారు.  
లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 7:5గా నమోదు కావడం.. ఎంపిక చేసిన మధ్య, చిన్న షేర్లలో కొనుగోళ్లను సూచిస్తోంది.
ఈవారంపై అంచనా
గత వారం 41,800 పాయింట్ల స్థాయిని నిలబెట్టుకున్న సెన్సెక్స్‌.. అదే జోరు కొనసాగిస్తూ 42064 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్‌ 41,800 పాయింట్ల ఎగువన ఉన్నంత వరకు లాభాలు కొనసాగొచ్చు. ఒకవేళ ఈ స్థాయి దిగువకు చేరితే.. 40,800- 41,000 పాయింట్ల వరకు దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది. సమీపకాలంలో ఒడుదొడుకులు పెరగడానికి అవకాశం ఉంది.
ప్రభావిత అంశాలు
అంతర్జాతీయ సంకేతాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాలు, బడ్జెట్‌ సంస్కరణలపై ఆశలు ఈ వారం మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. రాబోయే వారాల్లో కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలు కీలకం కానున్నాయి. ఈ వారం ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌, ఎల్‌ అండ్‌ టీ, కోటక్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, హావెల్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఫలితాలు వెలువరించనున్నాయి. ఈ నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు చోటుచేసుకోవచ్చు. 23న ఏజీఆర్‌ బకాయిల చెల్లింపునకు గడువు కావడంతో.. దీంతో సంబంధం ఉన్న టెలికాం, ఇతర కంపెనీల షేర్లు వెలుగులోకి రావొచ్చు. టెలికాం సంస్థలకు రుణాలు ఇచ్చిన బ్యాంకులపై సైతం మదుపర్లు దృష్టి పెట్టొచ్చు. ముడిచమురు ధరలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐల పెట్టుబడుల ధోరణి వంటి వాటి నుంచి మదుపర్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. సమీపకాలంలో సూచీల ‘ముందస్తు బడ్జెట్‌ పరుగు’ కొనసాగొచ్చు. అయితే స్థిరీకరణకు సైతం కొంత అవకాశం ఉంది. అంతర్జాతీయంగా చూస్తే.. కార్పొరేట్‌ ఫలితాలు, ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలు, ఈసీబీ పరపతి సమీక్ష కీలకం కానున్నాయి. మదుపర్లు వీటిపై ఓ కన్నేయొచ్చు.
తక్షణ మద్దతు స్థాయిలు: 41,447, 41,175, 40,866; నిరోధ స్థాయిలు: 42,250, 42,620, 43,000
మార్కెట్‌కు 41,800 పాయింట్ల వద్ద మద్దతు లభించే అవకాశం ఉంది.

- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.