close

ప్రధానాంశాలు

వచ్చే దశాబ్దం భారతదేశానిదే..

ఇక్కడ సంపద శరవేగంగా పెరుగుతోంది
పెట్టుబడి అవకాశాలు విస్తరిస్తున్నాయి
టెక్నాలజీ, వినియోగం.. ఆకర్షణీయమైన రంగాలు
‘ప్రైవేటు వెల్త్‌ మేనేజ్‌మెంట్‌’ విభాగంలో మంచి అవకాశాలు
ఈనాడు’ ఇంటర్వ్యూ
బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా- మెరిల్‌ లించ్‌ ప్రైవేట్‌ వెల్త్‌ ఎండీ రాజ్‌ శర్మ

బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా- మెరిల్‌ లించ్‌లో ప్రైవేట్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం ఎండీ రాజ్‌ శర్మ మన హైదరాబాద్‌ వాస్తవ్యుడే. నిజాం కాలేజీలో చదువుకున్న ఆయన ఆకాశవాణిలో వ్యాఖ్యాతగా ఉద్యోగ ప్రస్తానాన్ని ప్రారంభించారు. ఇదేం ఉద్యోగం, ఇలాగైతే గ్రోత్‌ ఏముంటుంది, నీవు ఎంబీఏ చేస్తే మేలు- అని వైద్యుడైన తండ్రి సూచన మేరకు ఆసక్తి లేకపోయినా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేరారు.  ఆ కోర్సు పూర్తయ్యాక భవిష్యత్తును వెతుక్కుంటూ అమెరికాలోని బోస్టన్‌ వెళ్లి ఎమర్సన్‌ కాలేజీలో ఎంఎస్‌ మాస్‌ కమ్యునికేషన్‌  ప్రోగ్రామ్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆర్థిక సేవల విభాగంలోకి అడుగుపెట్టి విశేషమైన పేరు సంపాదించారు.  వ్యక్తిగత సంపద నిర్వహణ (ప్రైవేట్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌) విభాగంలో ఆయనకు ఎంత గుర్తింపు ఉందంటే... మెరిల్‌ లించ్‌లో ప్రత్యేకంగా ‘ద శర్మ గ్రూప్‌’ అని ఆయన పేరుతో ఒక వ్యక్తిగత సంపద సలహాదార్ల విభాగాన్ని ఏర్పాటు చేసింది. పెట్టుబడుల నిర్వహణ, ఆర్థికవ్యవస్థల తీరుతెన్నులు, స్టాక్‌మార్కెట్‌ వ్యవహారాలు, సవాళ్లు- అవకాశాలపై ఎంతో అనుభవం ఉన్న ఆయన... అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, ముఖ్యంగా మనదేశంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉందని విశ్వసిస్తున్నారు. ‘‘నేను నా క్లయింట్ల సొమ్ములో 30 శాతాన్ని యూఎస్‌వెలుపల పెట్టుబడి పెడుతున్నాను, అందులో అత్యధిక భాగం భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు కేటాయిస్తున్నామ’ని అని ‘ఈనాడు’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ విశేషాలు..

? మీరు ఎన్నేళ్లకోసారి ఇక్కడకు వస్తుంటారు, ఇక్కడ ఎటువంటి మార్పులను గమనిస్తారు
నాలుగైదేళ్లకోసారి ఇక్కడకు వచ్చేందుకు ఏదో ఒక సందర్భం దొరుకుతుంది. వచ్చినప్పుడు...హైదరాబాద్‌, ముంబయి తప్పనిసరిగా సందర్శిస్తా. ఇక్కడ మౌలిక సదుపాయాల విస్తరణ, ఆర్థికాభివృద్ధి... నాకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. హైదరాబాద్‌ వంటి నగరాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఇక్కడకు వచ్చి చూసినప్పుడు...భారత ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదార్లకు ఎంతో మంచి అవకాశాలు కల్పిస్తుందనే నమ్మకం నాకు కలుగుతోంది.

? మీరు ధనికులకు సంపద సలహాలు ఇస్తుంటారు కదా..., వారి ఆలోచనా ధోరణి అక్కడా, ఇక్కడ ఎలా ఉంటుందో చెప్పగలరా
స్పష్టమైన తేడా ఉంది. అమెరికాలో 1 మిలియన్‌ డాలర్ల సంపదను మించిన వ్యక్తులు నిపుణులైన ‘ప్రైవేట్‌ వెల్త్‌ అడ్వైజర్‌’ సేవలు అవసరమని భావిస్తారు. పైగా తమ పెట్టుబడులు అమెరికాలోనే క్షేమకరమని, అమెరికా వెలుపల రిస్కు అధికమని అనుకుంటారు. భారతదేశంలోని ధనికులు దీనికి భిన్నంగా... ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ అవకాశాలు ఉంటే, అక్కడ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తారు.

? కానీ ‘ప్రైవేటు వెల్త్‌ మేనేజ్‌మెంట్‌’ విభాగం అమెరికాలో విస్తరించినట్లుగా ఇక్కడ విస్తరించలేదు, ఇక్కడ ‘వెల్త్‌ అడ్వైజర్‌’ సేవలు తప్పనిసరి... అనుకోవటం అరుదుగా కనిపిస్తుంది...
ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. వృద్ధి రేటు పెరిగి భారతదేశ ఆర్థిక వ్యవస్థ పెద్దది అయితే వ్యక్తుల సంపద పెరుగుతుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం ప్రతి పది- పన్నెండేళ్లకు ఆర్థిక వ్యవస్థ రెట్టింపు అవుతుంది. అప్పుడు ధనికుల సంఖ్య పెరిగి ‘సలహాదార్ల’ సేవలకు గిరాకీ లభిస్తుంది. అందువల్ల భవిష్యత్తుల్లో ఇక్కడ ‘ప్రైవేటు వెల్త్‌ మేనేజ్‌మెంట్‌’ విభాగం బహుముఖంగా విస్తరిందనటంలో ఎటువంటి సందేహం లేదు.

? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది... ఎక్కడ మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి
ఐరోపా దేశాల్లో పెద్దగా వృద్ధి లేదు. యూఎస్‌లో 1.7- 2 శాతాన్ని మించి వార్షిక వృద్ధి ఉండకపోవచ్చు. ఆసియా దేశాల్లో ప్రస్తుతం ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక్కడ 5-6 శాతం వృద్ది కనిపిస్తోంది. ముఖ్యంగా భారత్‌, చైనా..., ఆసియా దేశాలకు దిక్చూచి మాదిరిగా వ్యవహరిస్తున్నాయి. తక్కువ ద్రవ్యోల్బణం, తక్కువ వడ్డీరేట్లతో ప్రస్తుతం భారతదేశం పెట్టుబడులకు ఎంతో అనుకూలంగా ఉందని చెప్పవచ్చు.
వచ్చే దశాబ్దం భారతదేశానిదే. జీడీపీ వృద్ధి రేటు సగటున 6 శాతం నమోదైనా...  భారత ఆర్థిక వ్యవస్థ ప్రతి 12 ఏళ్ల కాలానికి రెట్టింపు అవుతుంది.  దీనివల్ల ఎంతో సంపద లభిస్తుంది. పెట్టుబడులపై ఆకర్షణీయమైన ప్రతిఫలం లభిస్తుంది. అదే సమయంలో ‘సంపద నిర్వహణ సేవలు’ బహుముఖంగా విస్తరిస్తాయి.

? ఇక్కడ స్టాక్‌మార్కెట్ల సూచీలు గరిష్ఠ స్థాయిల్లో ఉన్నాయి కదా. అయినా ఈక్విటీ పెట్టుబడులు పెట్టవచ్చా
ఈక్విటీ షేర్లు అధిక ధరలు పలుకుతున్న విషయం వాస్తవమే. అయినప్పటికీ ఇంకా వృద్ధి అవకాశాలు ఉన్నాయి. దేశీయ స్టాక్‌మార్కెట్లలో మంచి ప్రతిఫలాన్ని సంపాదించవచ్చు. ముఖ్యంగా విదేశీ మదుపరులకు  భారత స్టాక్‌మార్కెట్లలో పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జించే అవకాశం అధికంగా కనిపిస్తోంది.

? ఏఏ రంగాల్లో పెట్టుబడి ఆకర్షణీయంగా కనిపిస్తోంది...
భారతదేశంలో సాంకేతిక పరిజ్ఞానం, వినియోగం... పెట్టుబడులకు ఆకర్షణీయమైన రంగాలని చెప్పగలను. సాంకేతిక నైపుణ్యం ఈరోజు ఫలానా విభాగం అని కాకుండా, అన్నింటినీ ప్రభావితం చేస్తోంది. కృత్రిమ మేథస్సు (ఏఐ), 3డీ ప్రింటింగ్‌, అనలిటిక్స్‌... వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానం అన్ని విభాగాల్లోకీ చొచ్చుకుపోతోంది. ఇటువంటి నూతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత వ్యాపార విభాగంలో ఉన్న కంపెనీలను పరిశీలించవచ్చు. భారతదేశంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ. ఇతర టెక్నాలజీ విభాగాల్లోని కంపెనీలు ఆవిష్కరణకు బదులు, సేవలు అందించటానికే ప్రధానంగా పరిమితమై ఉన్న విషయాన్ని పరిగణ లోకి తీసుకోవాలి. కేవలం సేవలకు మాత్రమే పరిమితం కాకుండా పరిశోధన- ఆవిష్కరణ వైపు ఇక్కడి కంపెనీలు మొగ్గుచూపాలి. అందులో భాగంగా పరిశోధనా రంగంలో పెట్టుబడులు పెంచాలి. అప్పుడు కొత్త అవకాశాలు అందివస్తాయి. అదేవిధంగా అధిక జనాభా ఉన్న దేశం కాబట్టి వినియోగం ఎంతో ఎక్కువ. అందువల్ల వినియోగ వస్తువులు విక్రయించే కంపెనీలపై పెట్టుబడి మంచి ప్రతిఫలాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది.

? కానీ పరిశోధనలకు అధిక మొత్తాలు కేటాయించలేని పరిస్థితి ఇక్కడ ఉంది కదా...
నూతన ఆవిష్కరణలతోనే సంపద సృష్టి సాధ్యం. ఉదాహరణకు అమెరికాలోని బోస్టన్‌ చిన్న పట్టణం. పది- పదిహేను లక్షల జనాభా ఉంటుందేమో. కానీ అక్కడ ఏంజెల్‌ ఇన్వెస్టర్లు, ప్రైవేట్‌ ఈక్విటీ పెట్టుబడి సంస్థల సంఖ్య ఎంతో ఎక్కువ. ఇటువంటి సంస్థలు వందల్లో ఉన్నాయి. శాస్త్రవేత్తలు, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు నిధులు ఇచ్చేందుకు ఈ సంస్థలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఇటువంటి పరిస్థితులు భారతదేశంలోనూ రావాలి. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి ఉండదు.

? పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి మీరు ఎటువంటి సలహా ఇస్తారు
నేను నా క్లయింట్లకు ఎప్పుడూ చెబుతూ ఉంటాను. కనీసం అయిదేళ్ల నుంచి పదేళ్ల కాలానికి సిద్ధపడితేనే స్టాక్‌మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావాలని. ఇప్పటికీ నా అభిప్రాయం అదే. స్వల్పకాలంలో సాధించేదీ ఉండదు. నిత్యం మార్కెట్లో ట్రేడింగ్‌ చేసినా కూడా లాభాలు అంతగా రాకపోగా, నష్టభయం అధికంగా ఉంది. అందువల్ల నిపుణుల సలహాతో దీర్ఘకాలిక పెట్టుబడితో లాభాలు ఆర్జించేందుకు ప్రయత్నించాలి.

- ఈనాడు హైదరాబాద్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.