close

ప్రధానాంశాలు

2040కి రూ.20 లక్షల కోట్ల స్థాయికి

మన కోడి-పాడి పరిశ్రమల విపణి

అందుకే ఎగుమతులపై అమెరికా సహా విదేశాల దృష్టి

వారి ఒత్తిడికి తలొగ్గితే మన రైతులకు మరణశాసనమే

అంతర్జాతీయ ఎగ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ సురేష్‌రాయుడు చిట్టూరి

‘దేశీయంగా కోళ్ల పరిశ్రమ రూ.1.25 లక్షల కోట్ల స్థాయిలో, పాడి పరిశ్రమ రూ.3 లక్షల కోట్ల స్థాయిలో ఉన్నాయి. పెరుగుతున్న జీవన ప్రమాణాల వల్ల 2040 నాటికి ఈ పరిశ్రమలు సంయుక్తంగా రూ.15-20 లక్షల కోట్ల స్థాయికి చేరతాయి. అందుకే అమెరికా సహా భిన్న దేశాలు తమ ఉత్పత్తులను భారత్‌కు ఎగుమతి చేసే అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వారి ఒత్తిడికి తలొగ్గకుండా, దేశీయ పరిశ్రమను కాపాడుకుంటే, గ్రామీణ ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది’ అని  కోళ్ల పరిశ్రమ రంగ నిపుణుడు, అంతర్జాతీయ ఎగ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌  సురేష్‌రాయుడు చిట్టూరి చెప్పారు. అమెరికా అధ్యక్షుడి పర్యటనపై ఎందుకు రైతులు ఆందోళన చెందుతున్నారనే అంశాలను ‘ఈనాడు-ఈటీవీ’ ముఖాముఖిలో చిట్టూరి వివరించారు.

అమెరికా కోళ్ల, పాడి ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గించి, మన దేశంలోకి స్వేచ్ఛగా అనుమతి ఇస్తే మన రైతులపై ప్రభావం.. ?
చిట్టూరి: అమెరికా నుంచి దిగుమతి అయ్యే కోడి కాళ్ల (లెగ్‌ పీసెస్‌)పై దిగుమతి సుంకాన్ని మరింత తగ్గించినా, పాడిపరిశ్రమలోకి అమెరికా ఉత్పత్తులను అనుమతించినా దేశ వ్యవసాయ రంగానికే మరణ శాసనమవుతుంది. దేశీయంగా తలసరి కోడిగుడ్ల వినియోగం ఏడాదికి 74 అయితే,  కోడిమాంసం 4 కిలోలు. కోడిగుడ్డు తలసరి వినియోగం ఒక్కటి పెరిగితే 50,000 మందికి, కోడిమాంసం తలసరి వినిమయం 50 గ్రాములు పెరిగితే మరో 25,000 మందికి ఉపాధి లభిస్తుంది. కోళ్ల దాణాకు అధికంగా వాడే మొక్కజొన్న దిగుబడి మనదేశంలో ఎకరాకు సగటున 2 టన్నులైతే, అమెరికాలో 5-6 టన్నులుంది. సోయా అయితే మనదేశంలో ఎకరాకు టన్ను చొప్పున పండితే, అర్జెంటీనలో 3.5 టన్నుల మేర దిగుబడి వస్తోంది. దిగుబడి తక్కువగా ఉన్నందునే, దేశీయంగా లక్ష కోళ్ల పెంపకానికి 15 ఎకరాల పంట అవసరమవుతోంది. దేశీయంగా మొక్క జొన్న పంటకు టన్ను కనీస మద్దతు ధర రూ.18 వేలు. మన కోడిరైతు ఇంత పెట్టి కొనాలి. అదే అమెరికాలోని కోడిరైతుకు మొక్క జొన్న టన్ను రూ.10500కే లభిస్తోంది. సోయా టన్ను అమెరికాలో రూ.24వేలు కాగా, మనదేశంలో రూ.40 వేలు. అమెరికా స్థాయి ధరల్లోనే మొక్కజొన్న, సోయా మన కోడి రైతులకు లభిస్తే, అమెరికా కోళ్ల పరిశ్రమ మూతబడాల్సిందే. అమెరికా, బ్రెజిల్‌, ఇతర దేశాల నుంచి జన్యు మార్పిడి ఉత్పత్తులను అనుమతించని మన కేంద్రప్రభుత్వం, ఆ పదార్థాలు తిన్న కోళ్లను ఎలా అనుమతిస్తుందో చూడాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన రైతుల ప్రయోజనాల కోసం చూస్తున్నట్లే,. మన ప్రభుత్వాలు ఇక్కడి రైతుల ప్రయోజనాలు పరిరక్షించాలి.

కోడి, పాడి రంగాల్లో అమెరికా వ్యూహం ఏమై ఉంటుంది ?
అమెరికా రైతులు కోడి కాళ్లను వదిలించుకుంటే, మిగిలిన భాగాలను 30 శాతం అదనంగా మార్కెట్‌ చేసుకుంటారు. భారతీయులు లెగ్‌ పీసులను ఎక్కువగా ఇష్టపడతారని వారికి తెలుసు. వాటికి ఇక్కడకు ఎగుమతి చేసి, స్థానిక మార్కెట్‌ను నాశనం చేస్తే, భవిష్యత్తులో అమెరికా నుంచే మొత్తం మార్కెట్‌ చేసుకోవచ్చన్నది వారి వ్యూహం. కోడి ఉత్పత్తుల్లో ప్రపంచంలో భారత్‌ది ప్రస్తుతం 4వ స్థానం. దీన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత.

పాడి ఉత్పత్తుల్లో అమెరికా దిగుమతులు అనుమతించడాన్ని ఎలా చూడాలి ?
కోడి పరిశ్రమ కంటే పాడి పరిశ్రమ చాలా పెద్దది. ఈ రెండు రంగాల్లో 2040 నాటికి దేశీయంగా రూ.15 - 20 లక్షల కోట్ల వ్యాపారం జరగనుందని అంచనా. ఇజ్రాయెల్‌లో ఒక ఆవు ఏడాదికి సగటున 12 వేల లీటర్ల పాలు ఇస్తే, మన దగ్గర  3 వేల లీటర్లు మాత్రమే. పాల ఉత్పత్తిలో మనం బాగా ఉన్నా,  పాల ఉత్పత్తుల వినియోగంలో 99 వ స్థానంలో ఉన్నాం.  మన మార్కెట్‌ విస్తృతికి ఉన్న అవకాశాలను విదేశీ సంస్థలు కొల్లగొట్టాలనుకుంటున్నాయి. 

ట్రంప్‌ పర్యటనకు ముందే కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా నివేదిస్తున్నారా ?
ఈ అంశాలన్నీ సంబంధిత మంత్రిత్వ శాఖకు నివేదిస్తున్నాం. ప్రభుత్వం కూడా తెలివి తక్కువగా వ్యవహరిస్తుందని అనుకోవడం లేదు.

కరోనా వైరస్‌ ప్రభావం దేశ కోడి మాంసం, గుడ్లపై ఏమైనా ఉందా ?
కోడికి ఎలాంటి సమస్యా లేదు. చైనాలో కూడా కోడి వల్ల ఈ వైరస్‌ వచ్చిందని చెప్పకున్నా, ఇక్కడ కొన్ని సంఘాలు సామాజిక మాధ్యమాల్లో చెడుగా ప్రచారం చేస్తున్నాయి. నిజానికి కరోనా వైరస్‌ నుంచి మనం శరీరం తట్టుకునేందుకు కోడి మాంసం, గుడ్డు సహకరిస్తాయి.

- ఈనాడు, హైదరాబాద్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.