close

ప్రధానాంశాలు

ఆర్థికానికి ఆలంబన  

రెపో - రివర్స్‌ రెపో రేటును 0.4% తగ్గించిన ఆర్‌బీఐ
20 ఏళ్లలోనే కనిష్ఠ స్థాయికి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతికూల వృద్ధి!

ఊహించని విధంగా ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. 20 ఏళ్ల కనిష్ఠ స్థాయికి అవి చేరాయి. బ్యాంకు ఈఎంఐ చెల్లింపులపై మారటోరియాన్ని మరో 3 నెలల పాటు అంటే ఆగస్టు వరకు పొడిగించింది. నాలుగు దశాబ్దాలలోనే తొలిసారిగా వృద్ధి ప్రతికూలంగా నమోదవుతుందన్న అంచనాల నేపథ్యంలో ఆర్థికానికి ఊతమిచ్చేందుకు ఆర్‌బీఐ ప్రయత్నిస్తోంది.

‘కరోనా వైరస్‌ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ముందుగా అంచనా వేసినదాని కంటే తీవ్రంగా కనిపిస్తోంది. వివిధ రంగాలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఆర్థిక కార్యకలాపాలు కుంటుపడడమే కాకుండా.. ప్రజల జీవితాలు, ఆరోగ్యంపైనా  గట్టి ప్రభావం పడింది’

- ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

ఆర్‌బీఐ (రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) మళ్లీ కీలక రేట్లలో కోత విధించింది. రెపో రేటును మరో 40 బేసిస్‌ పాయింట్లను తగ్గించి 4 శాతానికి పరిమితం చేసింది. 2000 సంవత్సరం తర్వాత ఇది ఈ స్థాయికి చేరడం ఇప్పుడే. రివర్‌ రెపో రేటును సైతం 3.75% నుంచి 3.35 శాతానికి చేరుస్తూ శుక్రవారం జరిగిన పరపతి విధాన కమిటీ (ఎమ్‌పీసీ) సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీంతో గృహ, వాహన, ఇతర రుణాలపై వడ్డీ రేటు తగ్గేందుకు వీలు కల్పించినట్లయింది. అదే సమయంలో డిపాజిట్లపై వడ్డీ రేటు కూడా తగ్గొచ్చు. ఎమ్‌పీసీలోని ఆరుగురు సభ్యుల్లో అయిదుగురు కీలకరేట్లలో 40 బేసిస్‌ పాయింట్ల కోతకు; చేతన్‌ఘటె మాత్రం 25 బేసిస్‌ పాయింట్ల కోతకు ఓటు వేశారు. సర్దుబాటు విధానాన్ని కొనసాగించడానికి ఎమ్‌పీసీ నిర్ణయించిందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. అంటే అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని కోతలు ఉంటాయని పరోక్షంగా తెలియజేశారు..


ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం

కరోనా లాక్‌డౌన్‌ల నేపథ్యంలో, ఆర్థిక వృద్ధిపై ఆర్‌బీఐ తొలిసారిగా అధికారికంగా తన అంచనాలను వెలువరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో జీడీపీ ప్రతికూలంగా నమోదు కావొచ్చని పేర్కొంది. దేశ పారిశ్రామికోత్పత్తిలో 60 శాతాన్నిచ్చే అగ్రగామి ఆరు పారిశ్రామిక రాష్ట్రాలు ఇంకా రెడ్‌, ఆరెంజ్‌ జోన్‌లలో ఉండడంతో దేశీయ ఆర్థిక కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని దాస్‌ వెల్లడించారు. ప్రైవేటు పెట్టుబడులు, వినియోగంపైనా తీవ్ర ప్రభావం కనిపించిందన్నారు. గిరాకీ క్షీణతతో పాటు సరఫరాలో ఇబ్బందుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడవచ్చని.. ద్వితీయార్థంలో పుంజుకోవచ్చని పేర్కొన్నారు.  


ద్రవ్యోల్బణం.. చెప్పలేం..

కరోనా కారణంగా ద్రవ్యోల్బణంపై అంచనాలను చెప్పలేమని దాస్‌ అన్నారు. పప్పుధాన్యాల ధరలు పెరుగుతాయన్న ఆందోళనలు ఇందుకు నేపథ్యమని ఆయన వివరించారు. 2020-21 తొలి భాగంలో ద్రవ్యోల్బణం ఎక్కువగానే నమోదు కావొచ్చని.. మూడు లేదా నాలుగో త్రైమాసికంలో 4 శాతం దిగువకు రావొచ్చని ఆయన అంచనా వేశారు.
* కార్పొరేట్లకు ప్రస్తుత అర్హతగా ఉన్న మూలధనంపై 25% రుణ పరిమితిని 30 శాతానికి ఆర్‌బీఐ పెంచింది. అంటే పెద్ద కంపెనీలు బ్యాంకుల నుంచి మరిన్ని రుణాలను తీసుకోవడానికి వీలుకల్పించినట్లయింది.
* రుణ వాయిదాలపై ఆగస్టు 31, 2020 వరకు మారటోరియాన్ని ప్రకటించడంతో పాటు.. మూలధనంపై వడ్డీ చెల్లింపులపైనా మూడు నెలల మారటోరియానికి ఆర్‌బీఐ అనుమతులు ఇచ్చింది.
* ఎగ్జిమ్‌ బ్యాంక్‌కు రూ.15,000 కోట్ల రుణ సహాయాన్ని అందించనుంది.
* ఎగుమతులకు ముందు, తర్వాత బ్యాంకుల నుంచి పొందే రుణాలకిచ్చే గరిష్ఠ గడువును ప్రస్తుత 12 నెలల నుంచి 15 నెలలకు ఆర్‌బీఐ పొడిగించింది. జులై 31లోగా చేసుకునే దిగుమతులకు చెల్లింపుల గడువును 6 నెలల నుంచి 12 నెలలకు పొడిగించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.