close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అప్రదాన ఆస్తుల విక్రయానికి జీఎంఆర్‌ మొగ్గు

ఈనాడు, హైదరాబాద్‌: తన ప్రధాన వ్యాపార కార్యకలాపాలకు వెలుపల ఉన్న ఆస్తులను విక్రయించాలని జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ భావిస్తోంది. ఇందులో భాగంగా విద్యుత్తు ప్రాజెక్టులు, పారిశ్రామిక మండళ్లలోని భూములు, బీఓటీ రోడ్డు ప్రాజెక్టులు విక్రయించేందుకు ఆసక్తిగల పెట్టుబడిదార్లతో సంప్రదింపులు సాగిస్తున్నట్లు జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తాజాగా మదుపరుల నివేదికలో (ఇన్వెస్టర్‌ ప్రెజెంటేషన్‌) వెల్లడించింది.  విద్యుత్తు విభాగంలోని జీఎంఆర్‌ ఎనర్జీ లిమిటెడ్‌కు చెందిన బార్జ్‌ మౌంటెడ్‌ పవర్‌ ప్లాంటును విక్రయించడానికి ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదేవిధంగా కమలాంగ ఎనర్జీని జేఎస్‌డబ్లూ ఎనర్జీకి విక్రయించటానికి ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ కొవిడ్‌-19 అనిశ్చితి వల్ల ఆ ఒప్పందం రద్దయింది.

భూముల విక్రయంపై దృష్టి
పారిశ్రామిక మౌలిక సదుపాయాల విభాగంలోని ప్రాజెక్టులైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కాకినాడ ప్రత్యేక పెట్టుబడి ప్రాంతం (కే-ఎస్‌ఐఆర్‌), తమిళనాడులోని కృష్ణగిరి ఎస్‌ఐఆర్‌ ప్రాజెక్టుల్లో కొంతమేరకు భూములు విక్రయించాలని, మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులు చేపట్టాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించింది.

కాకినాడ ఎస్‌ఐఆర్‌లో 10,400 ఎకరాల స్థలం ఉంది. ఇందులో 4,650 ఎకరాల స్థలాన్ని ఎస్‌ఈజడ్‌ గా నోటిఫై చేశారు. ఇక్కడ భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయటానికి ముందుకు వచ్చిన సంస్థలతో ఇప్పటికే సంప్రదింపులు సాగుతున్నాయి.

* ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొంతకాలం క్రితం హల్దియా పెట్రోకెమికల్స్‌లో పెట్రో రసాయనాల రిఫైనరీ ఏర్పాటుకు సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని 2,500 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా 2,000 ఎకరాల స్థలంలో హెచ్‌పీసీఎల్‌- గెయిల్‌ బృందం పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయటానికి ముందుకు వచ్చింది. ఇదేకాకుండా చైనా సంస్థ ఒకటి అతిపెద్ద స్టెయిన్‌లెస్‌ స్టీలు తయారీ కంపెనీకి 500 ఎకరాలు, ఆస్ట్రేలియాకు చెందిన సంస్థకు లీథియమ్‌ రిఫైనరీ నెలకొల్పటానికి 100 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. కాకినాడ ఎస్‌ఐఆర్‌లో భాగంగా 1950 ఎకరాల విస్తీర్ణంలో   16 మిలియన్‌ టన్నుల సరకు రవాణా సామర్థ్యంతో నౌకాశ్రయాన్ని నిర్మించాలనే ప్రణాళిక ఉన్నట్లు  జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా వెల్లడించింది.  మొత్తం మీద కొన్ని విభాగాల్లో కార్యకలాపాలు తగ్గించుకోవటం లేదా పూర్తిగా వైదొలగటం వైపు జీఎంఆర్‌ గ్రూపు మొగ్గుచూపుతున్నట్లు స్పష్టమవుతోంది. తద్వారా సమీప భవిష్యత్తులో  విమానాశ్రయాల అభివృద్ధి, నిర్వహణ విభాగాల్లో దృష్టి కేంద్రీకరించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.